Hepatitis Day : హెపటైటిస్ ముట్టుకుంటే వచ్చేస్తుందా? వాస్తవాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న వైద్యులు
Hepatitis Day 2025 : హెపటైటిస్ మద్యం, సాధారణ స్పర్శ ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుందని అనుకుంటున్నారా? అయితే మీకు ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేదనే అర్థం. దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.

Myths About Hepatitis : ప్రపంచవ్యాప్తంగా దాదాపు 345 మిలియన్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ B, C ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారు. కాలేయాన్ని ప్రభావితం చేసే వాపును హెపటైటిస్ అంటారు. ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేక చాలామంది అపోహలనే నమ్మేస్తారు. అలాగే వీటిని సకాలంలో నిర్ధారించలేము. కాబట్టి చికిత్స, నివారణ చర్యలు కూడా ఆలస్యమై.. మరింత ప్రమాదంగా మారుతుంది. అందుకే దీనిని ప్రాణాంతక వ్యాధిగా చెప్తున్నారు గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ పవన్ ధోబలే. WHO ప్రకారం.. వైరల్ హెపటైటిస్ ప్రతి సంవత్సరం 1.1 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంటుంది. ఇది క్షయవ్యాధి కారణంగా సంభవించే మరణాలకు సమానంగా ఉంటుంది. అలాగే HIV/AIDS కంటే ఎక్కువ.
అపోహ : హెపటైటిస్ ఆల్కహాల్ వల్లే వస్తుందా?
వాస్తవం : హెపటైటిస్ ఆల్కహాల్ సేవించడం వల్ల లేదా కొన్ని రకాల మందుల వల్ల వస్తుందనేది నిజమే. అయినప్పటికీ.. ఈ వ్యాధికి ప్రధాన కారణం వైరల్ ఇన్ఫెక్షన్లు. ప్రధానంగా హెపటైటిస్ B, C సాధారణంగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, సిర్రోసిస్, హెపాటో సెల్యులర్ కార్సినోమాకు దారితీస్తాయి. మరోవైపు హెపటైటిస్ A, E సాధారణంగా వైరస్ సోకిన ఆహారం లేదా నీటి ద్వారా వచ్చే స్వల్పకాలిక రుగ్మతలు. హెపటైటిస్ స్వయం ప్రతిరక్షక రుగ్మతలు లేదా జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది. ఇది ఏ విధంగానూ ఆల్కహాల్ లేదా డ్రగ్స్‌తో సంబంధం కలిగి ఉండకపోవచ్చు.
అపోహ : హెపటైటిస్ B, C పరిచయం ద్వారా వ్యాప్తి చెందుతాయా?
వాస్తవం: మరో అపోహ ఏమిటంటే.. హెపటైటిస్ B లేదా C ఉన్న వ్యక్తిని కౌగిలించుకోవడం వంటి సాధారణ పరిచయం ద్వారా వచ్చేస్తుందనుకుంటారు. అయితే ఈ వైరస్‌లు రక్త సంబంధిత వ్యాధికారకాలు. ప్రధానంగా రక్తం, శరీర స్రావాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. హెపటైటిస్ B లైంగిక సంబంధం, సూదుల ద్వారా, ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందడం జరుగుతాయి. హెపటైటిస్ C ప్రధానంగా రక్తం నుంచి రక్తం ద్వారా నేరుగా వ్యాపిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. సాధారణ పరస్పర చర్యల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువ అని తెలిపింది.
అపోహ : లక్షణాలు కనిపించే వారికి మాత్రమే హెపటైటిస్?
వాస్తవం: దీర్ఘకాలిక హెపటైటిస్ B, C క్యారియర్‌లకు ఎక్కువ కాలం పాటు ఎటువంటి లక్షణాలు ఉండవు. వ్యాధి నెమ్మదిగా పెరగడం వల్ల భారీగా కాలేయానికి నష్టం జరుగుతుంది. తర్వాత అలసట లేదా కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల వ్యాధిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే లక్షణాల కోసం చూస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
అపోహ : హెపటైటిస్ C నయం కాదట..
వాస్తవం: చికిత్స ద్వారా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. హెపటైటిస్ C ఇప్పుడు 95% కంటే ఎక్కువ సందర్భాల్లో నయం అవుతుంది. ఈ కొత్త DAAs 8 నుంచి 12 వారాల వ్యవధిలో వైరస్‌ను తొలగించడంలో హెల్ప్ చేస్తాయి. తద్వారా రోగులు త్వరగా రికవరీ అవుతారు. ప్రారంభంలో రోగ నిర్ధారణ చేస్తే.. చికిత్సతో దానిని చాలావరకు త్వరగా దూరం చేసుకోవచ్చు. కాలేయ నష్టాన్ని కూడా తిప్పికొట్టవచ్చు.
అపోహ : హెపటైటిస్ B ని హెపటైటిస్ C లాగా నయం అవుతుంది
వాస్తవం: హెపటైటిస్ B ని యాంటీ-వైరల్ మందులతో కంట్రోల్ చేయవచ్చు. అయితే ఇది చాలామంది రోగుల్లో మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ మందులు వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా, వైరస్ పునరుత్పత్తిని నిరోధిస్తాయి. కానీ ఒక ఫంక్షనల్ నయం కావడం అనేది అరుదుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మందులు తీసుకునేవారిలో 1 నుంచి 3 శాతం మాత్రమే మంచి ఫలితాలు ఉంటున్నాయి. అందుకే దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయి.
అపోహ : హెపటైటిస్ టీకాలు పెద్దలకు మాత్రమేనా?
వాస్తవం: హెపటైటిస్ Bకి టీకాలు వేయించుకోవడానికి ఉత్తమ సమయం పెద్దలకే అనుకుంటారు. కానీ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. WHO ప్రకారం పుట్టిన 24 గంటలలోపు మొదటి డోస్‌ను ఇవ్వాలని.. చిన్నతనంలో అదనపు మోతాన్ని సిఫార్సు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ కార్మికులు, సోకిన రోగుల సన్నిహిత భాగస్వాములతో పాటు.. ప్రమాదంలో ఉన్న పెద్దలు కూడా టీకాలు తీసుకోవాలి. హెపటైటిస్ Bకి వ్యతిరేకంగా టీకాలు వేసే విధానాన్ని అమలు చేసిన దేశాలు.. పిల్లలలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ రేట్లలో 90 శాతం కంటే ఎక్కువ తగ్గింపును చూపించాయి. ఇది హెపటైటిస్ B నివారణను సూచిస్తుంది.
అపోహ : మూలికా లేదా సహజ సప్లిమెంట్లే మంచిదా?
వాస్తవం: మూలికలు, సహజమైన సప్లిమెంట్లు ప్రజాదరణ పొందినప్పటికీ.. అవీ కూడా కాలేయ ఆరోగ్యానికి ప్రమాదాలు కలిగిస్తాయి. గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్, కవా వంటి కొన్ని కాలేయానికి హాని కలిగిస్తాయి. ఆహార సప్లిమెంట్లు తీసుకునేప్పుడు దీనిపై కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.






















