Baby Health: శీతాకాలంలో పసిపిల్లల్ని ఇలా కాపాడుకోండి, లేదంటే వ్యాధుల బారిన పడతారు
చలికాలంలో నవజాత శిశువులని వెచ్చగా ఆరోగ్యంగా ఉంచడటం చాలా ముఖ్యం.
చలికాలంలో పెద్ద వాళ్ళు చలికి వణికిపోతూ రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటిది మరి పసి పిల్లల పరిస్థితి ఏంటి? వారిని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి టైమ్ లో నవజాత శిశువులు వ్యాధులకు ఎక్కువగా గురవుతారు. అందుకే శీతాకాలంలో వారి పట్ల నిరంతర సంరక్షణ చాలా అవసరం. వాతావరణంలో సూక్ష్మజీవులు, వైరస్ లు వృద్ధి చెందుతూ ఉంటాయి. బలమైన రోగనిరోధక శక్తి లేనందున శిశువులు త్వరగా వాటి బారిన పడిపోతారు. అంతే కాదు పెద్దవారి కంటే పసి పిల్లలు త్వరగా శరీర వేడిని కోల్పోతారు. చలికి వణుకుతున్నప్పుడు శరీరంలో వేడిని పెంచే సామర్థ్యం కలిగి ఉండరు. కారణం వారి శరీరంలో కొవ్వు అనేది ఉండదు. అందుకే మీ బుజ్జాయిలని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.
నిండైన దుస్తులు వేయాలి
మందపాటి నిండుగా ఉండే దుస్తులు మీ చిన్నారులకి వేసుకోవాలి. బిడ్డ వెచ్చగా ఉండేందుకు పొడవాటి చేతులు, కాళ్ళు ఉండే ప్యాంట్ టీ షర్టులు ఎంచుకోవడం ఉత్తమం. అరచేతులు, కాళ్ళు వేడిగా ఉండేందుకు వాళ్ళకి గ్లౌజులు వేయడం అసలు మరచిపోవద్దు. కాటన్, మస్లీన్ వంటి దుస్తులు ఎంచుకోవాలి. అవి బిడ్డ శ్వాసక్రియకు కూడా అనువుగా ఉంటాయి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు డైపర్స్ చెక్ చేస్తూ మారుస్తూ ఉండాలి.
గది వేడిగా ఉండేలా చూసుకోవాలి
బయట చల్లటి గాలుల కారణంగా ఇంట్లో కూడా చలిగా ఉంటుంది. ఇంట్లో తేమ తక్కువగా ఉండటం వల్ల శిశువు చర్మం కూడా పొడిగా మారిపోతుంది. అందుకే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంచుకోవాలి. శిశువు ఉండే గది వెచ్చగా ఉండటం వల్ల శీతాకాలపు చలిగాలుల వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గదిలో తేమ స్థాయిలు సరిగా ఉండే విధంగా హ్యూమిడిఫైయర్లు అమర్చుకోవడం మంచిది.
మాయిశ్చరైజర్
శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. శీతాకాలంలో వారి చర్మం పొడి బారిపోతుంది. అందుకే వారి చర్మాన్ని రక్షించుకునేందుకు స్కిన్ మాయిశ్చరైజర్ వాడటం మంచిది. దీని వల్ల వాళ్ళకి స్కిన్ చికాకు ఉండదు.
టీకాలు తప్పనిసరి
శీతాకాలంలో నవజాత శిశువు అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండి. అందుకే బిడ్డకు సరైన సమయంలో టీకాలు వేయించడం చాలా ముఖ్యం. వైద్యులు చెప్పిన దాని ప్రకారం సరైన షెడ్యూల్ కి టీకాలు వేయించడం మరచిపోవద్దు.
తల్లిపాలు ముఖ్యం
బిడ్డకి తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లి పాలలో యాంటీ బాడీలు, పోషకాలు ఉంటాయి. ఇవి శిశువు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, రోగాల బారి నుంచి వారిని సంరక్షించడంలో సహాయపడతాయి. తల్లిపాల ద్వారా శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. బిడ్డ తల్లి ఒడిలో ఉండటం వల్ల మీ వెచ్చదనం బిడ్డకి విశ్రాంతినిస్తుంది.
పరిశుభ్రత పాటించాలి
ముందుగా తల్లి పరిశుభ్రంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. బిడ్డను తాకడానికి ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవడం చేయాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.