Ghosts: మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూశారా? అవి కొందరికే ఎందుకు కనిపిస్తాయి?
అందరూ దయ్యాలను లేదా ఆత్మలను చూడలేరు. కొంత మందికే అవి కనిపిస్తాయని తెలుస్తోంది. పారానార్మల్ ఎన్ కౌంటర్లు ఎవరిని ఎక్కువగా ఆకర్శిస్తాయి? ఎందుకు కొందరికే దయ్యాలు కనిపిస్తాయనే విషయాన్ని ఇక్కడి చర్చిద్దాం.
కొంత మంది దయ్యాలు లేవని వాదిస్తే.. కొంతమంది ఉన్నాయని అంటారు. కేవలం అనడం మాత్రమే కాదు, తామూ చూశామని చాలా కచ్చితంగా కూడా చెబుతారు. మరి మీరేమంటారు దయ్యాలు లేవంటారా లేదా మీరు కూడా దయ్యాన్ని చూశానని అంటారా? ఒక వేళ చూసి ఉంటే జనాభాలో 18 శాతం మంది దయ్యాలను చూశామని గట్టిగా వాదించే వారిలో మీరొకరు. బాధ పడకండి మీరు ఒంటరి వారు కాదు. ఈ అనుభవం చాలామందికి ఉంది.
దయ్యాలు లేదా ఆత్మలు కనిపించాలంటే ముందు వాటి పట్ల విశ్వాసం ఉంటే అది సాధ్యపడుతుంది. దీని గురించి సామాజిక శాస్త్రవేత్త క్రిప్టోఫర్ మాట్లాడుతూ ‘‘ఇంట్లో దయ్యం ఉండాలంటే ముందుగా ఇంట్లో ఎవరో ఒకరు ఇంట్లో దయ్యం ఉందని నమ్మాలి.’’ అని అన్నారు. మన ఆలోచనలు, అంచనాలు, మన ఇంద్రియ స్పందన వంటి వన్నీ కలిసి మన పరిసరాలలో జరిగే విషయాలను రిసీవ్ చేసుకునే విధానం ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రమాదం ఉందని కచ్చితంగా తెలియనపుడు, ఒక అనిశ్చితి ఉన్నపుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. అలాంటి ప్రదేశాల నుంచి ముందుగా బయట పడాలని అనుకుంటాం. ఇలాంటి స్పందన మనలను పారానార్మల్ విషయాల మీద మరింత నమ్మకానికి కారణం అవుతుంది. ఈ నమ్మకమే మనకు దయ్యాలు కనిపించేందుకు కారణం అవుతుంది. 2013లో ప్రచురితమైన ఒక అధ్యయనం అతీంద్రియ అనుభవాలు చాలా వరకు భయం గొలిపే లేదా అస్పష్టమైన పరిసరాల్లోనే ఎక్కువగా ఎదురవుతాయని తీర్మానించింది.
దయ్యాల మీద నమ్మకం ఉన్న వారికి కీచురాళ్ల శబ్దాలు, తలుపుల చప్పుడు వంటివి పారానార్మల్ శక్తుల పనిగా అనిపిస్తే అటువంటి నమ్మకం లేని వారు లాజిక్ ల కోసం వెతకవచ్చు. ఇలా పారానార్మల్ నమ్మకాల వల్లే చాలా మంది దయ్యాలను చూడడం సాధ్యపడుతుంది. పూర్తి జనాభాలో కనీసం 75 శాతం మందిలో కనీసం ఒకరైనా పారానార్మల్ నమ్మకం కలిగి ఉన్నారని, 50 శాతం మంది పారానార్మల్ నమ్మకాలు కలిగి ఉన్నారని ఒక సర్వేలో తేలిందట.
సైకాలజిస్ట్ లు ఈ పారానార్మల్ నమ్మకాలను అంచనా వేసేందుకు ఉపయోగించే పద్దతి రివైజ్డ్ పారానార్మల్ బిలీఫ్ స్కేల్. దీనిని జెరోమ్ టోబాసిక్ లో ప్రచురించారు. ఈ స్కేల్ పారానార్మల్ నమ్మకాన్ని ఆరు వర్గాలు గా విభజించి కొలుస్తుంది.
- భవిష్యత్తును ఊహించగలగడం
- ఆసాధారణ జీవుల గురించి నమ్మకం (ఎలియన్స్ ఉన్నాయని, బిగ్ ఫూట్ లేదా లోచ్నెస్ మాన్స్టర్స్ గురించిన నమ్మకాలు)
- స్పిరిచ్యువలిజం (ఆత్మలతో కమ్యునికేషన్)
- మూఢనమ్మకం (జ్యోతిష్యం, 13 సంఖ్య దుష్ట సంఖ్య వంటి నమ్మకాలు)
- మంత్ర విద్య ( చేతబడి వంటివి నమ్మడం
- సై (సైకోనిసిస్, మైండ్ రీడింగ్ వంటి వాటి మీద నమ్మకం)
టోబాసిక్ స్కెల్ ఇతర కొలమానాల ద్వారా పారానార్మల్ విషయాలను నమ్మే వ్యక్తులు కొన్ని కుట్ర సిద్ధాంతాలను, సూడో సైన్స్ ను ఎక్కువగా నిజమని వాదిస్తారు. అయితే ఈ నమ్మకాల్లో స్త్రీ పురుషుల్లో తేడాలు కూడా గుర్తించారు. పురుషులు లోచ్నెస్ మాన్ట్సర్, ఎలియన్స్ వంటి వాటిని నమ్మితే.. దయ్యాలు, ఆత్మలు, అతీంద్రీయ శక్తుల గురించిన నమ్మకాలు స్త్రీలలో ఎక్కువట. ఇలాంటి నమ్మకాలకు పసితనంలో ఏర్పడిన ట్రామా కూడా కారణం అయ్యే ఆస్కారం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Also read : ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.