ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?
ఐరన్ లోపానికి మానసిక స్థితికి మధ్య ఉండే సంబంధాన్ని గురించి ఈ పరిశోధన వివరిస్తుంది. మానసిక సంతులనానికి శరీరంలో ఐరన్ స్థాయిలకు ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుందాం.
శరీరంలో ఐరన్ లోపం అంటే సరిపడిన మొత్తంలో ఐరన్ లేకపోవడాన్ని సూచిస్తుంది. ఐరన్ శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో చాలా ముఖ్యమైంది. ఐరన్ లోపం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని కొత్త పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. ఐరన్ లోపం ఏర్పడితే డిప్రెషన్, యాంక్జైటీ, స్ర్కీజోఫినియా వంటి మానసిక సమస్యలు తీవ్రమవుతాయట.
సాధారణంగా శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే చాలా త్వరగా అలసి పోతారు. చిన్న చిన్న పనులకే శ్వాస బరువుగా మారి ఇబ్బంది పెట్టవచ్చు. చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది. గుండె లయ పెరిగిన భావన కలుగుతుంది. అప్పుడప్పుడు గుండె చప్పుడు మీకే వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి అకస్మాత్తుగా కళ్లు తిరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది.జుట్టు కూడా ఎక్కువగా రాలుతుంది. ఆహారం కాని పేపర్, సున్నం, బలపాల వంటివి తినాలని అనిపిస్తుంది. గోళ్లు పలుచబడి విరిగిపోతుంటాయి. రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ కూడా అంటే కాళ్లు కదలకుండా పెట్టుకోలేరు అదేపనిగా కదిలిస్తుంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇది స్త్రీలలో ఎక్కువ. ఇవన్నీ కూడా శారీరకంగా కనిపించే లక్షణాలు కానీ ఐరన్ లోపం మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని కొత్త పరిశోధనలు వివరిస్తున్నాయి.
మానసిక సంతులనను నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి ఐరన్ కీలకమైంది. ఐరన్ తక్కువైనపుడు న్యూరోట్రాన్స్మీటర్ల పనితీరు దెబ్బతింటుంది. ఇది మానసిక అసంతులనకు కారణమవుతుంది. ఐరన్, న్యూరోట్రాన్స్మీటర్ల మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించేందకు ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. ఈ పరిశోధన ఐరన్ లోపం మానసిక ఆరోగ్య పరిస్థితుల మధ్య బలమైన సంబంధాన్ని గురించి చర్చించింది. ఐరన్ లోపాన్ని రక్తహీనత గా పరిగణిస్తారు. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులలో డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్, స్లీప్ డిజార్డర్స్ ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాల ఫలితాలు తెలుపుతున్నాయి.
రక్తహీనతతో బాధపడుతున్న వారు త్వరగా అలసిపోతారు. ఏకాగ్రత కూడా ఎక్కువ సమయం పాటు నిలపలేరు. డిప్రెషన్ కు కూడా రక్తహీనత కారణం కావచ్చు. ఐరన్ పుష్కలంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవడంవల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగ్గా ఉంటాయి. బీన్స్, డ్రైఫ్రూట్స్, గుడ్లు, ఐరన్ ఫార్టిఫైడ్ తృణధాన్యాలు, లీన్ రెడ్ మీట్, చికెన్ వంటి వాటన్నింటి నుంచి ఐరన్ లభిస్తుంది. కనుక ఐరన్ రిచ్ ఫూడ్ తీసుకోవడం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం.
మానసిక ఆరోగ్యం మీద ఐరన్ లోపం ప్రభావం గురించిన అవగాహన అటు పేషెంట్లలోనూ ఇటు ఆరోగ్య నిపుణులకు కూడా తక్కువే ఉంటుంది. మానసిక సమస్యలను ఎదుర్కోంటున్న వారు, లేదా ఇప్పటికే యాంగ్జైటీ వంటి సమస్యలు నిర్ధారించబడిన వారు ఐరన్ స్థాయిల గురించి కచ్చితంగా చర్చించాలి. అవసరమనుకుంటే తప్పకుండా సప్లిమెంట్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరం చురుకుగా ఉండేందుకు, ఉత్సాహంగా ఉండేందకు మాత్రమే కాదు మానసిక స్థితిని కూడా సంతులనంలో ఉంచేందుకు తోడ్పడుతుంది.
ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు మానసిక సంతులనంలో మార్పులు జరుగుతున్నపుడు ఒకసారి ఐరన్ స్థాయిలను కూడా పరీక్షించి చూసుకోవడం అవసరమని సలహా ఇస్తున్నారు. తగినంత ఐరన్ శరీరంలో ఉన్నపుడు డిప్రెషన్ వంటి అనారోగ్యాలను నివారించవచ్చు. అంతేకాదు ఇప్పటికే సమస్యలు నిర్ధారణ అయిన వారికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా చికిత్స మరింత ప్రభావశీలంగా ఉంటుంది.
అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అవసరమైతే సప్లిమెంట్లు కూడా వాడాలి. అయితే కొన్ని సార్లు మనం ఆహారంతో పాటు తీసుకునే పానీయాలు శరీరాన్ని ఐరన్ గ్రహించకుండా నిరోధిస్తుంటాయి. అలాంటి వాటిలో కాఫీ, టీలు ముఖ్యమైనవి. భోజనం తర్వాత వెంటనే టీ లేదా కాఫీ తీసుకోవద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.