Puberty: చిన్న వయసులోనే ఆడపిల్లలు ఎందుకు రజస్వల అవుతున్నారు?
ఆడపిల్లకు పదేళ్ల రాకముందే రజస్వల అవుతున్న ఘటనలు చాలా చోట్ల ఎదురవుతున్నాయి.
ఒకప్పుడు ఆడపిల్ల రజస్వల అవ్వాలంటే కనీసం పన్నేండేళ్ల వయసు దాటేది. పన్నేండేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు అధిక శాతం ఆడపిల్లలు రజస్వల అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంకా అమ్మ కొంగు పట్టుకుని తినే చిన్న చిన్న పిల్లలు కూడా అయిపోతున్నారు. కేవలం తొమ్మిది, పదేళ్ల వయసు ఆడపిల్లలు రజస్వల అయిన ఘటనలు ఎన్నో. ఎందుకిలా జరుగుతుంది? ఇరవై ఏళ్ల క్రితానికి ఇప్పటికీ పరిస్థితిలో ఎందుకంత మార్పొచ్చింది? ఇప్పటి పిల్లల్లో యుక్తవయసు ప్రక్రియ త్వరగా ప్రారంభమైపోవడానికి కారణం ఏమిటి?
యుక్త వయసు ప్రక్రియ మొదలయ్యేది ఎప్పుడంటే...
మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుదలలో ముందుంటారు. ఆడపిల్లకి పదేళ్లు రాగానే వారిలో శారీరకమైన మార్పులు మొదలవుతాయి. ఛాతీ పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాదు వైట్ డిశ్చార్జ్ కూడా కొన్ని నెలల పాటూ సాగుతుంది. చివరికి వారు రజస్వల అవుతారు. పదేళ్ల వయసులో మొదలైన ప్రక్రియ రెండు మూడేళ్ల పాటూ కొనసాగి అప్పుడు రజస్వల అయ్యేవారు ఒకప్పుడు. ఇది బాల్యానికి చివరి దశ. రజస్వల అయ్యారు అంటే అర్థం వారి హైపోథాలమస్, పిట్యూటరీ, అండాశయాలు పరిపక్వ స్థితికి చేరుకున్నాయి అని అర్థం.కానీ పదేళ్లు, పదేళ్ల కన్నా తక్కువ వయసులో పిల్లలు రజస్వల కావడం మాత్రం అసాధారణమే. ఏడు,ఎనిమిదేళ్ల ఆడపిల్లలు రజస్వల అయితే ఆ పరిస్థితిని ‘ప్రికాషియస్ ప్యూబర్టీ’ అంటారు.
కారణాలేంటి?
పదేళ్ల లోపే రజస్వల అవుతున్నారు అంటే వారి శరీరంలో ఏదో చిన్న ఆరోగ్య సమస్య ఉందని అర్థం. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని ఆడపిల్లల్లో ఇలా జరుగుతుంది. తలకు దెబ్బతగలడం, మెదడు ఇన్ఫెక్షన్, మెదడులో కణుతులు ఉన్నా కూడా చాలా చిన్న వయసులో రజస్వల అయిపోతారు. అయితే అందరిలో ఇవే సమస్యలు ఉన్నాయని చెప్పలేం. పదేళ్ల లోపు రజస్వల అయినా 74 శాతం ఆడపిల్లల్లో ఎలాంటి సమస్య లేదు.
ఆహార ప్రభావం...
ఒకప్పటి ఆహారం వేరు. అంతా సహజసిద్ధంగా ఉండేది. అందుకే శరీర ప్రక్రియలన్నీ వయసుకు తగ్గట్టు జరిగేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. తినే తిండి కూడా మారింది. అంతా ప్రాసెస్డ్ ఆహారం. వాటి వల్ల కూడా ఆడపిల్లల శరీరాలపై ప్రభావం అధికంగానే పడుతున్నట్టు చెబుతున్నారు వైద్యులు. అధిక శాతం కేలరీలు, పోషకాలు ఒంట్లో చేరి వారిలో ముందస్తు ఎదుగుదలను ప్రోత్సహిస్తున్నాయని చెబుతున్నారు. త్వరగా పొడవు పెరగడం, బరువెక్కడం, ఛాతీ పెరగడం, యుక్త వయసు ఛాయలు మొదలయ్యే ప్రక్రియ చిన్నవయసులోనే ప్రారంభమవ్వడం వంటివి జరుగుతున్నాయి.