HeatWave: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఆరోగ్య శాఖ సూచనలు
ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వడదెబ్బ తగలకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఏప్రిల్ నెల ఎండలతో మండి పోయింది. 122 ఏళ్లలో ఏప్రిల్ నెలలో ఇంత ఎండలు రావడం ఇదే తొలిసారి. ఇక మే నెల మామూలుగా ఉండదన్న విషయం అర్థమైపోయింది. తీవ్రమైన వేడి గాలులు, ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని కచ్చితంగా పాటించి ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవాలని సూచిస్తోంది.
చేయాల్సినవి...
1. దాహం వేయకపోయినా నీళ్లు తాగుతూనే ఉండాలి. వేసవిలో దాహం వేసిందంటే డీహైడ్రేషన్ సమస్య మొదలయ్యే అవకాశం ఉందని అర్థం.
2. బయటికి వెళ్లేటప్పుడు కచ్చితంగా నీళ్ల బాటిల్ తీసుకుని వెళ్లాలి.
3. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
4. ఎప్పటికప్పుడు పండ్ల రసాలు, నిమ్మరసాలు, మజ్జిగ, వంటివి కాస్త ఉప్పు కలుపుకుని తాగుతూ ఉండాలి.
5. వేసవిలో అందుబాటులో ఉండే పండ్లను తింటూ ఉండాలి. ముఖ్యంగా పైనాపిల్, కీరాదోస, ఆరెంజ్, ద్రాక్షలు, మస్క్ మెలన్, పుచ్చకాయ వంటివి తింటూ ఉండాలి.
6. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి.
7. వీలైనంత వరకు ఎర్రటి ఎండల్లో బయటకు వెళ్లకుండా ఉండడమే ఉత్తమం.
8. ఉదయం పూట వేడి గాలులు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు వేసే ఉంచాలి.
చేయకూడనివి...
1. ఎంతో అత్యవసరం అయితే తప్ప మధ్య 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి.
2. వంట ఉదయం పదిగంటల్లోపు పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత చేస్తే ఇంట్లోని వాతావరణం కూడా వేడిగా మారిపోతుంది.
3. వండేటప్పుడు ఆ వేడి బయటికి పోయేలా కిటికీలు తెరిచి ఉంచాలి.
4. ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్ డ్రింకులు తాగకూడదు.
5. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని, నిల్వ చేసిన ఆహారాన్ని తినకూడదు.
6. పిల్లలను, పెంపుడు జంతువులను కార్లో ఉంచి షాపులకు వెళ్లడం వంటివి చేయవద్దు.
వీరు జాగ్రత్త
చిన్నపిల్లలు, గర్భిణిలు, ముసలివారు వేడి గాలులను తట్టుకోలేరు. మానసిక అనారోగ్యాలతో బాధపడేవారు, ఇతర శారీరక అనారోగ్యాలు కలవారు కూడా ఇంత ఉష్ణోగ్రతలను, వేడి గాలులను భరించలేరు. అలాగే గుండెపోటు, అధిక రక్తపోటు ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరు నీళ్లు తాగుతూనే ఉండాలి. ఎండల్లో బయటికి వెళ్లకుండా నీడ పట్టునే ఉండాలి. చెమటలు పట్టేలా ఏ పనులు చేయకూడదు. నెలల వయసున్న చిన్నారులకు పాలు, నీళ్లు తరచూ పట్టిస్తూ ఉండాలి.
Also read: ప్రపంచంలో తొలి ఫాస్ట్‌ఫుడ్ సమోసానే, మనదేశానికి ఎలా వచ్చిందంటే
Also read: అన్నం అధికంగా తింటే మహిళల్లో మెనోపాజ్ త్వరగా వచ్చేస్తుందా?