Carrot: అలెర్జీ ఉన్నవాళ్ళు పచ్చి క్యారెట్ తినకూడదా? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
క్యారెట్ పచ్చిగా లేదా ఉడికించుకుని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా..
క్యారెట్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. కూర, వేపుడు, హల్వా ఇలా క్యారెట్ తో ఏ వంటకం చేసిన లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు. మరి కొంతమంది పచ్చి క్యారెట్ తినడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు. రోజుకో క్యారెట్ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టేయవచ్చని వైద్య నిపుణులు కూడా చెప్తూనే ఉంటారు. అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో క్యారెట్ తర్వాతే ఏ కూరగాయ అయినా ఉంటుంది. కంటి చూపు ఆరోగ్యాన్ని పెంచడం దగ్గర నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నిరోధించి కొవ్వు తగ్గించే వరకు సహాయపడే ఆహారం ఏదైనా ఉంది అంటే అది క్యారెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
క్యారెట్లలో బీటా కెరోటిన్, కెరొటీనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌లోని ఫాల్కారినోల్ శక్తివంతమైన ఫంగస్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ఇది అంతర్గత, బాహ్య ఫంగల్ ఇన్‌ఫెక్షన్, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఫాల్కారినోల్ అనేది యాంటీ డామినెన్స్, హార్మోన్ బ్యాలెన్సర్ గా సమర్థవంతంగా పని చేస్తుంది. ఫాల్కారినోల్ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే తగ్గించేందుకు సహాయపడుతుందని సైంటిఫిక్ గా కూడా నిరూపితమైంది. ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండటం వల్ల గర్భాశయ, అండాశయ, రొమ్ము క్యాన్సర్లు, పీసీఓడీ సమస్య, శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలకి కారణం అవుతుంది. పేగుల నుంచి అధిక ఈస్ట్రోజెన్ శోషణ నిరోధించేందుకు పచ్చి క్యారెట్లు సహాయపడతాయని నిపుణులు వెల్లడించారు. క్యారెట్, కొబ్బరి నూనె వాటి ఆహారాలు పేగులని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్ల వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిపై ప్రభావాన్ని చూపిస్తాయి.
క్యాన్సర్ నిరోధకంగా..
క్యాన్సర్ కణాల పురోగతిని మందగించేలా చేయడంలో క్యారెట్ ముఖ్య భూమిక పోషిస్తుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌కు విరుగుడుగా పనిచేస్తుంది. క్యారెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చు. క్యారెట్ పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొవ్వుని కరిగిస్తుంది
ఫైబర్ తో పాటు క్యారెట్లో ఉండే ప్రోటీన్ కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది. ఫైబర్ ఫ్రీబయోటిక్ గా పని చేస్తుంది. అంతే కాదు పేగుల్లో మంచి బ్యాక్టీరియా అయిన మైక్రోబయామ్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. అతిగా ఆహారం తీసుకునే వాళ్ళకి ఇది చక్కని ఎంపిక. పచ్చి క్యారెట్ ముక్కలుగా చేసి భోజనానికి ముందుగా తింటే ఆహారం ఎక్కువగా తినడం నివారించేందుకు దోహదపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
క్యారెట్లో పొటాషియం ఉంటుంది. హైపర్ టెన్షన్ తో సంబంధం ఉన్న వ్యక్తుల్లో అధిక స్థాయి సోడియాన్ని సమతుల్యం చెయ్యడానికి సహాయపడుతుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. క్యారెట్‌లోని అధిక కరిగే ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తం గడ్డ కట్టడం, గుండె జబ్బులని తగ్గించడంలో సహాయపడే హెచ్ ది ఎల్ స్థాయిని పెంచుతుంది.
ఉడికించిన లేదా పచ్చి క్యారెట్లో ఏది మంచిది?
ఇన్ని ప్రయోజనాలు కలిగిన క్యారెట్ పచ్చిగా తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా ఉడికించి తినాలా అనేది కొంతమందికి వచ్చే సందేహం. కొంత వరకు పచ్చి క్యారెట్ తింటే మేలే చేస్తుంది. ఇందులో ఫాల్కారినోల్ ఉంటుంది. కానీ వదిన క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. కళ్ళు, చర్మం, జుట్టు సంరక్షణ కోసం సూప్, లేదా వేయించిన, ఉడికించిన క్యారెట్ తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని జ్యూస్ చేసుకున్నట్లయితే కొవ్వులో కరిగే విటమిన్ల శోషణ మెరుగుపరిచేందుకు కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా పచ్చి ఆలివ్ ఆయిల్ జోడించవచ్చు.
ఈ సమస్యలు ఉన్న వాళ్ళు అతిగా తినొద్దు
క్యారెట్లు పురుగుల మందు కలుషితానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకని గట్ ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు, పేగు సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు అల్సరేటివ్ కొలిటిస్ సమస్య ఉన్న వాళ్ళు పచ్చిగా క్యారెట్ తింటే జీర్ణం కాక ఇబ్బంది పడే వాళ్ళు వాటిని ఉడికించి తినడం మేలు. అది కూడా అతిగా తినకూడదు. దుమ్ము అలర్జీ ఉన్నట్లయితే క్యారెట్ ని జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఇవి అలర్జీని తీవ్రతరం చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: మీ నాలుక మీద ఈ మచ్చలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, ప్రాణాంతకం కావచ్చు!