Coffee: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి
చాలా మందికి ఉదయాన్నే కాఫి పడందే ఏ పని మొదలవదు. ఏ రోజయినా లేటయితే కాఫీ కోసం తపిస్తుంటారు కూడా. మరి ఇది మంచి అలవాటేనా? కాఫీ ఏ టైమ్‌కు తాగాలి?
నేషనల్ కాఫీ అసోషియేషన్ డేటా ప్రకారం ప్రపంచంలో కాఫీ తాగేవారి సంఖ్య బాగా పెరిగిందట. ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండువంతుల మంది కాఫీ వినియోగిస్తున్నారు. వీరిలో చాలా మంది తమ రోజును కాఫీతోనే ప్రారంభిస్తారట. మరి కొందరు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి కాపీతో సరిపెట్టి లంచ్ వరకు ఏమి తినకుండా తాగుతారట కూడా.
ఇలా ఒకొక్కరిలో ఒక్కోరకమైన కాఫీ అలవాటు ఎంత వరకు మంచిది? అసలు కాఫీ తాగేందుకు రోజులో సరైన సమయం అంటూ ఏదైనా ఉందా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏ టైమ్‌కు తాగితే బెటర్?
న్యూరోసైంటిస్ట్ ఆండ్రూహుబెర్మెన్ ఇటీవల కాఫీ అలవాటుపై కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. శారీరక, మానసిక పనితీరు మెరుగ్గా ఉండాలంటే నిద్ర లేచిన తర్వాత కనీసం 90 నిమిషాల పాటు కాఫీ తాగకుండా ఉంటే మంచిదని అంటున్నారు. వీలైతే నిద్ర లేచిన రెండు గంటల పాటు కాఫీ తాగకపోతే మరీ మంచిదట. అడినోసిన్ అనే కెమికల్ వల్ల చురుకుదనం తగ్గిపోతుంది. అలసట కలిగిస్తుంది. ఇది నిద్ర లేచిన రెండు గంటల్లో శరీరంలో పెరిగిపోతుంది. అందువల్ల చురుకుదనాన్ని పెంచే కాఫీ నిద్ర లేచిన 2 గంటల తర్వాత తాగడం వల్ల అందులోని కెఫిన్ వల్ల శారీరక, మానసిక చురుకునం సంతరించుకుంటుంది. ఇలా చెయ్యడం వల్ల మధ్యాహ్నం వరకు చురుకుగా ఉండేందకు తోడ్పడుతుందని హుబెర్ మెన్ చెబుతున్నారు. అయితే మరికొంత మంది నిపుణులు వ్యాయామానికి ముందు కాఫీ తీసుకుంటే వర్కవుట్ మరింత బలంగా చేసే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు.
సాధారణంగా కాఫీ తాగిన 30 నిమిషాల్లో అందులోని కెఫిన్ ప్రభావం మొదలవుతుంది. కెఫిన్ మన శరీరం మీద ఎంత సేపట్లో ప్రభావం చూపుతుందనేది మన జీన్స్, ఎప్పుడు భోజనం చేశాము వంటి అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి కాఫీ తాగిన 10-15 నిమిషాల్లోనే కెఫిన్ ప్రభావం మొదలు కావచ్చు. మరి కొందరికి కొన్ని గంటల సమయం పట్టవచ్చు.
మనిషి మనిషికి మారుతుంది
కొంత మందికి ఖాళీ కడుపుతో కాఫీ తాగితే అది జీర్ణం చేసుకునే శక్తి ఉండకపోవచ్చు. మరి కొందరు కాఫీ లేకుండా పనే మొదలు పెట్టలేరు. ఇలా కాఫీ ఒకొక్కరిలో ఒక్కోవిధంగా ప్రభావం చూపినా సరే సగటున ఎవరైనా ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల మధ్య కాఫీ తాగితే దాని ప్రభావంతో మానసికంగా, శారీరకంగా చురుకుగా ఉండవచ్చని క్లివ్ ల్యాండ్ క్లినిక్ చెబుతోంది.
ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి
సిర్కాడియన్ రిథమ్ మీద కాఫీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కనుక మీ బాడీ క్లాక్ ను అనుసరించి కాఫీ తాగే సమయాన్ని నిర్ణయించుకోవడం మంచిది సాధారణంగా నిద్ర లేచిన గంట తర్వాత కాఫీ తగితే మంచిది. వ్యాయామానికి ముందు తాగితే వర్కవుట్ మరింత వేగంగా, బలంగా చేసేందుకు దోహదం చేస్తుంది. కనుక ఉదయం వర్కవుట్ కు ముందు కాఫీ తాగితే దాని ఫలితాలు పూర్తిగా పొందవచ్చు. కెఫిన్ ప్రభావం రక్తంలో ఎనిమిది గంటల పాటు ఉంటుందట. కనుక నిద్రకు ఉపక్రమించే సమయానికి ఆరు గంటల ముందు కాఫీ తాగకూడదని నిపుణుల సలహా.
Also Read : టాటూ వేయించుకోడానికి ఉత్సాహంగా ఉన్నారా? మరోసారి ఆలోచించండి ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే?