Vitamin D: విటమిన్ డి లోపంతో ఆయుష్షు తగ్గిపోయే అవకాశం- పద్నాలుగేళ్ల పాటూ సాగిన అధ్యయన ఫలితం ఇదే
విటమిన్ డి లోపం ఉంటే తేలికగా తీసుకోవద్దు. మీ ఆయుష్షు తగ్గిపోవచ్చు.
ఎండలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోయింది. ఏసీ రూముల్లో కూర్చుని తమ ఆరోగ్యాన్ని తామే క్షీణించేలా చేసుకుంటున్నారు. దీని వల్ల విటమిన్లు, ఖనిజాల లోపం ఎక్కువైపోతుంది. ముఖ్యంగా విటమిన్ డి లోపం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. కానీ దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆ లోపం వల్ల అనేక సమస్యలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. విటమిన్ డి లోపం మానసిక సమస్యలతో పాటూ, శారీరక సమస్యలు అధికంగా దాడి చేసే అవకాశం ఉంది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ డి లోపం అకాల మరణంతో ముడిపడి ఉన్నట్టు తేలింది. విటమిన్ డి లోపం బ్రిటన్లో మరణాల ప్రమాదాన్ని పెంచిందని ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ ప్రెసిషన్ హెల్త్, యూనిట్ ఆఫ్ క్లినికల్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు.
పద్నాలుగేళ్ల అధ్యయనం
2006 నుంచి 2010 వరకు దాదాపు మూడు లక్షల మందికి పైగా జనాభాపై పద్నాలుగేళ్ల పాటూ అధ్యయనం నిర్వహించారు. వీరందరిలో విటమిన్ లోపం అధికంగా ఉంది. ఈ పద్నాలుగేళ్ల కాలంలో వారిలో 18,700 మంది వివిధ అనారోగ్యాల కారణంగా మరణించారు. ఎవరిలో అయితే విటమిన్ డి లోపం అధికంగా ఉందో వారే ఎక్కువ శాతం మరణించినట్టు గుర్తించారు. అందుకే విటమిన్ డి లోపాన్ని తక్కువగా అంచనా వేయకూడదని చెబుతున్నారు వైద్యులు.
విటమిన్ డి లోపం లక్షణాలు
1. తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు.
2. రోజులో 24 గంటలూ అలసటగానే ఉంటుంది.
3. మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉండదు, అల్లకల్లోలంగా ఉంటుంది.
4. మానసిక ఆందోళన, డిప్రెషన్ వేధిస్తాయి.
5. జుట్టు రాలిపోతుంది.
6. చర్మంపై దద్దుర్లు, మొటిమలు వస్తాయి.
7. ఎముకలు బలహీనపడతాయి.
8. కీళ్లు, కండరాలు నొప్పి పెడతాయి.
9. కాళ్లలో నొప్పిగా అనిపిస్తుంది.
ఎంత ఉండాలి?
విటమిన్ డి మోతాదులను ‘నానోగ్రామ్స్ పెర్ మిల్లీలీటర్లు (ng/mL)’లో కొలుస్తారు. విటమిన్ డి స్థాయిలు 30 నుంచి 50 ng/mL మధ్య ఉండాలి. 12ng/mL కన్నా తక్కువ ఉంటే విటమిన్ డి లోపం కింద పరగణిస్తారు. కాబట్టి ఓసారి చెక్ చేయించుకుని మీ విటమన్ డి స్థాయిలు తెలుసుకోవాలి. తక్కువగా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి.
గుండె ఆరోగ్యానికి సమపాళ్లలో విటమిన్ డి అవసరం. ఇది శరీరం కాల్షియం, ఫాస్పరస్ గ్రహించడానికి సహకరిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. అంటే విటమిన్ డి లోపం క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుందన్న మాట. రొమ్ము, అండాశయం, పెద్దప్రేగు, ప్రోస్టేట్, మెదడులో క్యాన్సర్ కణాల పెరుగుదలను పెంచుతుంది. కాబట్టి విటమిన్ డి లోపం కారణంగా ఇతర ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడి అకాల మరణం చెందే అవకాశం ఎక్కువ. అంటే గుండె జబ్బులు, క్యాన్సర్లు, తీవ్రమైన మానసిక సమస్యలు... ఇలా అనేక రకాల కారణాల వల్ల మరణించే అవకాశం ఉంది.
ఎలా పొందాలి?
విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైనది. ఆహారం ద్వారా తగినంత విటమిన్ డి పొందడం కష్టం.సూర్యరశ్మి చర్మంపై పడేలా జాగ్రత్త పడాలి. రోజులో కనీసం అరగంట పాటూ ఎండ తగిలేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయపు ఎండ, సాయంత్రం మూడు గంటలకు వచ్చే ఎండలో నిలబడాలి.
సూర్యుని UVB రేడియేషన్ ద్వారా 7-డీహైడ్రోకొలెస్ట్రాల్ విచ్ఛిన్నమైనప్పుడు విటమిన్ D ఏర్పడుతుంది.
Also read: ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు మానేయకూడదు? మానేస్తే వచ్చే రోగాలివే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.