Vinayaka Chavithi Decor Tips : వినాయక చవితికి ఇంటిని ఇలా అందంగా అలంకరించండి.. గణేశుడిని ఇలా ఆహ్వానించేయండి
Vinayaka Chavithi 2025 : గణేశ్ చతుర్థి సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించి వినాయకుడిని స్వాగతించాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇది. ఈ సింపుల్ టిప్స్ పండుగ శోభను రెట్టింపు చేస్తాయి.

Vinayaka Chavithi 2025 Decor Tips : వినాయక చవితికి మండపాలు ముస్తాబైపోతున్నాయి. అలాగే ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకుంటారు చాలామంది. ఈ సమయంలో వినాయకుడు ఇంటికి వచ్చేప్పుడు ఏ విధంగా డెకరేట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. గణేశ్ చతుర్థి సమయంలో మీరు వినాయకుడిని ఆహ్వానించేప్పుడు ఇంటిని ఏ విధంగా పెట్టుకోవాలో.. ఎలా డెకరేట్ చేస్తే లుక్ బాగుంటుందో ఇప్పుడు చూసేద్దాం.
అన్నింటికన్నా ముఖ్యం ఇదే
ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇళ్లు ఎంత శుభ్రంగా ఉంటే.. అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు డెకరేట్ చేయలేని సందర్భంలో కూడా ఇళ్లు నీట్‌గా ఉంటే ఎలాంటి డెకరేషన్ అవసరం లేదనే అనిపిస్తుంది. ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే వారిని ఇంప్రెస్ చేయాలని ఇళ్లు ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో.. అలా గణనాథుడు వస్తున్నప్పుడు కూడా ఇంటిని అంతకు మించి శుభ్రంగా చేసుకోవాలి. అప్పుడు మీ బడ్జెట్లో, మీకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోగలిగే సౌలభ్యం దొరుకుతుంది.
లైట్ కలర్స్..
ఇంట్లో గణేశుడు హైలెట్‌గా కనిపించాలంటే.. ఆయన చుట్టూ ఉండే ప్రదేశాలు చాలా లైట్ కలర్స్‌లో ఉండాలి. మోనోక్రోమటిక్ వైట్స్, క్రీమ్స్ వంటి గోడలు, కర్టెన్లు వంటివి ఉంటే.. వినాయకుడి దగ్గర చేసే అలంకరణ హైలెట్‌గా నిలుస్తుంది.
మొక్కలతో..
మీరు వినాయకుడిని ఉంచే ప్రదేశాల్లో మొక్కలు పెట్టవచ్చు. ఎందుకంటే వినాయకుడికోసం కట్టే పాలవెల్లి.. పూజకు ఉపయోగించే మొక్కలు ఇలా అన్నీ.. దైవాన్ని, ప్రకృతితో ఉన్న మమైకాన్ని ఏకం చేస్తాయి. కాబట్టి మీరు ఇండోర్‌లో మొక్కలు పెట్టుకోవచ్చు.
లైట్స్..
హెవీ లైట్స్ కాకుండా.. ప్రదేశాన్ని హైలెట్ చేసేందుకు సింపుల్ లైట్స్‌ని ఉపయోగించవచ్చు. వీటిని మొక్కలపై, మీరు వినాయకుడిని ఉంచి ప్రదేశంలో పెడితే మరింత బాగా ఆకట్టుకుంటుంది. కొవ్వొత్తులు, దీపాలు, ఫెయిరీ లైట్స్, స్ట్రింగ్ లైట్స్‌తో డెకరేట్ చేయవచ్చు.
ముగ్గులు
దేవుడిని పెట్టే ప్రదేశంలో ఎలాగో ముగ్గు వేస్తారు. అలాగే ఇంటి బయట, గుమ్మం దగ్గర కూడా ఫెస్టివల్ వైబ్‌ని రెట్టింపు చేసే విధంగా ముగ్గులు వేసేయండి. రంగులతో లేదా పువ్వులతో కూడా వీటిని వేయవచ్చు. ఇవి పండుగ శోభను తెస్తాయి. ఈ లుక్‌ని రెట్టింపు చేసేందుకు దీపాలు కూడా వెలిగించి పెట్టవచ్చు.
పూలదండలతో..
పూలదండలను గుమ్మానికి కడితే పండుగ శోభ రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మంచి సువాసనలు వెదజల్లుతాయి. కాబట్టి మీరు గుమ్మాలకు మామిడి తోరణాలతో పాటు ఇలాంటి పూలదండను కూడా కట్టవచ్చు. గుమ్మానికి ఇరువైపులా పొడుగ్గా వేలాడదీయవచ్చు. మండపం దగ్గర కూడా పూలదండలు కట్టవచ్చు.
ఇలా సింపుల్‌గా ఇంటిని వినాయకుడి కోసం సిద్ధం చేసుకోవచ్చు. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇంటిని హెవీగా రెడీ చేయడం కాదు.. ఇంటికి వచ్చిన దేవుడితో ఆ కళ రెట్టింపు అయ్యేలా చూసుకోవాలి. హెవీ డెకార్స్తో మండపాలు రెడీ చేయడం కరెక్ట్ కాదు. వినాయకుడికి చేయాల్సిన పూజలు, నైవేద్యాలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే చాలు. అంతకుమించి ఆయన అడిగేది లేదు. మీరు ఎంత ప్రశాంతంగా ఆయన్ని ఆహ్వానించి.. సాగనంపుతారో.. అంతకు రెట్టింపు దీవెనలు ఆయన తన భక్తులకు అందిస్తారని గుర్తించుకోవాలి.






















