lab-grown meat: ల్యాబ్‌లో తయారుచేసిన కృత్రిమ మాంసం అమ్మకానికి రెడీ, దీన్ని ఎలా తయారు చేస్తారంటే
ప్రయోగశాలలోని స్టీల్ ట్యాంకులలో కోళ్ల కణజాలాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు.
ప్రయోగశాలలో పెంచిన(ల్యాబ్-గ్రోన్) చికెన్ ఉత్పత్తుల అమ్మకానికి యూఎస్ నియంత్రణాధికారులు తొలిసారి ఆమోదం తెలిపారు. ప్రయోగశాలలోని స్టీల్ ట్యాంకులలో కోళ్ల కణజాలాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇకపై యూఎస్‌లో వీటిని మొదటిసారి ఉత్పత్తి చేసి విక్రయించవచ్చు.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన అప్‌సైడ్ ఫుడ్స్, ఈట్ జస్ట్ అనుబంధ సంస్థ అయిన గుడ్ మీట్ కంపెనీలు ప్రయోగశాలలో చికెన్‌ను కృత్రిమంగా తయారుచేసేందుకు, వాటిని విక్రయించేందుకు యూఎస్ వ్యవసాయ శాఖ(యూఎస్‌డీఏ) నుంచి తొలిసారి అనుమతులు పొందాయి. గుడ్ మీట్ తయారీ భాగస్వామి అయిన జోయిన్ బయోలాజిక్స్ కూడా మాంసాన్ని పండించడానికి ఆమోదం పొందింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యూఎస్‌డీఏ ఫుడ్ సేఫ్టీ అండ్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ 2019లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ రెండు కంపెనీలు సాగు చేసిన చికెన్ ఉత్పత్తులు మానవ వినియోగానికి సురక్షితమైనవిగా నిర్ధరించారు. ఈ రెండు కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావడానికి అవసరమైన యూఎస్‌డీఏ తుది ఆమోదముద్రను పొందాయి.
ఎలా తయారు చేస్తారు?
బతికి ఉన్న జంతువు కణజాలం నుంచి నమూనా కణాలను తయారుచేసి, ప్రయోగశాలలో మాంసాన్ని ఉత్పత్తి చేసే ఈ ప్రక్రియను పండించడం(కల్టివేటెడ్ లేదా కల్చర్డ్) అంటారని యూఎస్‌డీఏ తెలిపింది. కణాలను సేకరించే ప్రక్రియలో సదరు జీవికి ఎటువంటి హాని ఉండదని పేర్కొంది. సేకరించిన కణాలను పరీక్షించి, సెల్ బ్యాంక్‌లో నిల్వ ఉంచుతారు. ఆ తర్వాత బ్యాంకుల నుంచి కణాలను పెద్ద మూసి ఉన్న ట్యాంకులలోకి తరలిస్తారు. ఈ ట్యాంకులు బయోరియాక్టర్లుగా పనిచేయడంతో కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఇందుకు కావాల్సిన పోషకాలను, ప్రోటీన్ పెరుగుదల కారకాలను సరఫరా చేస్తారు. ఆహార పదార్థంగా సిద్ధమైన అనంతరం వీటిని ట్యాంకుల నుంచి వేరు చేసి ప్రాసెసింగ్ చేసి, ప్యాకేజింగ్ చేస్తారు.
ఈ మాంసం ఖరీదైనది
ప్రయోగశాలలో పండించిన ఈ మాంసం ప్రస్తుతం ఏ కిరాణా దుకాణాల్లోనూ కనిపించదు. అంతేకాకుండా ఇది చాలా ఖరీదైనది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని బార్ క్రెన్‌లో ఈ పండించిన మాంసాన్ని అందించేందుకు త్రీ మిచెలిన్ స్టార్ రెస్టరెంట్ అటెలియర్ క్రెన్ యజమాని డొమినిక్ క్రెన్‌తో అప్‌సైడ్ ఫుడ్స్ భాగస్వామ్యం ఏర్పర్చుకుంది. అలాగ్ గుడ్ మీట్ ఉత్పత్తిని సెలబ్రిటీ చెఫ్ అయిన జోస్ ఆండ్రెస్ కు చెందిన ఓ రెస్టరెంట్‌లో అందుబాటులో ఉంచుతారని ఎన్‌పీఆర్ పేర్కొంది.
దీనిపై అప్‌సైడ్ వ్యవస్థాపకులు, సీఈవో డాక్టర్ ఉమా వాలేటి యాహూ ఫైనాన్స్‌తో మాట్లాడుతూ, మరో అయిదు నుంచి పదిహేనేళ్లలో ల్యాబ్-గ్రోన్ చికెన్ ధరలు సంప్రదాయబద్ధంగా పెంచే మాంసం ధరలకు సమానంగా అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఈ కృత్రిమ మాంసం తయారీలో జంతు వధ ఉండకపోవడంతోపాటు పర్యావరణ ప్రయోజనం కూడా ఉందని ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ ప్రచారాన్ని వ్యతిరేకిస్తోంది. సంప్రదాయ పశువుల పెంపకం కంటే పండించిన మాంసం ఏమీ తప్పనిసరిగా తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేయదని చెబుతున్నారు.
అయితే సాధారణ వినియోగానికి అనుగుణంగా ల్యాబ్‌లో పెరిగిన మాంసాన్ని అందుబాటులో ఉంచేందుకు కంపెనీలు ఉత్పత్తిని ఎలా పెంచుతాయో ఇంకా స్పష్టం చేయలేదని సీఎన్‌బీసీ తెలిపింది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.