అతడికి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు - ఇక ఆపేస్తాడట, ఎందుకంటే..
ఒక్క పెళ్లికే ఎన్నో తిప్పలు పడుతున్నారు. అలాంటిది ఆ వ్యక్తి ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. చివరికి, ఆపేస్తా, ఆదుకోండని ప్రభుత్వాన్ని సాయం కోరుతున్నాడు.
ఈ రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. అతడు మాత్రం ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. ఇంకా పెళ్లిల్లు చేసుకుని.. మరికొంతమంది పిల్లలను కనాలనే ఆశ అతడిలో ఇంకా సజీవంగానే ఉంది. కానీ, పరిస్థితులు అతడిని ఊహించని నిర్ణయం తీసుకొనేలా ప్రేరేపించాయి. దీంతో అతడు పెళ్లి, పిల్లలు అనే ఆలోచనను అటకెక్కించాడు. ప్రస్తుతం ఉన్నవారిని పోషించే పనిలో పడ్డాడు.
అది సరే, అంతమందిని టపటపా కనేసినా ఆ పెద్దమనిషి ఎవరు అనేగా మీ సందేహం. ఆయన్ని మీరు చూడాలంటే ఉగాండ వెళ్లాలి. లుసకా అనే గ్రామంలో నివసిస్తున్న అతడి పేరు ముసా హసహ్యా. అయితే, మీరు ఆ ఊరిలోకి వెళ్లి ఇతడి పేరు చెబితే చాలు.. నేరుగా ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే.. ఆ గ్రామంలో మనోడు అంత ఫేమస్ మరి. ఒక వేళ మీరు మరిచిపోయినా.. 12 మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తి అని చెప్పినా చాలు.
568 మంది మనవళ్లు కూడా
ప్రస్తుతం ముసా వయస్సు 67 ఏళ్లు. పెళ్లి, పిల్లలను కనడమే కాకుండా.. వారిని పోషించడం కోసం వ్యవసాయం చేస్తుంటాడు. వారంతా నివసించడం కోసం తన వ్యవసాయ క్షేత్రంలో 12 మంది భార్యలకు 12 పూరిళ్లు కట్టించాడు. తన భార్యలు గ్రామంలోని ఇతర వ్యక్తులతో మాట్లాడటం, కలవడం ముసాకు ఇష్టం ఉండదు. అందుకే, అతడు పోలం పనుల్లో ఉన్నా సరే.. తన భార్యలు, పిల్లలు తన కళ్లకు కనిపించే విధంగా ఆ ఇళ్లను నిర్మించాడు. ముసాకు కేవలం 102 మంది పిల్లలే కాదు.. 568 మంది మనవళ్లు కూడా ఉన్నారు.
చిన్న భార్య.. ముసా పెద్ద కూతురి కంటే 20 ఏళ్లు చిన్నది
ముసా మొదటి పెళ్లి 1921లో హనిఫా అనే మహిళతో జరిగింది. అప్పటికి అతడి వయస్సు 16 ఏళ్లు మాత్రమే. పెళ్లి తర్వాత స్కూల్ వెళ్లడం మానేశాడు. పెళ్లయిన రెండేళ్లలోనే ఆడ బిడ్డకు తండ్రయ్యాడు. అప్పట్లో ముసా విలేజ్ ఛైర్మన్‌గా, బిజినెస్ మ్యాన్‌గా మంచి గౌరవ ప్రదమైన హోదాలో ఉండేవాడు. అయితే, అన్ని పెళ్లిల్లు ఎందుకు చేసుకున్నావ్ అని మీడియా ప్రతినిధులు అడిగితే.. ‘‘నాకు ఇంకా ఎదో సాధించాలని ఉండేది. అందుకే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకుని కుటుంబాన్ని విస్తరించా. మా నేలలు సారవంతమైనవి. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసి, ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి భూమలు అందించాను’’ అని తెలిపాడు. ముసా కుటుంబంలో చివరికి బిడ్డ బయస్సు ఆరు సంవత్సరాలు. పెద్ద అమ్మాయి వయస్సు 51 ఏళ్లు. చిన్న భార్య జులైకా కంటే పెద్ద కూతురు 20 ఏళ్లు పెద్దది.
ఇక సంతానం వద్దు - సాయం కావాలి
తనకు వీలైనంత పెద్ద కుటుంబం ఉండాలని, వారంతా వ్యవసాయం చేస్తూ మంచిగా జీవించాలనేది ముసా కోరిక. అయితే, ఆయన ఉద్దేశంలో కొంచెం మంచి ఉన్నా.. కాలనుగుణం అది భారంగా మారింది. ఇప్పుడు పిల్లల పెళ్లిల్లు, వారికి పిల్లలు పుడితే పెట్టాల్సిన ఖర్చులు ముసాకు ప్రశాంతతను దూరం చేశాయి. అలాగే, ఆ పిల్లలందరినీ చదివించడానికి కూడా ముసాకు కష్టమవుతోంది. ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని సాయం కోరుతున్నాడు. ఇక పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడి చిన్న భార్య జులైక గర్భనిరోధక మాత్రలు తీసుకుంటోంది. ప్రస్తుతం ముసా వయస్సు కూడా అందుకు సహకరించడం లేదు. అతడితో 10 మంది భార్యలే కాపురం చేస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఇద్దరు భార్యలు అతడిని వదిలేశారు.