Ugadi Chutney 2022: షడ్రుచులను అందించే ఉగాది పచ్చడి తయారీ విధానం ఇలా
Ugadi Chutney: తెలుగు వారి తొలి వేడుక ఉగాది. ప్రముఖ పండుగలలో ఇదీ ఒకటి.
ఉగాది (Ugadi 2022) అంటే తెలుగు సంవత్సరాది తొలిరోజు అని అర్థం. పాశ్చాత్య దేశాల్లో జనవరి 1కి ఎంత ప్రాముఖ్యత ఉందో, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది (Ugadi)కి అంత ప్రాముఖ్యత ఉంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఉగాదిని వేడుకలా నిర్వహించుకుంటారు. ఆరోజు ఇష్టదైవాన్ని పూజించుకుని ప్రసాదంగా ఉగాది పచ్చడిని (Ugadi pachadi) తింటారు. ఉగాది పచ్చడి (Ugadi Chutney) తయారీ కాలాన్ని బట్టి మారుతూ ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తయారుచేస్తారు.అయితే దానిలో ఆరు రుచులు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.
ఆ ఆరు రుచులు ఇవే...
ఉగాదినాడు కచ్చితంగా తయారుచేయాల్సిన ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. అవి తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు. తీపికి బెల్లాన్ని, కారానికి పచ్చిమిర్చిని (కొంతమంది కారం వాడుకుంటారు), పులుపుకి చింతపండు (నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు), ఉప్పు, వగరుకి మామిడి కాయని, చేదు వేపుపువ్వుని వాడడం ఆనవాయితీగా వస్తోంది. జీవితంలోని కష్టసుఖాలకు, జరగబోయే మంచి చెడులను ఈ రుచులు సూచిస్తాయని అంటారు. ఉగాది పచ్చడి తిన్నప్పుడు తీపి తగిలితే ఆ ఏడాదంతా సాఫీగా, ఆనందంగా సాగుతుందని భావిస్తారు ప్రజలు. అలాగే చేదు తగిలితే కష్టాలు తప్పవని, పులుపు కష్టం సుఖం కలిసే వస్తాయని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడి తయారీ పూర్వాకాలం నుంచి వస్తున్న పద్దతి ఇది.
ఉగాది పచ్చడికి (Ugadi Chutney) కావాల్సిన పదార్థాలు:
బెల్లం, చింతపండు, మామిడికాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, నీళ్లు, వేప పువ్వు.
(కొంతమంది కొబ్బరి ముక్కలు, జామ ముక్కలు, అరటిపండు కూడా కలుపుకోవచ్చు)
తయారీ ఇలా
1. మిరపకాయను, బెల్లాన్ని, మామిడికాయను తురుముకోవాలి.
2. వేప పూవును నీళ్లలో కడిగి శుభ్రం చేసుకోవాలి.
3. చింతపండును కాస్త నీళ్లలో నానబెట్టాలి.
4. చింతపండు పిప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. ఆ చింతపండు నీళ్లలో ఉప్పు, మామిడి తురుము, బెల్లం తురుము, పచ్చి మిరపకాయ తురుము,వేపపువ్వు తురుము వేసి కలుపుకోవాలి.
6. వేప పువ్వును అధికంగా వేయకూడదు. చేదు ఎక్కువైపోతుంది.
7. మీకు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలు, అరటి పండు ముక్కలు, జామ ముక్కలు కూడా కలుపుకోవచ్చు.
ఉగాది అంటే...
ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అనే అర్థాలు ఉన్నాయి. ఇక ఆది అంటే మొదలు అంటారు. వాటన్నింటికీ మొదలు ఈ ‘ఉగాది’. శిశిర రుతువు తరువాత వచ్చేది వసంతం. ఈ కాలంలోనే చెట్లు చిగుర్లు పెట్టి ప్రకృతి అందంగా ఉంటుంది. వసంతకాలంలోనే ఉగాది పండుగ వస్తుంది. తెలుగు సంవత్సరం మొదలయ్యేది ఉగాది రోజే కాబట్టి ఇదే తెలుగువారి తొలి పండుగ.
అందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Also read: థైరాయిడ్ సమస్య ఉందా? అయితే రోజుకో కొబ్బరి ముక్క తినాల్సిందే
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే, తినాల్సినవి ఇవే