Iron Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే, తినాల్సినవి ఇవే
ఐరన్ లోపం చాలా ఆరోగ్యసమస్యలకు కారణం అవుతుంది.
శరీరంలో ఇనుము లోపిస్తే ఆరోగ్యపరిస్థితి రోజురోజుకి దిగజారుతుంది. ఎందుకంటే రక్తంలోని ఎర్ర రక్త కణాలను ఐరన్ చాలా అవసరం. ఇనుము తగ్గితే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు రక్తం తక్కువ ఉత్పత్తి అవుతుంది. శరీరానికి సరిపడా రక్తం లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఐరన్ లోపం రాకుండా చూసుకోమని చెబుతారు వైద్యులు. ఇనుము లోపించడం వల్ల అనీమియా వస్తుంది. దీన్నే తెలుగులో రక్త హీనత అంటారు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ పట్టుకుని రక్తం గుండా అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. అంతేకాదు కార్బన్ డైయాక్సైడ్ ను బయటికి పంపింస్తుంది. శరీరంలో అధిక శాతం ఐరన్ నిల్వ ఉండేది హిమోగ్లోబిన్లోనే. అలాగే ఎముక మజ్జలో, ప్లీహంలో, కాలేయంలో కూడా నిల్వ ఉంటుంది.
ఇనుము లోపిస్తే లక్షణాలు ఇలా...
1. చర్మం పాలిపోయినట్టు అవ్వడం
2. శక్తిహీనంగా కావడం, త్వరగా అలసిపోయినట్టు అనిపించడం, రోజంతా నీరసంగా అనిపించడం
3. గుండె కొట్టుకునే రేటు పెరగడం
4. గొంతు వాపు
5. ధూళి, ఐస్ ముక్కలు వంటివి తినాలన్న వింత కోరికలు కలగడం
ఎందుకొస్తుంది?
ఇనుము లోపించడం కేవలం సరైన ఆహారం తినకపోవడం వల్లే కాదు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. హార్లోన్లలో మార్పులు రావడం, జీర్ణవ్యవస్థలో అనారోగ్యం కలగడం, గ్యాస్ట్రిక్ ఆమ్లాలు సరిగా ఉత్పత్తి కాకపోవడం, ఏదైనా ఆపరేషన్ అవ్వడం, గాయం తగిలి అధికంగా రక్తం పోవడం, మహిళల్లో రుతుస్రావం అధికంగా కావడం వంటివి కారణాలు కావచ్చు.
నష్టాలెన్నో...
శరీరంలో ఇనుము లోపిస్తే జుట్టు బాగా రాలిపోతుంది. రోగనిరోధక శక్తి కూడా చాలా తగ్గిపోతుంది. దీని వల్ల అంటువ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. డిప్రెషన్ వంటి మానసిక రోగాలు కలిగే ఛాన్స్ ఉంది. ఇక గర్భిణుల్లో రక్త హీనత ఉంటే అది పుట్టే బిడ్డపై చాలా ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే అవకాశం ఉంది. అందుకే అందరూ ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏం తినాలి?
రక్తహీనత ఏర్పడినప్పుడు, రాకుండా ఉండేందుకు ఇనుము అధికంగా ఉండే ఆహారం తినాలి.
1. మెంతికూర లేదా మెంగి గింజలు
2. పాలకూర, బచ్చలి కూర (ముదురు ఆకుపచ్చలో ఉన్న ఆకుకూరలన్నీ)
3. బ్రోకలీ
4. పచ్చి బఠానీలు
5. అన్ని రకాల బీన్స్ (కిడ్నీ బీన్స్, లిమా బీన్స్, పింటో బీన్స్)
6. చిక్కుడు జాతి కూరలు
7. డ్రైఫ్రూట్స్
8. బంగాళాదుంపలు
9. వేరుశెనక్కాయలు
10. చిలగడదుంపలు
11. గుడ్లు
12. చికెన్
13. సీఫుడ్
14. కొమ్ము శెనగలు
Also read: ఈ దేశాల్లో టాటూలు వేయించుకోవడం నిషేధం, టాటూ వేసుకున్న వాళ్ల పని అయినట్టే
Also read: థైరాయిడ్ సమస్య ఉందా? అయితే రోజుకో కొబ్బరి ముక్క తినాల్సిందే