Constipation: వేసవిలో మలబద్ధకం సమస్యను దూరం పెట్టాలంటే ఈ సూపర్ డ్రింక్స్ తాగేయండి
వేసవిలో ఎక్కువ మంది డీహైడ్రేషన్ బారిన మాత్రమే కాదు మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడతారు. దీని నుంచి బయట పడాలంటే ఇలా చేయండి.
వేసవిలో విపరీతమైన చెమట కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేసేందుకు తగినంత ద్రవాలు తీసుకోవాలి. లేదంటే నిర్జలీకరణానికి గురవుతారు. కొన్ని ఆహారపు అలవాట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ ఫైబర్ ఉండే ఆహారాలు అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అధిక వేడి వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పేగు కదలికలు మందగిస్తాయి. ఫలితంగా మలబద్ధకానికి దారి తీస్తుంది. దీని నుంచి బయట పడాలంటే తగినంత ఫైబర్ తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మలబద్ధకాన్ని నయం చేయడమే కాకుండా జీర్ణశక్తిని బలోపేతం చేసే కొన్ని సహజ పానీయాలు తీసుకోవాలి. ఇవి తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.
ఫెన్నెల్ టీ
సొంపు గింజలు జీర్ణక్రియలో చక్కగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకుంటే పొట్టకు చల్లగా ఉండటమే కాకుండా గ్యాస్, అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఈ టీలో చాలా పీచు పదార్థం లభిస్తుంది. దీని వల్ల కడుపులో మలబద్ధకం ఉండదు. ఫెన్నెల్ టీ మలాన్ని మృదువుగా చేస్తుంది. దీనిలో చలువ చేసే గుణాలు ఉంటాయి. రెండు కప్పుల నీటిని తీసుకుని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల సొంపు గింజలు వేసి బాగా మరిగించుకోవాలి. అందులో రుచి కోసం కాస్త తేనె, పుదీనా ఆకులు జోడించుకోవచ్చు.
కివీ, పుదీనా పానీయం
కివీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పుదీనా ఆకులు చల్లదనాన్ని ఇస్తాయి. ఒక గ్లాసులో పుదీనా నీటిని వేసి కాసేపు అలాగే ఉంచాలి. అందులో కివీ పండు తొక్క తీసి ముక్కలుగా చేసుకుని కాసేపు ఉంచుకోవాలి. రుచి మరింత మెరుగ్గా ఉండాలంటే ఆ నీటిని ఫ్రిజ్ లో రెండు గంటల పాటు ఉంచుకోవచ్చు. లేదంటే రాత్రంతా నానబెట్టుకోవచ్చు. ఇలా చేసిన పుదీనా నోటిని తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది.
ఎండుద్రాక్ష నీళ్ళు
ఎండాకాలంలో వచ్చే మలబద్ధకం సమస్యను కూడా డ్రై గ్రేప్స్ వాటర్ సహాయంతో నయం చేసుకోవచ్చు. 7 లేదా 8 ఎండు ద్రాక్షలను రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని తాగాలి. ఈ నీరు కడుపుని శుభ్రపరచడంతో పాటు మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.
మజ్జిగ
వేసవిలో మజ్జిగ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు కడుపులో గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం పోవాలంటే నల్ల ఉప్పు, వేయించిన్ జీలకర్ర, పుదీనా ఆకులు వేసుకుని తాగొచ్చు. ఇలా చేయడం వల్ల పొట్టకు చల్లదనం ఇస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఆ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచిది కావా? ఏం జరుగుతుంది?