జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?
శరీరంలో ఏ సమయానికి జరగాల్సినవి ఆ టైం కి జరగాలి లేదంటే మొత్తం తారుమారు అవుతుంది. లేనిపోని జబ్బులు స్వయంగా తెచ్చుకున్నట్టు అవుతుంది. నిద్రపోయే దగ్గర నుంచి తిండి తినేవరకు అన్ని సమయానికి అనుగుణంగా జరగాలి.
శరీరంలో ఏ సమయానికి జరగాల్సినవి ఆ టైం కి జరగాలి లేదంటే మొత్తం తారుమారు అవుతుంది. లేనిపోని జబ్బులు స్వయంగా తెచ్చుకున్నట్టు అవుతుంది. నిద్రపోయే దగ్గర నుంచి తిండి తినేవరకు అన్ని సమయానికి అనుగుణంగా జరగాలి. ఇది గందరగోళంగా మారడం వల్ల చిన్నదానికి కూడా చిరాకు వస్తుంది. నైట్ షిఫ్ట్స్, క్రమరహిత నిద్ర కారణంగా జీవగడియారంలో చాలా మార్పులు వస్తాయి. దీని వల్ల మధుమేహం, అసాధారణంగా బరువు పెరగడం, జీవక్రియ, జీర్ణ క్రియ పని తీరుకి భంగం కలుగుతుంది. శరీరంలో జరిగే వివిధ రకాల పనులను నియంత్రించే సైక్లింగ్ ప్రాసెస్ ని సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ ప్రాసెస్ సక్రమంగా జరగకపోతే శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. దీని వల్ల మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. ఇదే కాదు రక్తపోటు సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది.
జీవ గడియారంలో మార్పులు రావడానికి ఒక్క నైట్ షిఫ్ట్, క్రమ రహిత నిద్ర విధానాలు మాత్రమే కారణం కాదు. ఇతర ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా కూడా ఇది గాడి తప్పే అవకాశం ఉంది. దీన్ని తేలికగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవ గడియారంలో మార్పులు వచ్చే మరిన్ని కారణాలివే.
వెలుతురు సమస్య
వెలుతురు వల్ల సమస్య ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇది శరీరంపై చాలా ప్రభావం చూపిస్తుంది. సాయంత్రం వేళ వెలుతురు ఎక్కువగా ఉండే లైట్లు మన మీద పడటం వల్ల సిర్కాడియన్ సైక్లింగ్ ప్రాసెస్ గందరగోళానికి గురవుతుంది. దాని వల్ల నిద్ర కలిగించే హార్మోన్లు విడుదల అవడంలో విఫలమవుతాయి. ఫలితంగా త్వరగా నిద్ర రాకపోవడం వల్ల ఆలస్యంగా నిద్రపోవడం జరుగుతుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు.
కొంతమంది నిద్ర రావడం లేదు కదా అని స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ చూస్తూ కాలం గడుపుతారు. వీటి వల్ల వచ్చే లైటింగ్ కళ్ళని దెబ్బతీస్తుంది. ఇది కూడా నిద్రకి భంగం కలిగేలా చేస్తుంది. అందుకే వీలైనంత వరకు సాయంత్రం వేళ లైట్స్ డిమ్ చేసుకోవడానికే ప్రయత్నించండి. పడుకునే సమయంలో కచ్చితంగా లైట్ ఆపుకోవాలి. దీని వల్ల నిద్ర హాయిగా పడుతుంది.
ఎక్కువ సేపు తినడం
టీవీ, ఫోన్లు చూస్తూ చాలా మంది గంటల తరబడి తింటూనే ఉంటారు. అది అసలు ఆరోగ్యానికి మంచిది కాదు ఎక్కువ సేపు తినడం వల్ల జీవ గడియారం చిక్కుల్లో పడుతుంది. ఆలస్యంగా ఎక్కువసేపు తినడం వల్ల ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు వస్తాయి. త్వరగా తినడం వల్ల త్వరగా నిద్రపోతాం అప్పుడు జీవక్రియ నిర్దిష్ట సమయానికి జరుగుతుంది. మీరు తినడం ఆలస్యం చెయ్యడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. అందుకే రాత్రి వేళ కనీసం 8 గంటలలోపు తినడం మంచిది.
జీవనశైలిలో మార్పులు
రోజంతా ఖాళీగా కూర్చోవడం, అనారోగ్యకరమైన ఆహరం తీసుకోవడం, శరీరానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా జీవ గడియారాన్ని దెబ్బ తీస్తాయి. అదే సమయంలో ఆకలి అవుతున్నా తినకుండా ఉండటం, నిద్ర ఆపుకుని పనులు చెయ్యడం కూడా మంచిది కాదు. జీవ గడియారం తన పని సక్రమంగా చేయాలంటే తప్పని సరిగా వేళకి తినాలి సమయానికి నిద్రపోవాలి. అందుకు కావలసింది ఉదయం తప్పని సరిగా వ్యాయామం చెయ్యడం అలవాటు చేసుకోవాలి.
ఎండ వేడి తగలాలి
బయట వెలుతురు ఎండ వేడి శరీరానికి చాలా అవసరం. చాలా మంది బయట ఎండగా ఉంది, ఏం వెళ్తాములే అనుకుని ఇంట్లోనే కూర్చుని ఉంటారు. అలా చెయ్యడం శరీరానికి మంచిది కాదు. జీవ గడియారం సజావుగా పని చేయాలంటే ప్రతి రోజు కనీసం రేణు గంటపాటు బయటకి వెళ్ళడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.