Weight Loss Drinks: ఈ హెల్తీ డ్రింక్స్ తో రోజు స్టార్ట్ చేశారంటే కాఫీ, టీ ధ్యాసే ఉండదు!
కాఫీ, టీ ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని సరైన విధానంలో తీసుకున్నప్పుడే రిలీఫ్ ఉంటుంది. అయితే పొద్దున్నే కాఫీ, టీ తాగడం కంటే ఈ పానీయాలు మరింత ఆరోగ్యకరం.
నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం అలవాటు. ఇవి పరగడుపునే తాగడం ఆరోగ్యకరం కాదని తెలిసినా అవి తాగకపోతే మనసు ఊరుకోదు. వీటిని తీసుకుంటే కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోషకాల శోషణకి ఆటంకం ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు దారి తీస్తుంది. అందుకే దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఈ పానీయాలు ఎంచుకోండి.
పసుపు, నల్లమిరియాల నీరు
గోరు వెచ్చని నీటిలో నల్ల మిరియాలు, కాసింత పసుపు జోడించుకుని తీసుకుంటే చాలా మంచిది. హెల్తీ మార్నింగ్ ఈ సూపర్ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ శక్తివంతమైన పానీయం జీవక్రియని పెంచుతుంది. శరీరంలోని అదనపు కొవ్వుని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
Also Read: ఈ సప్లిమెంట్స్‌ను పొరపాటున కూడా కలిపి తీసుకోవద్దు, ప్రాణాలకే ప్రమాదం
జీలకర్ర, వామ్ము నీళ్ళు
2 కప్పుల నీటిని తీసుకుని అందులో చిటికెడు జీలకర్ర, ఫెన్నెల్ గింజలు, వాము వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని తాగాలి. బరువు తగ్గించే సూపర్ డ్రింక్ ఇది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఉబ్బరం సమస్యని తగ్గిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నిమ్మకాయ నీరు
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు తప్పనిసరిగా తీసుకునే డ్రింక్ నిమ్మకాయ నీరు. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకుని అందులో కాస్త తేనె జోడించుకుని తీసుకోవచ్చు. దీన్ని మరింత ఆరోగ్యవంతంగా చేసుకోవడం కోసం అందులో కాస్త దాల్చిన చెక్క పొడి కూడా కలుపుకోవచ్చు. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల రిఫ్రెష్ గా ఉంటుంది. శరీరం నుంచి విషాన్ని బయటకి పంపిస్తుంది. చర్మానికి మేలు చేసే ఆరోగ్యకరమైన పానీయం.
Also Read: పిల్లలకు దగ్గు తగ్గుతుందని తేనె పెడుతున్నారా- ఈ భయంకరమైన వ్యాధి రావొచ్చు జాగ్రత్త!
గోరువెచ్చని నీరు
ఉదయం పూట పొట్టకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అనుకుంటే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు సాధారణ లేదంటే గోరువెచ్చని నీటిని తాగొచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జీవక్రియని వేగవంతం చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలని బయటకి పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కాఫీ లేదా టీ ఎప్పుడు తీసుకోవాలి?
పైన చెప్పిన పానీయాలలో ఏది తీసుకున్న మంచిదే. అయితే దీన్ని తీసుకున్న తర్వాత నానబెట్టిన బాదం వంటి కొన్ని గింజలు లేదా గుమ్మడి గింజలు వంటివి తినాలి. ఒకవేళ తీపి తినాలని అనుకుంటే ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, తాజా పండ్లు ఎంచుకోవచ్చు. ఇవి తీసుకున్న కొద్ది సేపటి తర్వాత టీ లేదా కాఫీ తీసుకోవచ్చు. అప్పుడు ఆరోగ్యాన్ని పొండటంతో పాటు కాఫీ, టీ తాగిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇది అలవాటు అయితే మెల్లగా కాఫీ తాగడం విస్మరించవచ్చు. ఈ పానీయాలు తాగడం వల్ల ఏదైనా సమస్య ఎదురైతే పోషకాహార నిపుణుల సలహా తీసుకుని మార్చుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.