Spicy Food: స్పైసీ ఫుడ్ తినాలన్న కోరిక కలగడానికి కారణాలు ఇవి కావచ్చు
Spicy Food: స్పైసీ ఫుడ్‌ను అధికంగా ఇష్టపడుతున్నారంటే దానికి కారణాలు ఇవేమో ఒకసారి చెక్ చేసుకోండి.
Spicy Food: కారం, మసాలా ఘాటు అధికంగా ఉండే ఆహారాన్నే స్పైసీ ఫుడ్ అంటారు. అలాంటి ఫుడ్‌ను కొంతమంది చాలా ఇష్టపడతారు. అప్పుడప్పుడు తినాలనిపిస్తే ఫర్వాలేదు. కానీ కొందరికి రోజూ ఆ ఆహారాన్నే తినలనిపిస్తుంది. స్పైసీ ఫుడ్ తప్ప మరేం తిన్నా రుచించదు. తిన్నట్టే లేదు అంటారు. రోజూ మీకు స్పైసీ ఫుడ్ మాత్రమే తినాలనిపిస్తే ఆరోగ్యంపై ఒక కన్నేయాలి. స్పైసీ పుడ్ అతిగా తినాలనిపించడం వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దాక్కున్నాయి.
గర్భం ధరించినా...
గర్భం ధరించిన మహిళల్లో కారం, మసాలా ఘాటు తగిలే ఆహారాన్ని తినాలన్న కోరిక పెరిగిపోతుంది. అలాగే చాక్లెట్లు, స్వీట్లు కూడా తినాలనిపిస్తుంది. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల, స్పైసీ ఫుడ్ లో ఉండే కొన్ని ఆహార రసాయనాల వల్ల ఈ కోరికలు కలుగుతాయి.
వాతావరణం
వర్షాలు పడినప్పుడు, శీతాకాలంలో వాతావరణ చల్లగా మారిపోతుంది. అప్పుడు మసాలా ఆహారాన్ని తినాలన్న కోరిక శరీరంలో పుడుతుంది. స్పైసీ ఫుడ్‌లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది శరీరంలో వెచ్చదనాన్ని కలిగింది చలిని దూరం పెడుతుంది. అందుకే మన శరీరంలో చల్లని వాతావరణంలో స్పైసీ ఫుడ్‌ను కోరుకుంటుంది.
డిప్రెషన్
ఒక వ్యక్తి నిరాశకు, నిరుత్సాహానికి గురైనప్పుడు కూడా వారు కారంగా ఉండే ఆహారాన్ని కోరుకుంటారు. మామూలు ఆహారం తిన్నా వారికి తిన్నట్టు అనిపించదు. స్పైసీ ఫుడ్ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. అందుకే డిప్రెస్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాన్ని కోరుకుంటుంది శరీరం. అయితే మీకు నిరాశగా ఉండి, అధికంగా స్పైసీ ఫుడ్ తినాలినిపిస్తే ఓసారి వైద్యుడిని కలవడం ఉత్తమం. మానసిక ఆరోగ్యం చేజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
ముక్కు కారడం
దీన్నే రినైటిస్ అంటారు.ముక్కు కారుతూ, తుమ్ములు వస్తుంటాయి. దీన్ని జలుబు కింద చెప్పలేం కానీ లక్షణాలు అలాగే ఉంటాయి. ఇలాంటి సమయంలో కూడా కారంగా ఉండే ఆహారాన్ని తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆహారం రినైటిస్ లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమా...?
ఎప్పుడో ఒకసారి తింటే ఫర్వాలేదు కానీ రోజూ స్పైసీ ఫుడ్ తినడం అంత ఆరోగ్యకరం కాదు. చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అజీర్ణం, అసిడిటీ, కడుపు మంట, గుండె మంట ఇలా చాలా సమస్యలు రావచ్చు. కాబట్టి స్పైసీ ఫుడ్ తినాలన్న మీ కోరికకు కళ్లెం వేయాలి. వారానికోసారికి మించి స్పైసీ ఫుడ్ తినకపోవడమే మంచిది. రోజూ తినడం వల్ల ఏదో రోజు ఆసుపత్రిలో చేరే పరిస్థితి కూడా రావచ్చు.
Also read: పనీర్ అంటే ఇష్టమా? అధికంగా తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.