ఈ ఆహారాలు మీ ఆకలిని సహజంగానే అణిచేస్తాయి, అలా కూడా బరువు తగ్గొచ్చు
బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆహార పదార్థాలు చాలా మేలు చేస్తాయి.
సన్నగా మెరుపు తీగలా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరు అధిక బరువుతో బాధపడుతుంటారు. జిమ్‌కి వెళ్లే సమయం, స్థోమత లేక కూడా తమలోనే మధనపడుతంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలు వారికి శక్తిని అందిస్తూనే, ఆకలిని చంపేస్తాయి. దీని వల్ల తినే ఆహారం తగ్గిపోతుంది. అలా సహజంగానే బరువు తగ్గిపోవచ్చు. అయితే ఎన్ని చేసినా బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా జంక్ ఫుడ్‌కు, బేకరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే నడక వంటివి రోజూ చేయాలి. అయితే మూడు పూటలా ఎంత కొంత ఆహారాన్ని మాత్రం కచ్చితంగా తినాలి. స్కిప్ చేయకూడదు. ఈ ఆహారాలు అధికంగా తినకుండా అడ్డుకుంటాయి.
బాదం పప్పులు
రోజుకో గుప్పెడు బాదం పప్పులు తినేందుకు ప్రయత్నించండి. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.ఇవి తిన్నాక పొట్ట నిండుగా అనిపిస్తుంది. వీటిని తేనెతో కలిపి తింటే మరీ మంచిది. అలాగే గుమ్మడి గింజలు వాల్‌నట్లు వంటి నట్స్ తో కలిపి తిన్నా మంచిదే. బరువు నిర్వహణలో ఇవి మేలు చేస్తాయి. 2006లో చేసిన అధ్యయనంలో ఇదే తేలింది.
కాఫీ
ఆకలిని కంట్రోల్ చేయడంలో, ఆహారాన్ని అధికంగా తినకుండా అడ్డుకోవడంతో కాఫీ ముందుంటుంది. దీనిలో కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆకలిని అణిచి వేసేందుకు సహాయపడతాయి. బ్లాక్ కాఫీ తాగితే ఇంకా మంచిది. ఇది కేలరీలను బర్న్ చేయడంతో పాటూ కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. మీ జీవక్రియ రేటును పెంచుతుంది. అయితే కాఫీలో చక్కెర, క్రీమ్ లాంటివి ఎక్కువ వేసుకోవద్దు. అలా తాగడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
అల్లం
భారతీయ వంటల్లో అల్లాన్ని ప్రముఖంగా ఉపయోగిస్తారు. అల్లం జీర్ణ శక్తిని పెంచుతుంది. కప్పు అల్లం టీ తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. జంక్ ఫుడ్ తినాలన్న కోరికలను చంపేస్తుంది. ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకునేలా చేస్తుంది. అల్పాహారంలో అల్లం వేసుకుని తినడం వల్ల మూడు గంటల పాటూ పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు వికారాన్ని తగ్గిస్తాయి.
పండ్లు
ఆపిల్ వంటి పండ్లు తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. దీనిలో కొవ్వు ఉండదు కాబట్టి ఎన్ని తిన్నా మంచిదే. ఆపిల్ పండ్లలో ఫైబర్, పెక్టిన్, వాటర్ కంటెంట్ నిండుగా ఉంటాయి. వీటి వల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అతిగా ఆహారం తినకుండా నిరోధిస్తుంది. ఈ పండ్లు ఇతర ప్రయోజనాలు కూడా అధికం. రక్తంలోని గ్లూకోజ్‌ని నియంత్రిస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. అదనపు క్యాలరీలు శరీరం పీల్చుకోకుండా అడ్డుకుంటుంది.
నీరు
భోజనం తిన్నాక కూడా కొందరిలో ఆకలి అనిపిస్తుంది. దానికి కారణం మీరు శరీరానికి అవసరమైనన్ని నీళ్లు తాగడం లేదని అర్థం. నీరు అధికంగా తాగితే ఆకలి తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా బావుంటుంది. 2010లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు త్రాగిన వ్యక్తులు... అలా నీరు తాగని వ్యక్తుల కంటే తక్కువ ఆహారాన్ని తింటున్నారు. అందుకే రోజంతా నీటిని మధ్యమధ్యలో సిప్ చేస్తూనే ఉండండి.
Also read: పిల్లలకు నచ్చేలా పాలబూరెలు, చిటికెలో చేసేయండిలా
Also read: గర్భం ధరించాక శృంగారం సురక్షితమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.