Levi’s Jeans Sold for Rs 71 Lakhs: అయ్య బాబోయ్! ఈ పాత ప్యాంట్ ధర రూ. 71 లక్షలట, ఎందుకో తెలుసా?
1880 నాటి జీన్స్ ప్యాంట్ ధర ఏకంగా రూ. 71 లక్షలు పలికింది. తాజాగా నిర్వహించిన వేలం పాటలో శాన్ డియాగోకు చెందిన పాతకాలపు దుస్తుల వ్యాపారులు ఈ ప్యాంటును దక్కించుకున్నారు.
Levi’s Jeans Sold for Rs 71 Lakhs: మామూలుగా జీన్స్ ప్యాంట్ ధర ఎంత ఉంటుంది? ఆయా బ్రాండ్లను బట్టి వెయ్యి నుంచి 10 వేల రూపాయల వరకు ఉంటుంది. సెలబ్రిటీలు, ధనవంతులు వేసుకునే జీన్స్ అయితే రెండు, మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది. కానీ, తాజాగా ఓ పాతకాలం నాటి జీన్స్ ప్యాంట్ ఏకంగా రూ. 71 లక్షలకు అమ్ముడుపోయింది. పాత ప్యాంటు రూ. 71 లక్షలు పలకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం అక్కడే ఉంది.
అమెరికన్ వెస్ట్ లో దొరికిన జీన్స్
ఈ పురాతన జీన్స్ ప్యాంట్ లెవీస్ కంపెనీకి చెందినది. 1880లో తయారు చేసిన ఈ ప్యాంట్ ను డెనిమ్ ఆర్కియాలజిస్ట్ మైఖేల్ హారిస్.. అమెరికన్ వెస్ట్ లో కనుగొన్నాడు. దీనిని న్యూ మెక్సికో అజ్టెక్‌లోని డురాంగో వింటేజ్ ఫెస్టివస్ లో ‘డెనిమ్ డాక్టర్స్’ కు విక్రయించాడు. తాజాగా నిర్వహించిన వేలంలో 87,400 డాలర్ల (దాదాపు రూ.71 లక్షలు) ధర పలికింది. శాన్ డియాగోకు చెందిన పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్, డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్ సన్ తో కలిసి ఈ జీన్స్‌ను దక్కించుకున్నాడు.
అపాయింట్‌మెంట్ ద్వారా చూసే అవకాశం
ఈ సందర్భంగా జిప్ స్టీవెన్ సన్ మాట్లాడుతూ.. ఈ జీన్స్ చాలా అరుదైనదని చెప్పారు. జీన్స్‌పై కొన్ని మచ్చలు ఉన్నాయని.. అవి లేకపోతే సూపర్ డూపర్ సాలిడ్ జీన్స్ గా ఉండేదని వెల్లడించారు. 1880 నాటి లెవీ జీన్స్ చాలా అరుదుగా ఉన్నాయని చెప్పారు. ఆ కాలానికి చెందిన రెండు జతలు మాత్రమే ఇప్పుడు ఉన్నట్లు వెల్లడించారు. అవి ధరించగలిగే స్థితిలో లేనప్పటికీ, కొత్తగా కనుగొన్న ఈ జీన్స్ ను కొన్ని చిన్న రిపేర్లు చేసి ధరించవచ్చన్నారు. ఈ జీన్స్ ప్యాంటును ప్రస్తుతం బ్యాంక్ వాల్ట్ లో ఉంచినట్లు స్టీవెన్ సన్ వెల్లడించారు. అపాయింట్‌మెంట్ పై చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
మరోసారి వేలం వేయాలనే ఆలోచన
మరోవైపు ఈ ప్యాంట్ ను మళ్లీ వేలం వేయాలని నూతన యజమానులు స్టీవెన్ సన్, కైల్ హౌపెర్ట్ భావిస్తున్నారు. ఇప్పుడు తాము కొనుగోలు చేసిన రేటు కంటే ఎక్కువ రేటుకి అమ్మేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. హౌపెర్ట్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ ఖరీదైన జీన్స్ ఫొటోలను షేర్ చేశాడు.
View this post on Instagram
గనిలో దొరికిన అరుదైన జీన్స్
పురాతన లెవీ ప్యాంట్ కొన్నేళ్లుగా ఒక పాత గనిలో ఉందని లాంగ్ జాన్ అనే డెనిమ్ మ్యాగజైన్ వెల్లడించింది. దీనిని ఒక మైనర్ ఉపయోగించినట్లు తెలిపింది. ఈ ప్యాంటు నడుము బ్యాండ్‌లపై సస్పెండర్ బటన్‌లు, సింగిల్ బ్యాక్ పాకెట్‌ను కలిగి ఉందని తెలిపింది. మరోవైపు ఈ ప్యాంటు ఫలికిన ధర చూసి నెటిజన్లు అవ్వక్కవుతున్నారు. ఇంత డబ్బు పెడితే మంచి బంగళా లేదంటే లగ్జరీ కారు కొనుక్కునే అవకాశం ఉంటుంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: భార్యతో కలిసి అంతరిక్షయాత్రకు, స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం! ప్రపంచంలోనే తొలిసారి