Corona Vaccine: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా కనిపించే కోవిడ్ లక్షణాలు ఇవి
కరోనా వైరస్ పూర్తిగా అంతమైపోలేదు. రూపాంతరం చెందుతూ తన ఉనికిని చాటుతూనే ఉంది.
కోవిడ్ అంతరించిపోలేదు, కొత్త వేరియంట్లు అడుగుపెడుతూ మరో వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంది కరోనా. అయితే టీకాలు వేసుకున్న వారిలో, టీకాలు వేసుకోని వ్యక్తులలో కనిపించే లక్షణాలలో మాత్రం తేడా ఉంటోంది. టీకాలు వేసుకున్న వ్యక్తులకు మళ్లీ ఇన్ఫెక్షన్ సోకదు అనేది పూర్తిగా అపోహ అని బ్రిటన్లో చేసిన తాజా అధ్యయనం తేల్చింది. అయితే టీకాలు వేసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ సోకితే కనిపించే లక్షణాలు భిన్నంగా ఉన్నట్టు చెప్పింది. ముఖ్యంగా అయిదు లక్షణాలు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారిలో కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే కరోనా సోకిందేమో అనుమానించాలి.ఈ లక్షణాలు కనిపిస్తే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవడం ఉత్తమం.
గొంతు నొప్పి
కోవిడ్ వచ్చినప్పుడు గొంతులో అసౌకర్యం అనిపించడం, నొప్పి, దురద వంటివి కలుగుతాయి. ఇది ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో కనిపించే సాధారణ లక్షణం. అలాగే వీరికి మాట్లాడడంలో ఇబ్బంది, ఆహారం మింగేటప్పుడు నొప్పి, గొంతులో మంట ఇవన్నీ కనిపిస్తాయి.
ముక్కు కారడం
ఇక రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి మళ్లీ ఒమిక్రాన్ సోకితే కనిపించే మరో సాధారణ లక్షణం ముక్కు కారడం. ఇది శ్వాసకోశ సమస్య. కాబట్టి టీకాలతో సంబంధం లేకుండా ముక్కు కారుతుంది. అలాగే అప్పుడప్పుడు నాసిక మార్గంలో ఏదో అడ్డుపడినట్టు అనిపిస్తుంది. ఆవిరి పట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ముక్కు దిబ్బడ
కరోనా సోకితే గొంతు, ముక్కులో ఇబ్బందిగా అనిపిస్తుంది. ముక్కు మూసుకుపోతుంది. శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కూర్చున్నప్పుడు కూడా వ్యక్తి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. నిద్రపోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. నాసల్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఆగకుండా వచ్చే దగ్గు
కోవిడ్ సోకితే దగ్గు నిరంతరాయంగా వస్తుంది. ఇది అందరికీ రాదు. కొంతమందికే వస్తుంది, కానీ తీవ్రమైన లక్షణం. ఇలా నిరంతరం దగ్గు రావడం వల్ల వ్యక్తి నీరసపడిపోతాడు. వ్యక్తి శక్తిని హరిస్తుంది. దగ్గు వస్తున్నప్పుడు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
తలనొప్పి
గొంతు నొప్పి, దగ్గు, మూసుకుపోయిన ముక్కుతో పాటూ తలనొప్పి స్పష్టంగా వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వల్ల తలనొప్పి మొదలవుతుంవి. కరోనా ఇన్ఫెక్షన్ కూడా తలనొప్పి వచ్చేలా చేస్తుంది.
Also read: దీపావళికి తెలుగులోనే శుభాకాంక్షలు తెలపండిలా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.