కళ్ల కింద క్యారీ బ్యాగ్స్ ఎందుకొస్తాయో తెలుసా? ఇలా చేస్తే మీ కళ్లు అందంగా మారిపోతాయ్!
కళ్ల కింద క్యారీ బ్యాగ్గులు ఎందుకొస్తున్నాయో తెలియడం లేదా? అయితే, మీరు ఈ విషయాలు తెలుసుకోవల్సిందే.
వ్యక్తుల వయస్సును కళ్లు చూసి చెప్పేయొచ్చనే సంగతి మీకు తెలుసా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఎందుకంటే.. కళ్ల వద్ద ఉండే చర్మం చాలా పలుచగా ఉంటుంది. కాబట్టి, వయస్సుతోపాటు ఆ ప్రాంతం త్వరగా వీక్ అవుతుంది. ఫలితంగా అక్కడ ముడతలు, డార్క్ సర్కిల్స్ త్వరగా వచ్చేస్తాయి. అయితే, ఇందుకు వయస్సు మాత్రమే కాదు.. మనం చేసే తప్పిదాలు కూడా కారణం. దానివల్ల మనం చిన్న వయస్సులోనే పెద్దవాళ్లలా కనిపిస్తాం. కళ్ల కింద నల్లని వలయాలు, ముడతలతో వృద్ధుల్లా కనిపిస్తాం. అందుకు కారణాలేమిటీ తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి.
⦿ యూకేకు చెందిన పలువురు నేత్ర వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మనం ఎప్పుడూ కంటి చూపు గురించే ఆలోచిస్తాం. కానీ, కంటిని కాపాడే చర్మం గురించి ఏ మాత్రం ఆలోచించం. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. కంటి దగ్గర ఉండే చర్మం కూడా హెల్దీగా ఉండాలి. ఇందుకు మీరు కంటి నిండా నిద్రపోవాలి. రోజూ కాకపోయినా వారానికి ఒక్కసారైనా కళ్లను పరీక్షించుకోవాలి. క్రోస్ ఫీట్, పొడి లేదా నీరు కారుతున్న కళ్లు, నల్లటి వలయాలు, ఉబ్బిన కళ్లు, కళ్లు ఎర్రగా మారడం, మంటగ పుట్టడం, కళ్లు అంటుకోవడం వంటి సమస్యలు ఎక్కువగా నిర్జలీకరణం లేదా అలెర్జీల వల్ల ఏర్పడవచ్చని వైద్యులు తెలిపారు.
⦿ కళ్ల మూలల వద్ద ఏర్పడే ముడతలను ‘క్రోస్ ఫీట్’ అని అంటారు. కాకి పాదాల తరహాలో గీతలు( సన్నని ముడతలు) ఏర్పడతాయి. ఆ ముడతలు వృద్ధాప్య సంకేతాలను అందిస్తాయి. అక్కడి చర్మం పలుచగా ఉండటం వల్ల మనం నవ్వినప్పుడు, ముఖం చిట్లించినప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువగా ముడతలు, గీతలు ఏర్పడతాయి. వేసవిలో కళ్లకు నేరుగా సూర్య రశ్మి తగలకుండా జాగ్రత్త పడాలి. కనురెప్పలను కప్పి ఉంచేలా సన్ గ్లాసెస్ ధరించాలి.
కళ్ల కింద నల్లటి వలయాలు: కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యు సమస్యలతోపాటు.. రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం, అలెర్జీలు, నిర్జలీకరణం, వృద్ధాప్యం, ధూమపానం వంటివి కళ్ల కింద చర్మాన్ని నల్లగా మార్చేస్తాయి. అలెర్జీ, నిర్జలీకరణ సమస్యలు లేకుండా జాగ్రత్తపడటం, క్రీములు ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను అదిగమించవచ్చు.
కళ్లు ఉబ్బడం (కళ్ల కింద సంచులు): కళ్లు ఉబ్బినప్పుడు లేదా కళ్ల కింద సంచులు ఏర్పడినప్పుడు.. కళ్ల కింద క్యారీబ్యాగ్‌లేమిటీ అని ఆటపట్టిస్తుంటారు చాలామంది. నిద్రలేమి వల్లే ఈ సమస్యలు ఏర్పడతాయి. కళ్ల కింద ఉండే చర్మంలోకి ద్రవాలు చేరడం వల్ల అక్కడ వాపు లేదా సంచిలా ఏర్పడి కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఒత్తిడి, డిప్రెషన్, మద్య సేవనం వల్ల కూడా ఏర్పడుతుంది. కళ్లు ఇలా ఉబ్బినప్పుడు ఐస్, చల్లని నీళ్లను కళ్లకు పెట్టడం ద్వారా చికిత్స పొందవచ్చు. చల్లదనం వల్ల అక్కడ రక్త ప్రవాహం మెరుగై వాపు తగ్గుతుంది. రక్త ప్రవాహం పెరగడం వల్ల ఆక్సిజన్, పొషకాల సరఫరా పెరుగుతుంది. ఫలితంగా అక్కడ పేరుకుపోయిన విషతుల్యాలు తొలగిపోయి ద్రవాల నిల్వ తగ్గుతుంది.
ఈ వయస్సు దాటితే తప్పనిసరి: మీకు 40 ఏళ్లు దాటినట్లయితే తప్పకుండా మీ కళ్లను పరీక్షించుకోవాలి. మీకు గ్లాకోమా హిస్టరీ ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నట్లయితే తప్పకుండా కళ్లపై శ్రద్ధ పెట్టాలి.
Also Read: దొంగను పట్టించిన దోమలు, చంపినవాడిపై ఇలా ప్రతీకారం తీర్చుకున్నాయ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!