Sleeping Side Effects: నిద్ర ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా పడకేస్తున్నారా? ఈ జబ్బులు గ్యారంటీ!
Sleeping: మన శరీరానికి నిద్ర అత్యంత అవసరం. అయితే 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రపోతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే. మోతాదుకు మించి నిద్రపోతారో వారికి ఏమేం జబ్బులు వస్తాయో తెలుసుకుందాం.
Sleeping: మానవ జీవితానికి నిద్ర అనేది అత్యంత ముఖ్యమైనది. మన శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర అత్యవసరం. మన శరీరానికి కనీసం రోజుకు 6 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే అంతకన్నా ఎక్కువ సేపు నిద్రపోతే మాత్రం మీ శరీరానికి మీరే హాని కలిగించుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే తొమ్మిది గంటలకన్నా ఎక్కువ నిద్రపోతారో.. వారికి పలు జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఇటీవల డెన్మార్క్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. అతి నిద్ర వల్ల లాభనష్టాలను తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తలు సుమారు 400 మందిని పది రోజులపాటు వారు నిద్రించే క్రమాన్ని స్టడీ చేశారు. ఇందులో పాల్గొన్నవారంతా టైప్ 2 డయాబెటిస్ బాధితులే. వీరిని మూడు కేటగిరీలుగా విభజించి వారి నిద్ర వేళలను పరిశీలించారు. మొదటి కేటగిరి వారిని 7 గంటలు కంటే తక్కువ, రెండవ కేటగిరి వారిని 8 నుంచి 9 గంటలు.. మూడో కేటగిరి వారిని 9 గంటలు కంటే ఎక్కువ నిద్రపోయేలా ప్రోగ్రామ్ సెట్ చేశారు. అనంతరం వారిలో జరుగుతోన్న శరీరక మార్పులను పరిశీలించారు.
ఏడు గంటలకన్నా తక్కువసేపు నిద్రపోతున్నవారిలో మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అనే వ్యాధి తీవ్రత 2.6 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అంటే శరీరంలోని సూక్ష్మ రక్త నాళాలు చిట్లి పోవడం అని అర్థం. రోజులో 9 గంటల కన్నా ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో కూడా ఈ మైక్రోవాస్కులర్ డ్యామేజీ 2.3 రెట్లు ఎక్కువ సంభవించే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. అయితే, 2వ కేటగిరిలో ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి సమస్యలు కనిపించలేదు. కాబట్టి డైలీ 8 నుంచి 9 గంటలు నిద్రపోవడమే ఉత్తమం. అంతకంటే ఎక్కువ సేపు నిద్ర ప్రమాదకరం.
మైక్రోవాస్కులర్ డ్యామేజ్ వల్ల కలిగే నష్టాలేమిటీ?
ఈ మైక్రోవాస్కులర్ డ్యామేజీ కారణంగా కిడ్నీలు కూడా ఫెయిలయ్యే అవకాశం ఉంది. ఫలితంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్, డయాలసిస్ వంటి చికిత్స పద్ధతుల వరకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు వీరిలో హై బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా వీరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నరాలు దెబ్బ తినడం వల్ల చూపు కూడా మందగిస్తుంది. అధికంగా నిద్రించే వారికి ఊబకాయం సైతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి ప్రమాదకర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Read Also: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.