Viral: పెద్దమనసు చాటుకున్న జంట, ఉక్రెయిన్ల కోసం తమ అందమైన దీవిని శరణార్ధుల శిబిరంగా మార్చేశారు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ఉక్రెయిన్లను శరణార్దులుగా మార్చింది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలయ్యాక లక్షల మంది ఆ దేశాన్ని వీడి పొరుగు దేశాలకు పారిపోయారు. ఎన్నో దేశాలు వారికి సాదరంగా స్వాగతం పలికాయి. అలా స్వాగతం పలికిన దేశాల్లో కెనడా కూడా ఒకటి. కెనడాలో నివాసం ఉంటున్న జంట బ్రియాన్, షారోన్. వీరిద్దరికి కెనాడ పక్కనే ఒక సొంత దీవి ఉంది. పేరు ‘వాంకోవర్ దీవి’. దాదాపు 84 ఎకరాల్లో పరుచుకుని పచ్చగా ఉంటుంది ఈ దీవి. ఇందులో పెద్ద రిసార్ట్ గా కూడా ఉంది. తమ కుటుంబసభ్యులతో వారాంతాల్లో ఆ దీవిలో గడిపి వస్తారు బ్రియాన్ దంపతులు. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక అక్కడి ప్రజల పరిస్థితి చూసి చలించిపోయింది ఈ జంట. ప్రజలు పొట్ట చేతబట్టుకుని కెనడాకు కూడా తరలి రావడం చూశారు. తమ వంతు సాయంగా ఏదైనా చేయాలనుకున్నారు.
వారు కూడా వలసవాదులే...
బ్రియన్, షారోన్ ఉక్రెయిన్లను చూసి మరింతగా చలించి పోవడానికి కారణం వారు కూడా అదే దేశస్థులు.చాలా ఏళ్ల క్రితం కెనడాకు వలసవచ్చారు. ఆ రోజులను తలచుకున్నారు బ్రియాన్ ‘మేము కూడా వీరిలాగే బతికేందుకు ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు మేము సాయం చేసే స్థితిలో ఉన్నాం, అందుకే ఏదో ఒకటి చేయాలనుకున్నాం’ అని చెప్పారు.
వందమందికి...
తాము ఆటవిడుపు కోసం కొనుక్కున్న దీవికి ఉక్రెనియన్ల కోసం శరణార్ధుల శిబిరంగా మార్చేశారు. ఆ దీవిలో ఉన్న వారి రిసార్టులో దాదాపు వందమందికి ఆశ్రయం ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే 30 నుంచి 40 మంది అక్కడికి చేరుకున్నారు. మిగతావారు వచ్చే రెండు మూడు వారాల్లో చేరుకుంటారు. మరి ఇంతమందికి ఆహారం, దుస్తులు ఎలా? అందుకోసమే ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది ఈ జంట. తమ దీవికి ‘ఉక్రెనియన్ సేఫ్ హెవెన్’ అని పేరు పెట్టారు. అదే పేరుతో వెబ్ సైట్ ప్రారంభించారు. అందులో విరాళాలు సేకరించి ఆ వందమందికి వసతి కల్పించనున్నారు. మనసున్న కెనడియన్లు, చుట్టు పక్కల దేశస్థులు విరాళాలు అందిస్తున్నారు. వాటి సాయంతో రిసార్టును కూడా పునరుద్ధరించి గదులను కడుతున్నారు.
చదువు కూడా...
ఉక్రెనియన్ శరణార్దులకు కేవలం తిండి, బట్ట ఇచ్చి ఆదుకోవడం కాదు, అన్ని వసతులు ఉండేలా ప్లాన్ చేస్తోంది ఈ జంట. దీన్ని మినీ కమ్యూనిటీగా మార్చోబోతోంది. వారి పిల్లలకు చదువులు, రవాణా సౌకర్యం, ఆదాయ మార్గాలు... ఇలా వారి జీవితాలు వారు బతికేవిధంగా సహాయపడబోతున్నారు. వంద మంది బాధ్యత తీసుకోవడమంటే మాటలు కాదు. అందుకే ఈ జంటను మెచ్చుకుని తీరాల్సిందే.
Also read: గర్భస్రావం అయితే ఆ లోపం భార్యది మాత్రమే కాదు, ఈ కారణాలు మీకు తెలుసా !
Also read: వేసవిలో పెట్టే ఆవకాయలు, ఊరగాయలతో ఆరోగ్యానికి ఎంతో మేలు