(Source: ECI/ABP News/ABP Majha)
Abortion: గర్భస్రావం అయితే ఆ లోపం భార్యది మాత్రమే కాదు, ఈ కారణాలు మీకు తెలుసా !
గర్భధారణకు సంబంధించిన లోపాలను మహిళలపైనే నెట్టేసే కాలంలోనే ఇంకా జీవిస్తున్నాం మనం.
తల్లి కావడం నిజంగా ఒక వరం. ఆ వరం పొందడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారిలో చాలా మంది గర్భం ధరించలేకపోతున్నారు, మరికొంతమందిలో గర్భం ఏర్పడినప్పటికీ అది నిలబడడం లేదు. కొన్ని రోజులకే గర్భస్రావం జరుగుతోంది. అయితే గర్భధారణకు సంబంధించి ఏ సమస్య తలెత్తినా, గర్భస్రావం జరిగినా, గర్భం ఏర్పడకపోయినా... అన్నింటికీ మహిళనే కారణంగా చూపించే పరిస్థితులు ఈ ఆధునికకాలంలోనూ కొనసాగుతున్నాయి. నిజానికి గర్భస్రావానికి, గర్భం ధరించకపోవడానికి కేవలం మహిళ ఆరోగ్యపరిస్థితులే కాదు, మగవారి ఆరోగ్యపరిస్థితి కూడా కారణం కావచ్చు. దంపతుల్లో ఏ ఒక్కరిలో చిన్న లోపమున్నా గర్భం రాదు, వచ్చినా విచ్ఛిన్నమైపోతుంది.
భర్తలో ఈ లోపం ఉండొచ్చు
భర్త వీర్యకణాల్లో ఉండే లోపాల వల్ల కూడా గర్భస్రావాలు జరుగుతుంటాయి. ఈ విషయం చాలా మందికి తెలియక అబార్షన్ అయితే చాలు భార్యపైనే నెపం మోపుతారు. తరచూ గర్భస్రావాలు జరుగుతున్నప్పుడు కేవలం భార్యకే కాదు, భర్త కూడా పరీక్షలు చేయించుకోవాలి. సెమన్ అనాలసిస్ చేసి మార్ఫాలజీ, కౌంట్ లను పరీక్షిస్తారు. ఆ పరీక్షల్లో వీర్యలోపాలు ఏమైనా ఉంటే బయటపడతాయి. కొందరు పురుషులకు ‘నెక్రోస్పెర్మియా’ అనే సమస్య ఉంటుంది. అంటే వీరి వీర్యకణాలు పూర్తిగా ఎదగవు. అండం ఫలదీకరణం అతి కష్టమ్మీద జరిగి గర్భం ఏర్పడినా కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరికొందరి వీర్యకణాల్లో డీఎన్ఏ లోపాలు కూడా ఉండొచ్చు. వాటి వల్ల అబార్షన్లు సంభవిస్తాయి. కాబట్టి గర్భస్రావం జరిగినప్పుడు భార్యపైనే నింద వేయకుండా, భర్త కూడా తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇద్దరిలో ఎవరి ఆరోగ్య పరిస్థితులు వల్ల గర్భస్రావాలు జరుగుతున్నాయో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పవు
గర్భస్రావం జరిగాక గర్భాశయాన్ని శుభ్రం చేయించుకోవాలి. గైనకాలజిస్టు వద్దకు వెళితే ఆమె లోపల ముక్కలేవీ మిగిలిపోకుండా మొత్తం క్లీన్ చేస్తుంది. ఈ జాగ్రత్త పాటించకపోతే లోపల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు వచ్చి సమస్య తీవ్రంగా మారుతుంంది. బ్లీడింగ్ సమస్యలు, ఇన్ఫెక్షన్ ముదిరి గర్భాశయాన్ని తీసేయాల్సి రావడం కూడా జరగొచ్చు. కాబట్ట గర్భస్రావం జరిగాక క్లీన్ చేయించుకోవడం చాలా ముఖ్య ప్రక్రియ. గర్భం ధరించే వారి వయసు కూడా చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు పుట్టడం కష్టతరమవుతుంది. అబార్షన్లు అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి.
Also read: వేసవిలో పెట్టే ఆవకాయలు, ఊరగాయలతో ఆరోగ్యానికి ఎంతో మేలు
Also read: రంజాన్ ఉపవాసంలో ఖర్జూరాలకు ఎందుకంత ప్రాముఖ్యత? సైన్సు ఏం చెబుతోంది?