International Music Day: సంగీతం వినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఇవే
శ్రావ్యమైన సంగీతం వినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయో చూసేయండి.
సంగీతం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మనసు బాగోకపోయినా సంతోషంగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా.. ఇలా ఏ సందర్భం అయినా చెవిలో హెడ్ ఫోన్స్ తగిలించేసుకుని మనకు ఇష్టమైన పాట వింటూ ఉంటే మాటల్లో చెప్పలేని సంతోషం. సంగీతం వినడాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 న అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ ప్రారంభించింది. శ్రావ్యమైన సంగీతం వినడం వల్ల మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. సంగీతంతో రోగాలను నయం చెయ్యొచ్చు. అదే మ్యూజిక్ థెరపీ అని అంటారు.
కొన్ని క్లిష్టమైన రోగాలను నయం చేసేందుకు సంగీతమే వైద్యం. దాదాపు అన్నీ భాషల్లో సంగీతం ఉంటుంది. ఎవరికి ఏ మ్యూజిక్ నచ్చితే వాటిని వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. శరీరం, మనసు హాయిగా ఉండేలా చెయ్యడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని అంటారు. ఇవే కాదు సంగీతం వల్ల కొన్ని రకాల నొప్పులు, వ్యాధులు కూడా తగ్గుతాయి. అవేంటంటే..
నొప్పిని తగ్గిస్తుంది: సంగీతం నొప్పితో బాధపడుతున్న వ్యక్తులకి సహాయం చేస్తుంది. మ్యూజిక్ థెరపీ తీసుకోవడం అనేది మందుల కంటే బాగా పని చేస్తుంది. తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పులని తగ్గించడంలో సంగీతం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తుంది: రోజు వర్క్ అవుట్స్ చేసే వాళ్ళకి కొద్దిగా బోర్ కొట్టి ఏం చేస్తాంలే అని అనిపిస్తుంది. అదే నచ్చిన పాటలు వింటూ ఎంతసేపైనా వ్యాయామం చెయ్యాలని అనిపిస్తుంది. అలా వ్యాయామం చేస్తుంటే టైమ్ కూడా తెలియదు. సంగీతం వింటూ వ్యాయామం చేయడం వల్ల శ్రమ గురించి ఆలోచన తక్కువగా ఉంటుంది.
ఆందోళన తగ్గిస్తుంది: ఆందోళనతో బాధపడుతుంటే సంగీతం వింటే చాలా మంచి అనుభూతి పొందుతారు. శ్రావ్యమైన సంగీతం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరం తక్కువ ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. తీవ్రమైన ఆందోళన సమస్యతో బాధపడుతుంటే మ్యూజిక్ థెరపీ కూడా తీసుకోవచ్చు.
డిప్రెషన్ లేకుండా చేస్తుంది: మంచి సంగీతం విన్నప్పుడు లేదా మ్యూజిక్ థెరపీకి వెళ్ళినప్పుడు మీలొ ఉన్న డిప్రెషన్ లక్షణాలను ఇది తగ్గిస్తుంది. ప్రశాంతతని ఇస్తుంది. ఉల్లాసభరితమైన పాటలు హమ్ చేసుకుంటూ ఉంటే ఎంతటి బాధ అయినా మనసులోకి రాకుండా ఉంటుంది.
పాటలు వింటూ వ్యాయామం చేయడం కూడా చూస్తూ ఉంటున్నాం. దాన్నే జుంబా డాన్స్ అంటారు. ఇప్పుడు సిటీస్ లో ఎక్కడ చూసినా జుంబా సెంటర్స్ వెలుస్తున్నాయి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఇది గొప్ప వ్యాయామం అనే చెప్పుకోవాలి. మంచి బీట్ ఉన్న సాంగ్ పెట్టుకుని దానికి లయ బద్ధంగా స్టెప్స్ వేస్తూ బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. బిజీ షెడ్యూల్ లో ఉన్న చాలా మంది వర్కింగ్ పీపుల్ ఎక్కువగా జిమ్ కంటే జుంబా సెంటర్స్ కి వెళ్తున్నారు. సంగీతం జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. పాటలు విన్నప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని హమ్ చేస్తూ ఉంటాం. మెదడు చురుగ్గా ఉండటం వల్ల విషయాలను గుర్తుంచుకునే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే
Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు