world's coldest city: ఆ ఊర్లో ఫ్రిడ్జ్‌ల అవసరం లేదు - మనుషులంతా క్యాబేజీల్లా రెడీ అవుతారు
ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం యాకుట్స్. ఇక్కడ ఫ్రిడ్జ్‌ల అవసరం ఉండదు.
క్యాబేజీ ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి... పొరలు పొరలుగా తీస్తున్న కొద్ది ఆకులు వస్తూనే ఉంటాయి. అలాగే ఓ నగరంలోని ప్రజలు డ్రెస్సుల మీద డ్రెస్సులు వేసుకొని క్యాబేజీల్లా కనిపిస్తారు. అలా డ్రెస్సింగ్ చేసుకోకపోతే వారు ఆ చల్లదనానికి గడ్డకట్టుకుపోతారు. భూమిపై అత్యంత శీతల నగరంగా రికార్డు సాధించిన ఊరు యాకుట్స్. ఇది రష్యాలోని మాస్కోకు తూర్పు వైపుగా 5000 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతాకాలంలో ఈ నగరంలోని ఉష్ణోగ్రతలు మైనస్ 40 నుంచి మైనస్ 50 వరకు పడిపోతాయి. అప్పుడు మనుషుల కనురెప్పలు కూడా గడ్డకట్టుకుపోతాయి. తినే తిండి నిమిషాల్లో మంచులా మారిపోతుంది. అందుకే వారు కిటికీలు కూడా తెరవకుండా ఇంట్లోనే ఉంటారు. మార్కెట్ల నిండా మంచు పేరుకుపోతుంది. వారికి ఫ్రిడ్జ్ అవసరం ఇంతవరకు రాలేదట. మాంసాహారం ఎన్ని రోజులైనా తాజాగా ఉంటుంది. అప్పుడే వలవేసి తెచ్చిన చేపలు కూడా ఈ మంచుకి... గట్టిగా గడ్డల్లా మారిపోతాయి.
చేతులకు రెండు జతల గ్లౌజులు, తలకి మూడు నాలుగు టోపీలు, ఒంటిపై రెండు మూడు హుడీలు వేసుకుని తిరుగుతారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ చల్లదనం గురించి మాట్లాడుతూ ఈ చలిని భరించాలంటే దానికి అనుగుణమైన దుస్తులు ధరించడం తప్ప మరో పరిష్కారం లేదు అని అంటారు. ‘మేము ఈ చలికి అలవాటైపోయాం, మా మెదడు కూడా మమ్మల్ని సిద్ధం చేసింది. ఇది మాకు చాలా సాధారణంగా అనిపిస్తుంది.’ అంటూ మంచుతో కప్పబడిపోయిన ఆ నగరంలోని ఓ మహిళ చెప్పింది. ‘ఫ్రిడ్జ్, ఫ్రీజర్ల అవసరం మాకు పడదు. వేసవికాలంలో కూడా ఫ్రిజ్ అవసరం మాకు ఉండదు’ అని చెబుతున్నారు యాకుట్స్ నగర ప్రజలు.
ఈ నగరంలో 336,274 మంది నివసిస్తున్నారు. అక్కడ అధిక ఉష్ణోగ్రత అంటే 18 డిగ్రీల ఫారెన్ హీట్ మాత్రమే. అంతకుమించి అక్కడ ఎప్పుడూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవలేదు. అంటే ఏడాది పొడవునా చల్లగానే ఉంటుంది. మంచు కురుస్తూనే ఉంటుంది. అందుకే వారికి ఆ మంచు అలవాటైపోయింది.
View this post on Instagram
Also read: అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే మసాలా నెయ్యి - దీన్ని తయారు చేయడం ఎలా అంటే