Veg Kheema: శాకాహారుల కోసం టేస్టీ వెజ్ ఖీమా, రుచే కాదు పోషకాలు పుష్కలం
వండే ఓపిక ఉంటే శాకాహారంలో కూడా నాన్‌వెజ్‌తో పోటీపడేలా రకరకాల కూరలు వండుకోవచ్చు.
ఖీమా అనగానే అందరికీ గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్. అదే గుడ్డుతో చేస్తే ‘ఎగ్ బుర్జీ’ అని పిలుస్తారు. మరి శాకాహారుల కోసం ఖీమా వంటకం లేదా? ఎందుకు లేదు. చేసుకునే ఓపిక ఉండాలే కానీ రకరకాల రెసిపీలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే వెజ్ ఖీమాను కూడా టేస్టీగా వండుకోవచ్చు.దీని ద్వారా లభించే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పెద్దలు, పిల్లల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.చపాతీలో, అన్నంలో దీన్ని తినవచ్చు. రుచి అదిరిపోవడం ఖాయం.
కావల్సిన పదార్థాలు
క్యాలీ ఫ్లవర్ - చిన్నపువ్వు ఒకటి
పుట్టగొడుగులు - ఆరు (ఇష్టం లేకుంటే వేయకపోయినా ఫర్వాలేదు)
క్యారెట్ - ఒకటి
బీన్స్ - ఎనిమిది
పచ్చిబఠాణీలు - అరకప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
టొమాటోలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూున
కారం - అరస్పూను
ధనియాల పొడి - అరస్పూను
యాలకులు - ఒకటి
దాల్చిన చెక్క - చిన్నది
గరం మసాలా పొడి - అరటీస్పూను
పసుపు - అర టీస్పూను
ఆయిల్ - రెండు టేబుల్ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. క్యాలీఫ్లవర్, క్యారెట్, టొమాటోలు, బీన్స్, పుట్టగొడుగులు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముక్కలుగా కోస్తే కూరలా కనిపిస్తుంది. కాబట్టి తరిగితేనే ఖీమాలా కనిపిస్తుంది.
2. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా తరిగిపెట్టుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేయాలి. నూనె వేడెక్కాక దంచిన యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
4. అవి బాగా వేగాక టొమాటో ముక్కలు వేయాలి. అందులో ధనియాల పొడి, గరంమసాలా పొడి వేసి కలపాలి. పసుపు, కారం కూడా వేసి బాగా కలపాలి.
5. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయలను, పచ్చి బఠాణీలను కూడా వేసి కలపాలి.
6. అవి కాస్త వేగాక ఉప్పు, నీళ్లు వేసి కలపాలి.
7. అవి ఖీమాలా మెత్తగా ఉడికేదాకా ఉంచాలి. నీరు మొత్తం ఇంకిపోయి పొడిపొడిగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. అంతే వెజ్ ఖీమా సిద్ధమైనట్టే.
దీన్ని రాత్రిపూట చపాతీకి జతగా తింటే చాలా బావుంటుంది. అన్నంలో కలుపుకుని తిన్నా టేస్టీగానే ఉంటుంది. అనేక కూరగాయలు, మసాలాలు జోడించి వండడం వల్ల ఇది సంపూర్ణ పోషకాలను అందిస్తుంది. వారానికోసారి దీన్ని చేసుకుని తింటే చాలా మంచిది.
Also read: ఆపిళ్లు ఎన్నయినా తినండి, వాటిలోని గింజలు ఎక్కువ తింటే మాత్రం నేరుగా ఐసీయూకే