Guntur Vankaya Bajji : నోరూరించే వంకాయ బజ్జీ రెసిపీ.. గుంటూరు స్టైల్లో సాయంత్రం స్నాక్‌గా చేసుకుంటే..
Guntur Vankaya Bajji Recipe : వర్షం వస్తున్నప్పుడు.. సాయంత్రం పూట.. టేస్టీగా ఏమైనా తినాలకున్నప్పుడు వంకాయ బజ్జీ చేసుకోవచ్చు. గుంటూరు స్టైల్లో సింపుల్‌గా, టేస్టీగా దీనిని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం.
Guntur Style Vankaya Bajji Recipe : ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఫుడ్ ఫేమస్ ఉంటుంది. అలా గుంటూరుకు ఫేమస్ వంకాయ బజ్జీ. సరిగ్గా ట్రై చేయాలే కానీ.. ఇంట్లో కూడా ఈ వంకాయ బజ్జీలను చేసుకుని హాయిగా తినేయొచ్చు. వర్షం వస్తున్నప్పుడో.. లేదా పిల్లలకు స్నాక్‌గా ఏమైనా చేయాలనుకున్నప్పుడో.. టేస్టీగా, సింపుల్‌గా చేసుకోగలిగే రెసిపీ ఇది. పైగా దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరి నోరూరించే గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా?
కావాల్సిన పదార్థాలు
శనగపిండి - అర కిలో
ఉప్పు - రుచికి సరిపడా
సోడా - చిటికెడు
బియ్యం పిండి - రెండు చెంచాలు
మసాల ముద్దకోసం
ఉల్లిపాయ - 1
తెల్ల నువ్వులు - 4 స్పూన్లు
కారం - రెండు స్పూన్లు
జీలకర్ర - 1 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
చింతపండు - కొంచెం
కారం - 1 స్పూన్
నిమ్మరసం - 2
లేత వంకాయలు - అరకేజి
ఉప్పు - కొంచెం
నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత
ఉల్లిపాయ - 1 పెద్దది
పల్లీలు - కొన్ని (ఆప్షనల్)
తయారీ విధానం
ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో శనగపిండి, సాల్ట్, వంటసోడా, వరిపిండి వేసి కలుపుకోవాలి. నీళ్లు వేసుకోక ముందే పిండిని కలుపుకుంటే అన్ని బాగా మిక్స్ అవుతాయి. ఇలా పిండిని కలిపిన తర్వాత దానిలో నీళ్లు వేసుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకుండా.. కొంచె కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. పిండిలో వంకాయను ముంచితే దానికి అతుక్కునేంతగా ఉంటే సరిపోతుంది. పిండి మరీ లూజ్‌గా ఉండకూడదు.. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. పిండిని ఎంత బాగా కలిపితే బజ్జీలు అంత బాగా వస్తాయని గుర్తించుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
వంకాయ మసాల కోసం..
మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, కారం, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ చేసుకోవాలి. దీనిని గట్టి ముద్దగా చేసుకోవాలి. నీరు పోయకపోవడమే మంచిది. మిక్సీలో కాకుండా దంచుకున్నా కూడా మెత్తని ముద్దగా దంచుకోవాలి. ఓ గిన్నెలో కారం తీసుకోవాలి. దానిలో నిమ్మరసాన్ని పూర్తిగా వేసి కలుపుకోవాలి. దీనిని బజ్జీలు తినేప్పుడు సాస్‌లాగా వేసుకుంటే టేస్ట్ డబుల్ అవుతుంది. ఇప్పుడు వంకాయలను తీసుకుని బాగా కడగాలి. ఓ గిన్నెలో నీళ్లు వేసి ఉప్పు వేయాలి.
వంకాయలకు పొడుగ్గా గాట్లు పెట్టి.. పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోని.. కట్ చేసిన వాటిని నీళ్లల్లో వేయాలి. ఇప్పుడు వంకాయలను ఫ్రై చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి 50 శాతం ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వంకాయలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ మసాలాను వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయలను రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయిలో నూనె పెట్టాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని.. పొగలు రాకుండా చూసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలో.. వంకాయలను మంచి.. పిండి అంటుకున్న తర్వాత వాటిని నూనెలో వేసి వేయించుకోవాలి. అన్ని మంచి గోల్డెన్ రంగులు వచ్చేవరకు వేయించుకోవాలి. అదే నూనెలో చివర్లో పల్లీలు వేసుకుని రోస్ట్ చేసుకుని తీసేయాలి. స్టౌవ్‌ని ఆపేసి.. ఇప్పుడు వంకాయ బజ్జీలను మధ్యలో కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను స్టఫ్ చేసి.. ముందుగా తయారు చేసుకున్న నిమ్మరసం కారాన్ని పైన వేసుకోవాలి. పల్లీలతో గార్నీష్ చేసుకుని తింటే ఆ రుచే వేరు. మరి ఈ వర్షంలో లేదా ఈవెనింగ్ స్నాక్స్‌గా దీనిని చేసుకుని మీరు లాగించేయండి.
Also Read : వర్షంలో క్రిస్పీ, టేస్టీ పునుగులు తింటే ఉంటాది.. 20 నిమిషాల్లో చేసుకోగలిగే సింపుల్ రెసిపీ