Carrot Rice Recipe : టేస్టీ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్‌కి సూపర్ పర్ఫెక్ట్.. రెసిపీ కూడా చాలా సింపుల్
Healthy Recipe : మీ పిల్లలు క్యారెట్స్ తినట్లేదా? అయితే వారికి టేస్టీగా ఈ క్యారెట్ రైస్ చేసి పెట్టేయండి. టేస్టీ, హెల్తీగా ఉండే ఈ రెసిపీని తయారు చేయడం చాలా తేలిక. లంచ్‌గా పెద్దలు కూడా తీసుకోవచ్చు.
Tasty and Healthy Lunch Box Recipe : వివిధ కారణాలవల్ల కొందరి ఇళ్లల్లో అన్నం మిగిలిపోతుంది. కొందరు వాటిని తినరు. లేదంటే చిత్రాన్నం చేస్తారు. కేవలం మిగిలిపోయిన అన్నమే కాదు.. ఫ్రెష్‌గా రైస్ వండుకున్నప్పుడు.. దానితో ఏమైనా టేస్టీగా, హెల్తీగా తినాలనుకుంటే క్యారెట్ రైస్‌ను చేసుకోవచ్చు. క్యారెట్స్ తినని పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తినగలుగుతారు. పెద్దలు కూడా లంచ్ బాక్స్ కోసం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ, హెల్తీ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
అన్నం - 1 కప్పు
క్యారెట్లు - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1టేబుల్ స్పూన్
సాంబార్ పౌడర్ - 1 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 15
దాల్చిన చెక్క - 1 అంగుళం
ఏలకులు - 4
లవంగాలు - 4
బిర్యానీ ఆకు - 1
తయారీ విధానం
ముందుగా క్యారెట్లను సన్నగా తురిమి పక్కనపెట్టుకోవాలి. మీరు 1 కప్పు అన్నంతో ఈ రైస్ చేయాలనుకుంటే.. దానికి సమానంగా 1 కప్పు క్యారెట్ తురుమును రెడీ చేసుకోవాలి. తీసుకునే రైస్‌ని బట్టి.. క్యారెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరి తురుమును కూడా సిద్ధం చేసుకోవాలి. ఎండుకొబ్బరి కంటే పచ్చి కొబ్బరి మంచి రుచిని క్యారెట్ రైస్‌కు అందిస్తుంది. ఉల్లిపాయలను సన్నగా, చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మాత్రం పొడుగ్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి వేడి చేయండి. అది వేడి అయిన వెంటనే.. దానిలో యాలకులు, లవంగాలు, జీడిపప్పు, బిర్యానీ ఆకు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి. జీడిపప్పు రంగు మారుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలను పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గి.. కాస్త రంగుమారుతున్నప్పుడు క్యారెట్ తురుమును వేయాలి.
క్యారెట్ తురుము పచ్చివాసన పోయేవరకు బాగా కలిపి వేయించాలి. దీనిలోని పచ్చివాసన పోడానికి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దానిలో ఉప్పు, సాంబార్ పొడి వేసుకుని బాగా కలపాలి. సాంబార్ పొడి వేసుకుంటే ఈ క్యారెట్ రైస్ మంచి టేస్ట్‌ని అందుకుంటుంది. ఇప్పుడు దానిలో పచ్చికొబ్బరి వేసి బాగా కలపాలి. అనంతరం అన్నాన్ని వేసి బాగా కలపాలి. స్టౌవ్ ఆపేసి.. వేడిలోనే కలిపిస్తే రైస్ బాగా కలుస్తుంది. చివర్లో నిమ్మరసం పిండి.. కొత్తిమీర తురుము వేసి బాగా మిక్స్ చేయండి. ఇది మీకు మంచి ఫ్లేవర్‌ని అందిస్తుంది.
ఈ క్యారెట్ రైస్ పిల్లలకు చాలా మంచిది. పెద్దలు కూడా తమ లంచ్ బాక్స్‌గా దీనిని తీసుకువెళ్లవచ్చు. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. క్యారెట్స్ డైరక్ట్‌గా తిననివారు కూడా ఈ రైస్‌ను ఇష్టంగా లాగించేస్తారు. మీ పిల్లలు క్యారెట్స్ తినట్లేదని అనిపిస్తే.. ఇలాంటి రెసిపీలు చేసి పెట్టండి. ఇది వారి క్రేవింగ్స్‌ను తీర్చడంతో పాటు.. మంచి ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది.
Also Read : టీబీ వ్యాధిని కంట్రోల్ చేసే ఇమ్యునోథెరపీలు.. చికిత్సలో ఇవే గేమ్ ఛేంజర్