Mysore Bajji : గోధుమ పిండితో మైసూర్ బజ్జీలు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది
Wheat Flour Mysore Bajji : మైసూర్ బజ్జీ అంటే కేవలం మైదా పిండితోనే కాదు.. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. పిండి లోపల ఉండకట్టకుండా.. టేస్టీగా రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి.
Godhuma Pindi Mysore Bajji : మైసూర్ బజ్జీ అనేది బ్రేక్‌ఫాస్ట్‌లలో ఓ ఎమోషన్. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. మరికొందరు ఇష్టమున్నా నూనె ఎక్కువగా ఉంటుందని దూరంగా ఉంటారు. మరికొందరు పైనున్న లేయర్ తినేసి.. లోపలున్న ఉండను పక్కన పెట్టేస్తారు. సాధారణంగా ఈ తరహా మైసూర్ బజ్జీలను మైదాపిండితో చేస్తారు. అయితే గోధుమ పిండితో చేసుకునే మైసూర్ బజ్జీలు నూనెను తక్కువ పీల్చుకుంటాయి. పిండి లోపల ఉండకట్టకూడదంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే అయితే చాలు. అంతేకాకుండా మొత్తం తినగలిగే.. మైదాతో చేసిన బజ్జీలకు ఏమాత్రం తీసిపోని రెసిపీ గురించి ఈ రోజు తెలుసుకుందాం. దీనిని ఏయే పదార్థాలతో తయారు చేస్తారో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - 400 గ్రాములు
పెరుగు - ముప్పావు కప్పు
బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
పంచదార - 1 టేబుల్ స్పూన్
వంటసోడా - ఒకటిన్నర స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీరు - పిండికి సరిపడనంత
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2
కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత
తయారీ విధానం..
మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో పెరుగు, వంటసోడా వేసి బాగా చేతితో కలపండి. ఓ 30 సెకన్లు పక్కన పెడితే పెరుగు పొంగుతుంది. అయితే వంట సోడా తాజాది అయితే చాలా మంచిది. అప్పుడో బోండాలు బాగా వస్తాయి. పెరుగు తాజాగా, పుల్లగా ఉండేది వాడవచ్చు. కానీ పుల్లని పెరుగు బజ్జీలకు మంచి రుచిని ఇస్తుంది. ఇప్పుడు పొంగిన పెరుగులో బొంబాయి రవ్వ, ఉప్పు, పంచదార వేసి బాగా కలపండి. అనంతరం గోధుమపిండిని వేసి బాగా కలపండి. మెల్లగా నీరు పోసుకుంటూ.. పిండి కాస్త జారుడుగా వచ్చేలా నీరు వేసుకుంటూ కలపాలి.
పిండి కలుపుతున్న సమయంలో మీరు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. పిండి మరీ జారుడుగా అయితే అది నూనెను బాగా పీల్చేసుకుంటుంది. మరీ గట్టిగా ఉంటే బజ్జీల లోపల ఉడకకుండా.. గడ్డగా మారుతుంది. కాబట్టి పిండిని మీడియంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని చేతితో లేదా మిక్సర్‌తో బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే పిండిని ఎంత బాగా కలిపితే.. బజ్జీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఓ 5 నిమిషాలు పిండిని బాగా కలిపి.. ఇప్పుడు ఆ మిక్సింగ్ బౌల్ లోపలి అంచులను తుడవండి. లేదంటే అంచులకు అంటుకునే పిండి.. బజ్జీల మిశ్రమంలో కలిసి.. అక్కడక్కడ గట్టిగా ఉండేలా.. బజ్జీ విడిపోయేలా చేస్తుంది.
ఇలా కలిపిన మిశ్రమాన్ని 45 నిమిషాలు నానబెట్టాలి. రెండు, మూడు గంటలు మీరు నానబెడితే బజ్జీలు ఎంత టేస్టీగా వస్తాయో.. సమయం ఎక్కువ లేదనుకున్నప్పుడు మాత్రం 45 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు దానిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి, జీలకర్ర వేసి బాగా మరో రెండు నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి లోతైనా కడాయిని తీసుకోండి. దానిలో నూనెవేసి మీడియం మంట మీద నూనెను వేగనివ్వండి. నూనె బాగా వేడి అయిన తర్వాత పిండిని బొండాల మాదిరిగా వేసుకోవాలి.
మీడియం మంట మీదనే బజ్జీలు వేయించాలి. లేదంటే అవి సరిగ్గా వేగవు. పైగా మైదాతో చేసినవి లేత గోధుమరంగులో ఉంటాయి. కానీ గోధుమ పిండితో చేసిన మైసూర్ బజ్జీలు కాస్త ఎక్కువరంగును కలిగి ఉంటాయి. కాబట్టి ముందే వాటిని తీసేయకండి. మంచి గోధుమరంగులోకి వచ్చాయంటే మీరు వాటిని తీసేయొచ్చు. మిగిలని పిండిని కూడా ఇలానే చేసుకోవాలి. అంతే వేడి వేడి టేస్టీ మైసూర్ బజ్జీలు రెడీ. వీటిని మీరు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు.
Also Read : చద్దన్నం చేసుకోవడంలో ఆ మిస్టేక్స్ చేయకూడదట.. మజ్జిగను అలా వేసుకుంటేనే మంచిదట