(Source: ECI/ABP News/ABP Majha)
Chewing Gum: రోజుకో గంట చూయింగ్ గమ్ నమిలితే ఒత్తిడి హుష్..
చూయింగ్ గమ్ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా రోజూ నమలడం మొదలుపెడతారు.
చాలా మంది టీనేజర్లకు ఉన్న అలవాటు చూయింగ్ గమ్ నమలడం. మిగతా వయసుల వారు పెద్దగా దీని గురించి పట్టించుకోరు. ఇక పిల్లలకు ఇవ్వడం అంత సేఫ్ కాదు. అయితే పెద్దవాళ్లు ఎవరైనా చూయింగ్ గమ్ నమలచ్చు, నమిలితే చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నాయి అధ్యయనాలు. అలాగని ఉదయం నుంచి రాత్రి వరకు నమిలితే నష్టాలు తప్పవు. రోజులో కేవలం ఓ గంట పాటూ నమిలితే చాలు. చాలా లాభాలు కలుగుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు చూయింగ్ గమ్ నమిలితే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వారిలో ఆకలి తగ్గుముఖం పడుతుంది. అలాగే చిరుతిళ్లకు దూరంగా ఉంటారు. వాటిని తినాలన్న కోరిక వారిలో పుట్టదు. ఇప్పటికే లివర్ పూల్ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనంలో చూయింగ్ గమ్ నమిలే వారిలో కన్నా, నమలని వారిలో ఆహారం తినడం ఎక్కువగా ఉందని తేలింది. దాదాపు 36 కేలరీల ఆహారాన్ని వారు అధికంగా తీసుకుంటున్నట్టు అధ్యయన ఫలితం. గంటపాటూ చూయింగ్ గమ్ నమలడం వల్ల 11 కెలరీలు కరిగించుకోవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు చూయింగ్ నమలడం మొదలుపెట్టచ్చు.
రోజూ 20 నిమిషాల పాటూ చూయింగ్ గమ్ నమలడం వల్ల దంతాల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగిస్తుంది. దీనివల్ల దంతక్షయం కలగదు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఇప్పటికే కావిటీస్ నివారించడానికి చూయింగ్ గమ్ ను సిఫారసు చేస్తోంది.
చూయింగ్ నమలడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం వంటి సానుకూల ప్రభావాలు కలుగుతాయి. ప్రొఫెసర్ ఆండ్రూ షోలే చేసిన పరిశోధనలో చూయింగ్ గమ్ నమలడం ద్వారా జ్ఞాపకశక్తిని 35 శాతం మెరుగుపరుచుకోవచ్చని బయటపడింది. అలాగే అతిగా నమిలితే అదే జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. కనుక రోజుకు గంట కన్నా ఎక్కువ సేపు నమలకుండా ఉండడం మంచిది.
భోజనం చేశాక ఓ పావుగంట సేపు గమ్ నమిలితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా నమలడం వల్ల అన్నవాహికలో ఆమ్ల స్థాయులు తగ్గుతాయి. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట తగ్గుతాయి.
2011లో చేసిస ఓ అధ్యయనంలో మానసిక ఆందోళనలు, డిప్రెషన్ తో బాధపడేవారు రెండు వారాల పాటూ రోజుకు రెండు సార్లు చూయింగ్ గమ్ నమలడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని బయటపెడింది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చూయింగ్ గమ్ ముందుంటుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు చూయింగ్ గమ్ నమిలితే మంచి ఫలితం ఉంటుంది.
రోజూ చూయింగ్ గమ్ తినాలనుకునేవారు షుగర్ లెస్ ఎంచుకోవడం ఉత్తమం. లేకుంటే ఇతర సమస్యలు తలెత్తవచ్చు.