Hair: ఒత్తిడి, భయం... జుట్టును తెల్లబడేలా చేస్తాయా? ఇందులో నిజమెంత?
అందం అనే కొలమానంలో జుట్టుది ప్రధాన పాత్ర. కానీ జుట్టుతో ఎన్నో అపోహలు ముడిపడి ఉన్నాయి.
జుట్టంటే ఇష్టపడని వారెవ్వరు? ఊడిపోతుంటే బాధపడనిదెవ్వరు? జుట్టు ఊడే విషయమై, తెల్లబడే విషయమై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. వాటిలో నిజమెంతో ఆరోగ్యనిపుణులు వివరించారు.
అపోహ: అధిక భయం, ఒత్తిడి జుట్టును రాత్రికి రాత్రే తెల్లబడేలా చేస్తాయి.
నిజం: ఒత్తిడి, భయం అనేవి నిరాశ, డిప్రెషన్ వంటివాటికి కారకాలు. ఆ రెండింటికీ రాత్రి పూట జుట్టు తెల్లబడటానికి సంబంధం లేదు. తీవ్రమైన ఒత్తిడి జుట్టు వర్ణద్రవ్యమైన మెలనోసైట్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఈ మెలనోసైట్ కణాలు మాడు కింద చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి జుట్టు తెల్లబడే ప్రక్రియ అంత సులువుగా జరగదు. కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. జుట్టు నెరవడానికి విటమిన్ బి12 లోపంతో పాటూ, హైపో థైరాయిడిజం కూడా కారణమే.
అపోహ: రోజూ తలకు స్నానం చేస్తే జుట్టు రాలిపోతుంది.
నిజం: నిత్యం మన తలపై పదిశాతం వెంట్రుకలు ఊడిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి తలకు స్నానం చేసినప్పుడు ఊడడం సాధారణ విషయం. రోజూ తలకు స్నానం చేస్తే జుట్టు ఊడితుందడనడానికి ఆధారాల్లేవు. అలా కాకుండా పెచ్చుపెచ్చులుగా ఊడుతుంటే అది తల స్నానం చేసినందు వల్ల కాదు, మరేదైనా కారణం వల్ల ఊడుతుందేమో చూసుకోవాలి.
అపోహ: తరచూ ట్రిమ్మింగ్ చేస్తుంటే జుట్టు వేగంగా, పొడవుగా పెరుగుతుంది.
నిజం: ఇది ప్రజల్లో బాగా నానిపోయిన నమ్మకం. జుట్టు కత్తిరిస్తుంటే బాగా పెరుగుతుందని. కానీ ఇది నిజం కాదు. జుట్టు పెరుగుదల మాడు కింద ఉన్న వెంట్రుకల ఫోలికల్స్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి చివర్లు కత్తిరిస్తే మొదలు నుంచి జుట్టు పెరగడం అనేది అపనమ్మకమే. ఆరోగ్యకరమైన జుట్టు ప్రతి నెలా అర అంగుళం పెరుగుతుంది.
అపోహ: తలపై చుండ్రు ఉంటే మాడు పొడిగా మారినట్టు అర్థం.
నిజం: చుండ్రు అన్నదానికి మాడు పొడిబారడానికి సంబంధంలేదు. చుండ్రు శరీరంలోని ఇన్ ఫ్లమ్మేషన్‌ను సూచిస్తుంది. అధికంగా చుండ్రు ఉండడం అనేది సొరియాసిస్, ఎగ్జిమా, అలెర్జిక్ డెర్మటైటిస్ వంటి ఇన్ఫ్మమేటరీ పరిస్థితులను సూచిస్తుంది.
అపోహ: చిట్లిన, పెళుసుగా మారిన జుట్టును సప్లిమెంట్ల వాడకం ద్వారానే బాగుచేయగలం.
నిజం: హెయిర్ సప్లిమెంట్ల ద్వారా జుట్టును ఆరోగ్యవంతంగా, బలంగా చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. వాటి వల్ల కొన్ని రకాల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. కాబట్టి సహజపద్ధతిలో జుట్టును బలంగా మార్చేందుకు ప్రయత్నించండి. కలర్ వేయడం, జుట్టును వేడిమికి గురిచేసే స్టైలింగ్ ప్రక్రియలు మానివేయడంతో పాటూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా జుట్టు పునరుజ్జీవాన్ని ఇవ్వచ్చు. ప్రోటీన్లు, బి విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తింటే జుట్టు మెరవడం ఖాయం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు
Also read: అంతరిక్ష ప్రయాణంతో రక్తహీనత... స్పేస్ ట్రావెలింగ్‌పై తొలి అధ్యయనం, బయటపడిన షాకింగ్ నిజాలు
Also read: రోజుకు రెండు స్పూనుల నువ్వులు... బరువు తగ్గించడమే కాదు, గుండెపోటునూ అడ్డుకుంటాయి
Also read: ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎక్కడైనా కనిపిస్తే వదలకండి, ముఖ్యంగా మధుమేహ రోగులు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్