Clever Crow: ఆహారం కోసం పారిశుద్ధ్య పనులు చేస్తున్న కాకులు.. అబ్బో ఏం తెలివి గురూ!
ఇది కథ కాదు నిజం. కాకులు తమ ఆహారం గురించి పారిశుద్ధ్య పనులు చేస్తున్నాయి. తెలివిగా కడుపు నింపుకుంటున్నాయి. వీటికి ట్రైనింగ్ ఇచ్చింది మరెవ్వరో కాదు మనుషులే.
మీ చిన్నప్పుడు తప్పకుండా కాకి కథ చదివే ఉంటారు. బాగా దాహంతో ఉన్న కాకికి ఓ కుండ కనిపిస్తుంది. అందులో నీళ్లు మరీ అడుగంటి ఉండటంతో ఆ కాకికి కత్తిలాంటి ఐడియా వస్తుంది. కాకి తన ముక్కుతో రాళ్లను తెచ్చి కుండలో వేస్తుంది. దీంతో కుండలో అడుగున ఉన్న నీళ్లు పైకి వస్తాయి. అలా కాకి తన దాహాన్ని తీర్చుకుంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే కాకులు కూడా దాని ఫ్యామిలీకి చెందినవే. అయితే, ఈ కాకులు పారిశుధ్య పనులు చేసి మరీ ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. అదేలా సాధ్యం? ఇది కూడా కథ కావచ్చని మాత్రం అనుకోవద్దు. ఇది నిజంగానే జరిగింది.
కార్విడ్ క్లీనింగ్ (Carvid Cleaning) అనే స్టార్టప్ సంస్థకు వచ్చిన ఐడియా ఇది. కాకి తెలివికి మనిషి మేథస్సు తోడైతే ఎలా ఉంటుందో చూపించేందుకు ఆ సంస్థ వినూతన ప్రయోగం చేసింది. ఈ సందర్భంగా కాకులకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చింది. సాధారణంగా మనకు ఆహారం కావాలంటే డబ్బులిచ్చి కొనుగోలు చేస్తాం. అలాగే.. ఆ కాకులకు ఆహారం కావాలంటే.. క్లీనింగ్ పనులు చేయాలి. అవి మనుషుల్లా పెద్ద పెద్ద పారిశుద్ధ్య పనులు చేయలేవు కాబట్టి.. సింపుల్ పనే అప్పగించారు. రోడ్డు మీద స్మోకింగ్ చేసి పడేసే సిగరెట్ బట్స్ తీసుకురావాలి. ఆ తర్వాత వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఓ రంథ్రంలో వేయాలి. ఆ బట్స్ ఆ రంథ్రంలో పడగానే పక్కనే ఉన్న మరో పరికరం నుంచి ఆహారం కిందికి వస్తుంది. ఒకరకంగా ఇదొక ఫుడ్ వెండింగ్ మెషీన్‌లా పనిచేస్తుందన్నమాట.
మరి, కాకికి అన్ని తెలివి తేటలు ఉంటాయా అనేగా మీ సందేహం. చెప్పాలంటే.. కాకులు చాలా తెలివైనవి. ట్రైనింగ్‌లో నేర్పించినట్లే.. అవి బయటకు వెళ్లి రోడ్డు మీద పడేసే సిగరెట్ బట్స్‌ను తీసుకొచ్చి అవి రంథ్రంలో వేస్తూ ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. స్వీడన్‌లో ఏర్పడుతున్న చెత్తలో 62 శాతం వరకు సిగరెట్ బట్స్ ఉంటున్నాయట. రోడ్లపై వీటిని పడేయోద్దని మున్సిపల్ సిబ్బంది ఎన్నిసార్లు వెల్లడించినా మాట వినడం లేదు. దీంతో ఈ స్టార్టప్ సంస్థ కాకుల ద్వారా ఆ బట్స్‌ను ఏరిస్తూ.. వాటికి ఆహారాన్ని అందిస్తోంది. ఈ సంస్థకు Sweden Tidy Foundation ఆర్థిక సహాకారం అందిస్తోంది. అయితే, ఆ సిగరెట్ బట్స్ వల్ల కాకుల ఆరోగ్యం దెబ్బతింటుందని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ కాకులు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి.