Snakegourd Recipe: పొట్లకాయ-నువ్వులపొడి కూర... ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ తినాలనిపించడం ఖాయం
పొట్లకాయ తినేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. వాటి అమ్మకాలు కూడా తక్కువగానే ఉన్నాయి.
ఆరోగ్యకరమైన కూరగాయల్లో పొట్లకాయ ముందుంటుంది. కానీ దీన్ని తినేవారు ఎంత మంది? మార్కెట్లో కూడా ఎక్కడో గాని వీటిని అమ్మట్లేదు. మన దేశంతో పాటూ ఇతర ఆసియా దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో, ఆస్ట్రేలియాలోనూ పొట్లకాయలను వండుకుని తింటారు. కానీ ఎందుకో మన దగ్గర వాడకం తగ్గింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పొట్లకాయ, నువ్వులు కలిపి చేసే కూరకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఆ కూరను అందరూ మర్చిపోయినట్టే కనిపిస్తున్నారు. పొట్లకాయ, నువ్వుల్లోని మంచి గుణాలు తెలుసుకుంటే మీరు మళ్లీ ఆ కూర వండడం ఖాయం.
పొట్లకాయ తింటే ఎంతో ఆరోగ్యమో...
పొట్లాకాయలో నీటి శాతం అధికం. డీ హైడ్రేషన్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. దీని ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. వీటివతో పాటూ మన శరీరానికి అత్యవసరమయ్యే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్, సోడియం వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. పొట్లకాయ కూర తరచూ తినడం వల్ల కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కలగవు. డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పథ్యం భోజనంగా పొట్లకాయను తినొచ్చు.
నువ్వులు...
రోజుకు గుప్పెడు నువ్వులు తింటే చాలు శరీరానికి ఎంతో ఆరోగ్యం. టైప్ 2 డయాబెటిస్ రాకుండా అడ్డుకోవడం నువ్వుల్లోని పోషకాలు ముందుంటాయి. కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. హైబీపీ ఉన్నవారికి నువ్వులు చాలా మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది కనుక ఎముకలు గట్టిగా మారతాయి.
పొట్లకాయ - నువ్వల పొడి కూర
కావాల్సిన పదార్ధాలు
పొట్లాకాయ ముక్కలు - అరకిలో
నువ్వులు - ఆరు స్పూనులు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
జీలకర్ర - ఒక స్పూను
ఎండు మిర్చి - నాలుగు
వెల్లుల్లి - మూడు రెబ్బలు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఆవాలు - అరటీస్పూను
పసుపు - కొద్దిగా
ఉప్పు - మీ రుచికి సరిపడా
నూనె -తగినంత
తయారీ
పొట్లకాయ ముక్కలను సన్నగా తరుగు కోవాలి. ఇప్పుడు ఒక కళాయి స్టవ్ మీద పెట్టి వేడెక్కాక ఎండు మిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత నువ్వులు కూడా వేసి మాడిపోకముందే తీసేయాలి. ఇప్పుడు ఆ మూడు కలిపి మిక్సీలో పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి వేయించాలి. సన్నగా తురిమిన ఉల్లిముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. తరవాత పొట్లకాయ ముక్కలు వేసి ఉప్పువేయాలి. వాటిని బాగా మగ్గించాలి. పొట్లకాయ ముక్కలు సగం ఉడికాక నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. ఓ పదినిమిషాలు ఉడికిస్తే చాలాు కూర సిద్ధమైపోతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎప్పుడైన కూర అడుగంటుతోంది అనిపిస్తే నీళ్లు వేయండి. లేకుంటే అలా చిన్న మంట మీద కూర సిద్ధమైపోతుంది. చాలా మేరకు పొట్లకాయల్లోని నీరు సరిపోతుంది. ఈ కూర రుచి మామూలుగా ఉండదు.