Sitting: స్మోకింగ్ కన్నా ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే ఉద్యోగమే డేంజర్
ధూమపానం చేసే హానికన్నా ఎక్కువ సేపు కూర్చోవడమే హాని చేస్తుంది
ఉద్యోగంలో భాగంగా ఆఫీసులో ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వారి సంఖ్య అధికంగా ఉంది. వర్క్ ఫ్రం హోం చేసేవారు కూడా రోజుకు 12 నుంచి 13 గంటలు కదలకుండా కూర్చోవడం చేస్తున్నారు. నిజానికి రెండు గంటల పాటు కదలకుండా కూర్చోవడమే శరీరానికి ఎంతో హానికరం. ఇది ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగడంతో సమానమని చెప్పుకోవచ్చు. ప్యాకెట్ సిగరెట్లు తాగితే శరీరానికి ఎంత హాని జరుగుతుందో, రెండు గంటల పాటు కదలకుండా కూర్చోవడం వల్ల కూడా అంతే హాని జరుగుతుంది. దీర్ఘకాలంగా ఇలా కూర్చోవడం వల్ల హైబీపీ త్వరగా వచ్చేస్తుంది. అలాగే కార్డియోవాస్కులర్ జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. కూర్చున్నప్పుడు పెద్దగా శక్తి వినియోగం ఉండదు. కాళ్లు, చేతులు ఒకే భంగిమలు ఎక్కువ సేపు ఉండిపోతాయి. దీనివల్ల రక్తప్రసరణ కూడా సరిగా జరగదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. బరువు కూడా పెరుగుతారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ఛాన్సులు ఎక్కువ.
ధూమపానం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. అలాగే ఎక్కువ గంటల పాటు కదలకుండా కూర్చోవడం వల్ల కూడా అనేక రోగాలు శరీరంలో పుట్టుకొస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ అనేది శరీరానికి చాలా అవసరం. ప్రతి రెండు గంటలకు ఒకసారి లేచి పది నిమిషాలు పాటు వేగంగా ఇటూ అటూ నడవడం చాలా ముఖ్యం. ఇది శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలా కాకుండా రోజూ ఐదారు గంటలు కదలకుండా కూర్చుంటే సమీప భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
ఎక్కువసేపు కూర్చునే వారిలో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఒక అధ్యయనంలో భాగంగా రోజుకు ఎనిమిది గంటల పాటు కదలకుండా కూర్చుని పని చేసే వారికి అనేక రకాల ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు అని తేలింది. ఎక్కువసేపు కూర్చుంటే ఊపిరితిత్తులు, పెద్ద పేగు, గర్భాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కండరాల్లో కదలికలు లేక అవి బిగుసుకుపోతాయి. జీర్ణ వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. చక్కెర నిల్వలు పేరుకుపోతాయి. జాయింట్ పెయిన్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. రోజంతా ఎక్కువ సేపు కూర్చుని తర్వాత ఎన్ని వ్యాయామాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి కూర్చోవడం అనేది తగ్గించండి. వీలైతే ప్రతి గంటకు ఒకసారి లేచి ఇటూ అటూ నడుస్తూ ఉండండి. కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉండండి. టీవీ చూస్తున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూర్చోవడం కన్నా నడుస్తూ ఆ పని చేయడం ఉత్తమం. టీ బ్రేకులు తీసుకొని ఆ సమయంలో కూడా నడవడం చాలా ముఖ్యం. ఫ్యాన్ కింద కూర్చుని పనిచేసే వారి కన్నా, బయట శారీరక శ్రమ చేసే వారే ఆరోగ్యంగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
Also read: ఆత్రుత ఎక్కువ పడుతున్నారా? ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం
Also read: యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడుతున్నారా? చాలా ప్రమాదకరం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.