Menstrual Hygiene: పీరియడ్స్ టైమ్ లో అపరిశుభ్రంగా ఉంటే ఈ వ్యాధులు దాడి చేస్తాయ్, జాగ్రత్త!
రుతుక్రమం వచ్చిన సమయంలో అపరిశుభ్రంగా ఉంటే అది శరీరం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల అనేక వ్యాధులు దరి చేరతాయి.
నెలసరి వచ్చే రెండు మూడు రోజుల ముందు నుంచే ఇబ్బందులు మొదలైపోతాయి. నడుము, కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పిగా ఉంటుంది. తిమ్మిరి నుంచి మూడ్ స్వింగ్స్ వరకు ప్రతి నెల ఐదు నుంచి ఏడు రోజుల పాటు మహిళలు ఈ బాధలు ఎదుర్కోవాల్సిందే. వీటి నుంచి బయట పడేందుకు కొంతమంది మందులు తీసుకుంటారు. మరికొందరు ఆహారాన్ని మార్చుకుంటారు. అయితే పీరియడ్స్ టైమ్ లో ప్రతీ స్త్రీ తప్పనిసరిగా పాటించాల్సిన విషయం ఏమిటంటే పరిశుభ్రత. ఇంట్లో రోజువారీ పరిశుభ్రత విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో అంతకంటే ఎక్కువగానే రుతుక్రమంలో శుభ్రంగా ఉండాలి. శానిటరీ ప్యాడ్స్ మార్చుకోవడం, స్వీయ పరిశుభ్రత విధానాలని నిర్వహించడానికి సరైన వస్తువులు ఉపయోగించడం ముఖ్యం. ఆ సమయంలో అపరిశుభ్రంగా ఉంటే కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయి. శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
రుతుస్రావం సమయంలో అపరిశుభ్రమైన పద్ధతులు అనుసరించడం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. భారతదేశంలో దాదాపు 43 నుంచి 88 శాతం మధ్య బాలికలు డిస్పోజబుల్ ప్యాడ్‌లను ఉపయోగించకుండా కాటన్ క్లాత్‌లను ఉపయోగించి వాటిని ఉతికి ఆరేస్తున్నారు. మళ్ళీ వాటిని వినియోగిస్తున్నారు. అలా చేయడం వల్ల అనేక వ్యాధులు దరిచేరే ప్రమాదం ఉంది. రుతుక్రమం సమయంలో శుభ్రంగా లేకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
ఈస్ట్ ఇన్ఫెక్షన్: ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది కాండిడా అల్బికాన్స్ వల్ల కలిగే ఫంగల్ వ్యాధి. వజీనాలోని మంచి బ్యాక్టీరియాని దాటుకుని ఫంగస్ దాడి చేసి రోగాలని వృద్ధి చేసే జీవులను పెంచుతుంది. అనారోగ్యకరమైన రుతు పరిశుభ్రత పాటిస్తే ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్: చాలా మంది మహిళలు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. వజీనాలో దురద, మంట, చికాకు, వైట్ డిశ్చార్జ్, కొన్ని సార్లు మంట వంటి లక్షణాలు ఉంటాయి. శానిటరీ న్యాప్ కిన్స్ ఎప్పటికప్పుడు మార్చకపోవడం లేదా మురికిగా ఉన్న న్యాప్ కిన్స్ ఉపయోగించడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ చేరుతుంది.
యూరీనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: అంటువ్యాధిలో అత్యంత సాధారణ రకం. రుతుస్రావం వయస్సులో ఉన్న బాలికలు, స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది అవయవాలు వైఫల్యానికి దారి తీసే అవకాశాలని పెంచుతుంది. అపరిశుభ్రమైన పద్ధతుల కారణంగా ఇది ఎక్కువగా వస్తుంది.
బ్యాక్టీరియల్ వాజినోసిస్: యోని స్రావాల pH బ్యాలెన్స్ లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది సహజ వృక్ష జాలంలో మార్పుకు దారితీస్తుంది. రుతు పరిశుభ్రత పాటించకపోతే అధిక pH స్థాయి అనారోగ్యకరమైన బ్యాక్టీరియా సంతానోత్పత్తికి అనువైన వాతావరణాన్ని అందిస్తుంది. వజీనాలో మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. దాని వల్ల వాజినోసిస్ కు కారణమవుతుంది.
అందుకే ప్రతి ఒక్క స్త్రీ పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా సమస్యలు వస్తే ఆలోచించకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: జాగ్రత్త, ఈ విటమిన్ సప్లిమెంట్స్ బ్లడ్ ప్రెజర్ ని పెంచేసి ప్రాణాల మీదకు తెస్తుంది