Plastic Pollution: షాకింగ్, మనిషి గుండెలో ప్లాస్టిక్ వ్యర్థాలు - చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్, ఏలా చేరుతున్నాయో తెలుసా?
భూమిపై ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతుంది. ఓ వైపు అది మానవాళికి చేస్తున్న నష్టం కనిపిస్తున్నప్పటికీ ప్లాస్టిక్ వినియోగం మాత్రం ఆగడం లేదు.
ఏవైనా జంతువులు చనిపోయినప్పుడు వాటి పొట్టలో విపరీతంగా ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు దొరికాయనే వీడియోలు తరచూ మనం టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మానవాళి కూడా ప్రమాదంలో పడిపోయింది. అందుకు నిదర్శనమే తాజాగా బయట పడిన అధ్యయనం. ఎవరూ ఊహించని విధంగా మనిషి గుండెలో ప్లాస్టిక్ వ్యర్థాలని చైనా శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. బీజింగ్ అన్ జెన్ హాస్పిటల్ కి చెందిన పరిశోధకుల బృందం ఈ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. నిజానికి ప్లాస్టిక్ గుండె వరకు ఎలా చేరుతుందో ఎవరూ ఊహించి ఉండలేరు.
గుండెలో మైక్రోప్లాస్టిక్
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం శాస్త్రవేత్తలు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న 15 మంది రోగుల్ని పరిశీలించారు. వారి గుండె కణజాలాన్ని నిశితంగా పరిశీలించారు. అందులో పది వేల నుంచి కొన్ని వేల వరకు అనేక చిన్న ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు విశ్లేషించిన ప్రతి రక్త నమూనాలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయి. ఈ మైక్రోప్లాస్టిక్ గుండె కణజాలంలోకి ఎలా ప్రవేశించింది? గుండెకి శస్త్రచికిత్స చేసిన తర్వాత రోగి ఆరోగ్యం మీద ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడానికి భవిష్యత్ లో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.
దుస్తులు, ఆహార ప్యాకేజింగ్ లో ఉపయోగించే పాలిథిలిన్, టెరెఫ్తాలేట్, పాలీ వినైల్ క్లోరైడ్ (PVC)లు సాధారణంగా విండో ఫ్రేమ్‌లు, డ్రైనేజీ పైపులు, పెయింట్ వంటి వాటిలో ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకులు తెలిపిన దాని ప్రకారం 5 మిల్లీమీటర్ల వెడల్పు( అంటే పెన్సిల్ ఎరేజర్ పరిమాణం) కంటే తక్కువగా ఉండే మైక్రోప్లాస్టిక్ లు నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించగలవు. ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లేట్లు, గిన్నెలు కాలం గడిచేకొద్దీ సూక్ష్మపరిమాణంలో తనలోని ప్లాస్టిక్ అణువులను విడిచిపెడుతూ ఉంటాయి. అవి మన కంటికి కూడా కనిపించవు. వాటిని మనకి తెలియకుండానే తినేస్తున్నాం.
మైక్రోప్లాస్టిక్ వల్ల నష్టాలు
గుండె మీద మాత్రమే కాదు మెదడు ఆలోచనా తీరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అది మాత్రమే కాదు స్త్రీ, పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. దీని వల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది.
నివారణ చర్యలు
ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయడం, వేడి చేయడం మంచిది కాదు. టెఫ్లాన్ లేదా ఇతర పూతలతో కుండలు, పాన్‌లు వంటి ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోవాలి. ప్లాస్టిక్ కప్పులు లేదా బాటిళ్లలో ఉంచిన నీటిని తాగవద్దు. బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, గాజుతో చేసిన బాటిళ్లను ఎంచుకోండి. చేపలు వంటి సముద్రపు, నదుల ఆహారాన్ని తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా శుభ్రం చేశాకే తినాలి. అవి మైక్రోప్లాస్టిక్ లను అధికంగా కలిగిఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.