Khosta 2 Virus: రష్యన్ గబ్బిలాలలో కోవిడ్‌లాంటి వైరస్, మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
Khosta 2 Virus: కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే, ఆ జాతికే చెందిన మరో వైరస్ పుట్టినట్టు అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు.
Khosta 2 Virus: కరోనా వల్ల గత మూడేళ్లగా ప్రపంచ స్థితిగతులే మారాయి. ఆఫీసులు, స్కూళ్లు అన్నీ రెండేళ్ల పాటూ పూర్తిగా మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో మరో పిడుగులా వచ్చి మంకీపాక్స్. కానీ దీని వ్యాప్తి వేగం తక్కువగా ఉండడంతో పెద్దగా ప్రాణాలను పోలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ వైరస్‌ను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ‘ఖోస్టా 2’ అని పిలిచే ఈ వైరస్ ప్రస్తుతం గబ్బిలాలలో ఉంది. అది మనుషులకు సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు అమెరికా పరిశోధకులు. అందులోనూ ఇది కోవిడ్ లాంటి లక్షణాలను కలిగి ఉంది. ఖోస్టాగా పిలిచే ఈ వైరస్ అసలు పేరు ‘మెడక్లుసివ్ లెర్నింగ్’. ఇది కూడా సార్స్ కోవిడ్ 2 ఉప కేటగిరీ అని చెబుతున్నారు పరిశోధకులు. మానవ కణాలకు సులువుగా సోకుతుందని చెప్పారు. అంతేకాదు ఈ కరోనా టీకాను కూడా తట్టుకుని శరీరంలోకి ప్రవేశించే శక్తికలదట.
ఎప్పుడు కనుగొన్నారు?
వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన పాల్ జి అలెన్ స్కూల్ ఫర్ గ్లోబల్ హెల్త్‌లోని పరిశోధకుల బృందం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఖోస్టా-2లోని స్పైక్ ప్రోటీన్లు మానవ కణాలలోకి చొచ్చుకుపోతాయి. అదే సమయంలో కోవిడ్ టీకాను పొందిన వ్యక్తుల్లోని మోనోక్లోనల్ యాంటీబాడీస్, సీరం రెండింటి నిరోధకతను కలిగి ఉంటాయి. పరిశోధకులు మొదటిసారిగా 2020 చివరలో రష్యన్ గబ్బిలాలలో వైరస్‌ను కనుగొన్నారు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. వాటికి ఖోస్టా-1, ఖోస్టా-2 అని పేరు పెట్టారు. అయితే Khosta-1 మనుషుల ఆరోగ్యాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టదని చెబుతున్నారు, కానీ Khosta-2 మాత్రం అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుందని వివరించారు.
వీటితో జాగ్రత్త
సార్బెకో వైరస్ ప్రమాదకరమైనవి. ఇవి శ్వాసకోశ వ్యవస్థలపై దాడి చేస్తాయి. ఖోస్టా 2, కోవిడ్ రెండూ కూడా సార్బెకో వైరస్ జాతికి చెందినవే. ప్రస్తుతం ఖోస్టా 2 గబ్బిలాలు, ముళ్లపందులు, రకూన్లు వంటి అడవిజాతులకు సోకుతోంది. ఇది అంటువ్యాధి. కాబట్టి అడవి నుంచి మనుషులకు కూడా త్వరలో సోకే అవకాశం ఉంది. ఖోస్టా 2 వైరస్, కోవిడ్‌తో కలిస్తే మరింత ప్రమాదకరంగా మారవచ్చు అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ రెండు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి, ఎప్పుడైనా కలవచ్చని భావిస్తున్నారు పరిశోధకులు.
Also read: గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే రక్త పరీక్ష ఇది, 40 ఏళ్లు దాటితే చేయించుకోవడం
సార్బెకో వైరస్‌ల నుంచి మనుషులకు కాపాడే టీకాను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ వైద్యులు భావిస్తున్నారు. ఇంతవరకు ఉప కేటగిరీలు అయిన కరోనా వంటి వాటికి టీకాలు ఉన్నాయి కానీ, మూల కారణమైన సార్బెకో వైరస్‌ల నుంచి కాపాడే టీకాలు ఎవరూ తయారుచేయలేదు.
Also read: స్పెషల్ రెసిపీ గోల్కొండ చికెన్, ఓసారి తిని చూడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.