Best Saree Tips : సన్నగా, ఎత్తుగా కనిపించేందుకు ఏ చీరలు బెస్ట్? పొట్టిగా ఉండే అమ్మాయిలకు ఇవి మంచి ఎంపిక
Sarees to Look Slim and Tall : పొడవు తక్కువగా ఉన్న మహిళలు డ్రెస్సింగ్ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా చీరల ఎంపిక చాలా కష్టంగా ఉంటుంది. మరి వారు ఎలాంటి చీరలు ఎంచుకుంటే మంచిదో చూసేద్దాం.

Perfect Sarees for Short Women : ఎత్తు కాస్త తక్కువగా ఉండే అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు వారు మరీ పొట్టిగా కాకుండా కాస్త ఎత్తుగా కనిపిస్తారు. ముఖ్యంగా సరైన శారీలు ఎంచుకోకుంటే.. వారు మరీ పొట్టిగా కనిపిస్తారు. కాబట్టి అలాంటివారు.. జార్జెట్, షిఫాన్, తేలికపాటి సిల్క్ చీరలు ధరించాలి. అంతేకాకుండా పొట్టిగా ఉండే అమ్మాయిలకు సన్నని అంచులు, చిన్న డిజైన్‌లు, నిలువు చారలు కలిగిన చీరలు మంచి ఎంపికలు అవుతాయి. అలాగే చీరను ఎంచుకునేప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో చూసేద్దాం.
మహిళ అందం చీరలోనే బాగా ఎలివేట్ అవుతుంది. ఇది స్త్రీ ఆకృతిని మరింత మెరుగుపరిచే దుస్తులలో ఒకటిగా చెప్పవచ్చు. ట్రెడీషనల్ లుక్ నుంచి మోడ్రన్ లుక్ వరకు.. చీరల్లో దేన్ని అయినా హ్యాపీగా ట్రై చేయవచ్చు. కానీ ఎలాంటి చీరలు కట్టుకుంటున్నామనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు సరైనవి ఎంచుకోకుంటే లుక్ మొత్తం మారిపోతుంది. ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు చీరను జాగ్రత్తగా ఎంచుకోవాలి. లేదంటే వారు పూర్తిగా మునిగిపోయినట్లు లేదా లావుగా ఉన్నట్లు కనిపిస్తారు. పొట్టిగా ఉండేవారు కాస్త ఎత్తుగా, సన్నగా కనిపించేందుకు ఎలాంటి చీరలు ఎంచుకోవాలంటే..
తేలికపాటి సిల్క్ చీరలు
బనారసి సిల్క్, కాంజీవరం సిల్క్, ఆర్ట్ సిల్క్, అస్సాం సిల్క్ చీరలు మీ వార్డ్‌రోబ్‌కు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే హెవీ వెయిట్ సిల్క్ చీరలు ధరించడం వల్ల మీరు మరింత పొట్టిగా, లావుగా కనిపించవచ్చు. మరోవైపు ఆధునిక తేలికపాటి సిల్క్ చీరలు శరీరానికి అతుక్కుంటాయి. దీనివల్ల మీరు సన్నగా, పొడవుగా కనిపిస్తారు.
షిఫాన్ చీర
షిఫాన్ చీర మరొక తేలికపాటి అద్భుతమైన ఎంపిక. షిఫాన్ చీరలు శరీరానికి అతుక్కుంటాయి. దీని కారణంగా తక్కువ ఎత్తు ఉన్న మహిళలకు ఇది ఒక ఆదర్శవంతమైన ఎంపిక.
జార్జెట్ చీర
తక్కువ పొడవు ఉన్న మహిళలు హెవీ వెయిట్ కలిగి ఉంటే.. షిఫాన్ చీరలు అన్ని కష్టాలకు పరిష్కారం. జార్జెట్ చీరలు షిఫాన్ చీరల కంటే ఎక్కువ ఫిట్ అవుతాయి. ఇది మీ వంపులను హైలైట్ చేస్తుంది. సన్నగా కనిపించే భ్రమను కలిగిస్తుంది.
సన్నని అంచులు కలిగిన చీరలు
భారీ, వెడల్పు అంచులు కలిగిన చీరలు మీ ఎత్తును హైలైట్ చేస్తాయి. దీనివల్ల అలాంటి చీరలలో ఎత్తు తక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా, తక్కువ ఎత్తు ఉన్న మహిళలు వెడల్పు, భారీ అంచులు కలిగిన చీరలు ధరించకుండా ఉండాలి. మరోవైపు సన్నని, తేలికపాటి అంచులు కలిగిన చీరలు మిమ్మల్ని సన్నగా, పొడవుగా చూపిస్తాయి.
చిన్న ప్రింట్లు
పొట్టిగా ఉండే మహిళలు పెద్ద, దట్టమైన డిజైన్‌లను ఎంచుకోకూడదు. బదులుగా చిన్న ప్రింట్లు లేదా ప్లెయిన్ చీరలను ఎంచుకోవాలి. దీనివల్ల మీరు పొడవుగా కనిపిస్తారు.
ఈ తరహా చీరలు ఎంచుకోవడం వల్ల మీరు మరింత కాన్ఫిడెంట్గా ఉంటారు. భారీ అంచుల చీరల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా మీరు పొట్టిగా, లావుగా ఉన్నా.. చీరను సింగిల్ పల్లూ వేసుకోవాలని అనుకున్నా భారీ అంచులవి ఎంచుకోకూడదు. తేలికగా శరీరానికి అతుక్కునే షిఫాన్, సిల్క్ వంటి చీరలు మంచి ఎంపిక అవుతాయి.






















