Covid: ఖతర్నాక్ కరోనా - లంగ్స్ మాత్రమే కాదు, ఈ అవయవాలనూ చిద్రం చేస్తుందట!
కరోనాకి సంబంధించిన పరిశోధకులు వెలువరించిన తాజా అధ్యయనం అందరినీ భయపెడుతోంది. లంగ్స్ మాత్రమే కాకుండా ఇతర అవయవాలకూ ముప్పు తప్పదట.
కరోనా.. ఏముందిలే జ్వరం మాదిరిగా వచ్చి పోతుందని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. కానీ ఇది వింటే మాత్రం అది ఎంత ప్రమాదకరమైందో అర్థం అవుతుంది. కరోనా వైరస్ మైటోకాండ్రియా జన్యువులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తాజా పరిశోధనలో తేలింది. దీని వల్ల ఊపిరితిత్తులు మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలు పని చేయకుండా చేస్తుందని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది.
మానవ శరీర కణాల శక్తిని ఉత్పత్తి చేసేది మైటోకాండ్రియా. బీన్ లేదా ఒక్కోసారి గుండ్రం ఆకారంలో ఇది ఉంటుంది. మానవ శరీరంలోని ప్రతి కణంలో ఇది కనిపిస్తుంది. సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం మైటోకాండ్రియాను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన కణాల కేంద్రంలో ఉన్న డీఎన్ఏ, మైటోకాండ్రియనిలో ఉండే మైటోకాన్డ్రియల్ డీఎన్ఏ రెండింటిలోనూ ప్రతికూల వాతావరణం సృష్టిస్తున్నాయి. కరోనా మైటోకాండ్రియాని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి పరిశోధకులు కరోనా రోగులు, జంతు నమూనాల నుంచి నాసోపారింజియల్, అటాప్సీ కణజాలలని విశ్లేషించారు.
అటాప్సీ కణజాలం, మైటోకాన్డ్రియల్ జన్యువులు ఊపిరితిత్తులలో ఉన్నట్టు అధ్యయనం కనుగొంది. అయితే మైటోకాన్డ్రియల్ పనితీరుతో పాటు గుండె, మూత్రపిండాలు, కాలేయం కూడా దెబ్బతినడం పరిశోధకులు గుర్తించారు. ఇక జంతు నమూనాలు పరిశీలించినప్పుడు ఊపిరితిత్తులు, మెదడులో కరోనా వైరస్ ఏ మేరకు నష్టాన్ని చేసిందో పరిశీలించారు. చిన్న మెదడులో మైటోకాన్డ్రియల్ అణచివేతకు గురయ్యాయి. కాలక్రమేణా ఊపిరితిత్తుల్లోని మైటోకాన్డ్రియల్ పనితీరు పునరుద్ధరణ జరిగింది. కానీ ఇతర అవయవాలు, గుండెలో మాత్రం మైటోకాన్డ్రియల్ పనితీరు బలహీనంగా ఉంది.
కోవిడ్ ని శ్వాసకోశ వ్యాధిగా చూడటం మానేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్ శరీరంలోని బహుళ అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. మైటోకాన్డ్రియల్ సరిగా పని చేయకపోవడం వల్ల కరోనా బాధితుల అంతర్గత అవయవాలకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.
తాజా వేరియంట్ కలకలం
కరోనా తన రూపం మార్చుకుని మరో వేరియంట్ గా ప్రజల మీద దాడికి సిద్ధమయ్యింది. ఎరిస్ లేదా ఈజీ 5.1 కొత్త వేరియంట్ వివిధ దేశాలలో వేగంగా వ్యాపిస్తుంది. యూకే, యూఎస్ లో ఇప్పటికీ ఈ కొత్త కరోనా వేరియంట్ బారిన పడిన రోగులు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా భారత్ లోని మహారాష్ట్రలోనూ కేసులు బయట పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో కేసుల పెరుగుదల చోటుచేసుకుంటున్నాయి. అయితే గతంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ తో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉండటం కాస్త సంతోషించదగిన అంశం.
పాత వేరియంట్లలో కనిపించే లక్షణాలే ఎరిస్ వేరియంట్ సోకిన వారిలోనూ కనిపిస్తున్నాయి. తలనొప్పి, జ్వరం, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అలాగే స్వీయ సంరక్షణ అన్నింటికంటే ముఖ్యమైన విషయం. బయటకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి? ఇవి గుండెకు చేసే నష్టాలేమిటీ? ఏ ఆహారంతో వాటిని అడ్డుకోవచ్చు?