(Source: ECI/ABP News/ABP Majha)
Fashion Jwellery: పుత్తడి కాదు, ఇప్పుడు ఫ్యాషన్ జువెలరీదే ట్రెండ్
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన బంగారం వినియోగం వల్ల బంగారం ధర చుక్కలను అంటుతోంది. అందువల్ల నగలు కొనడం కంటే సామాన్య ప్రజలు బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకే మక్కువ చూపుతున్నారు
అలంకారం ఇష్టం లేని మహిళలు ఉండనే ఉండరేమో. మరీ ముఖ్యంగా నగలు, చీరలు. అమ్మవారి నుంచి అప్పలమ్మ వరకు అందరికీ ఇష్టమే. నగలనగానే బంగారు నగలకున్న విలువ మరి దేనికీ ఉండదు. బంగారు నగలంటే మోజులేని స్త్రీలు ఉండనే ఉండరు. కానీ నగల రూపంలో కొనే బంగారం మీద తరుగు ఇతర తెలియని అదనపు చార్జీల గొడవ లేకుండా బంగారాన్ని బంగారం లాగే కొని పెట్టుబడిగా దాచుకునే వారి సంఖ్య పెరిగింది. ఇలాంటి ఈ సినారియోలో మరి ఆడవాళ్ల నగల మోజు సంగతేమిటి అంటారా? శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని సామెత. అలా బంగారు నగలకు ప్రత్యామ్నాయ ఫ్యాషన్ జువెలరీ మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది.
ఖర్చు, ధరలు అనే విషయాలు పక్కన పెడితే ఎప్పటికప్పుడు కొత్తకొత్త డిజైన్లు, మ్యాచింగ్ కు అనువైన నగలు, అన్ని రకాల డ్రెస్సింగ్ స్టయిల్స్ కి నప్పే మోడల్స్ తో మోడరన్ జువెలరీ మగువల మనసు దోచుకుంటోంది. అదీ కాకుండా బంగారు నగలు తరచుగా మార్చుకోవాలంటే చాలా ఖర్చు కూడా. అందుకే రకరకాల ఫ్యాషన్ జువెలరీ మీద మోజులో ఉంది యువతరం. ఈ రోజుల్లో నగలు కేవలం పురుషులకు మాత్రమే కాదు పురుషులు కూడా విరివిగా ధరిస్తున్నారు. కనుక ఫ్యాషన్ జువెలరీ ఇండస్ట్రీ చాలా వినూత్నంగా మార్కెట్ లో దూసుకుపోతోందని చెప్పుకోవచ్చు. మరి బంగారానికి ప్రత్యమ్నాయంగా కనిపిస్తున్న వెరైటీ జువెలరీ గురించి తెలుసుకుందాం.
కలర్ ఫుల్ టెర్రకోటా
టెర్రకోటా మట్టితో ఆభరణాలు తయారు చేస్తారు. మట్టితో చేసే నగలు ఏం బావుంటాయని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అద్భుతమైన రంగులతో చాలా ఆకర్శణీయంగా కనిపించే నగలు మంచి చేతి పనితో తయారవుతున్నాయి ఈ రోజుల్లో. అది మట్టితో చేసిన నగ అని చెబితే నమ్మలేనంత అందమైన జువెలరీ అందుబాటులోఉంది మార్కెట్ లో. చెవి దుద్దుల నుంచి హారాలు, వడ్డాణాల వరకు అన్ని రకాల నగలు మట్టితో చేస్తున్నారు. ధర కూడా చాలా మందికి అందుబాటులో ఉండే విధంగానే ఉంటాయి. ఆన్లైన్ మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి ఇవి. ఫేస్బుక్, ఇన్స్టా పేజీల ద్వారా వీటిని తయారు చేసి అమ్మేవారు అందుబాటులో ఉన్నారు. మట్టివి కనుక మన్నిక తక్కవ అనుకునే పనిలేదు. కింద పడకుండా చూసుకుంటే మెరుపు తగ్గే వరకు వాడుకోవచ్చు.
బంగారాన్ని మరిపించే సిల్వర్ జువెలరీ
వెండి నగలు చూడగానే వెండివే లే అనుకుంటే పొరబడ్డట్టే. బంగారు నగలకు ఏమాత్రం తీసిపోని నగలివి. ఈ నగల్లో చాలా వాటికి బంగారు పూత ఉంటుంది లేదా బంగారంతో ప్లేటింగ్ చేస్తారు. ఈ రోజుల్లో భారీ టెంపుల్ జువెలరీ అంతా కూడా ఈ రకమైందే ఎక్కువగా వాడుతున్నారు. చాలా తక్కువ ధరలోనే పెద్దపెద్ద నగలు కొనుక్కోవచ్చు. బంగారం వంటి నగలే వేసుకోవాలనుకునే వారికి ఇదొక చవకైన మంచి ప్రత్యామ్నాయం. కేవలం వెండి జువెలరీ అమ్మే దుకాణాలు చాలానే ఉన్నాయి మార్కెట్లో. ఆన్లైన్ కూడా చాలా వెబ్సైట్లు రకరకాల డిజైన్లలో ఎన్నో నగలను అందుబాటులోకి తెచ్చాయి. బంగారు నగలు అమ్మే షాపుల్లో సైతం వీటిని విక్రయిస్తున్నారంటే వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
సిల్క్ జువెలరీ
ఇవి చాలా రోజుల నుంచే అందుబాటులో ఉన్నాయి. వీటినే త్రెడ్ జువెలరీ అని కూడా అంటారు. డ్రెస్ రంగుకు పూర్తి మ్యాచ్ అయ్యే విధంగా గాజులు, చెవిపోగులు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. పెళ్లి చీరలో ఉన్న అన్ని రంగుల్లో త్రెడ్ గాజులు చేయించుకోవచ్చు. ఇవి ఎంత ఫ్యాన్సీ గా కావాలంటే అంత ఫ్యాన్సీ గా కస్టమైజ్ చేయించుకోగలిగే చవకైన డిజైనర్ నగలుగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా బ్లాక్ మెటల్, జర్మన్ సిల్వర్ ఇలా రకరకాల మెటల్స్ తో తయారైన జువెలరీ కూడా మార్కెట్ లో ట్రెండ్ అవుతోంది. యువత ఆదరణ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇలాంటి నగలకు. ఈ సారి నగల షాపింగ్ ఈరకంగా చేసుకోవచ్చేమో చూడండి.
Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ