Vegetable Fried Rice Recipe : వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్.. సింపుల్‌గా లంచ్‌బాక్స్ కోసం ఇలా తయారుచేసుకోండి
Easy Lunch Recipes : ఆరోగ్యానికి మేలు చేస్తూ.. మంచి రుచిని అందించే టేస్టీ లంచ్ కోసం ఎదురు చూస్తుంటే మీరు వెజిటెబుల్ రైస్‌ని ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక.
Vegetable Fried Rice for Lunch Box : మీకు అన్నం తినాలని లేకపోయినా.. లేదంటే అన్నం మిగిలిపోయినా.. టేస్టీగా ఏదైనా చేసుకోవాలనుకుంటే మీరు వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఇది మీకు మంచి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. లంచ్ బాక్స్ కోసం కూడా మీరు ఈ రెసిపీని ఆశ్రయించవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
వెలుల్లి - 1 టేబుల్ స్పూన్ (తురుము)
నూనె - 2 టేబుల్ స్పూన్స్
సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
వెనిగర్ - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - అర టీస్పూన్
క్యారెట్స్ - పావు కప్పు
క్యాప్సికమ్ - పావు కప్పు
బీన్స్ - పావు కప్పు
గ్రీన్ ఆనియన్స్ - పావు కప్పు
క్యాబేజీ - పావు కప్పు
పచ్చిమిర్చి - 2
తయారీ విధానం
క్యారెట్స్, క్యాప్సికమ్స్, బీన్స్‌ను సన్నగా కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్‌ను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ పూర్తిగా ఆప్షనల్. ఎందుకంటే కొందరికి ఇది నచ్చదు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే దానిని పూర్తిగా శుభ్రం చేసి.. చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని కడిగి అన్నం వండుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ వండుకోవాలనుకుంటే కచ్చితంగా వాటిని అరగంట ముందు నానబెట్టి తర్వాత వండుకోవాలి. ఏ రైస్ తీసుకున్నా అన్నం పొడిపొడిలాడుతూ ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు ఓ కడాయి తీసుకుని.. దానిని స్టౌవ్‌పై వెలిగించండి. దానిలో నూనె వేసి.. వేడి అయిన తర్వాత వెల్లుల్లి తురుము వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత.. ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. అవి సగం ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు అవి కాస్త క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వాటిలో సోయాసాస్ వేసి బాగా కలపాలి.
కూరగాయలు ఉడుకుతున్న సమయంలో వెనిగర్, అరటీస్పూన్ పంచదార వేయాలి. పంచదార వేస్తే రుచి బ్యాలెన్స్ అవుతుంది. మిరియాల పొడి, పచ్చిమిర్చి కూడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు దానిలో అన్నాన్ని వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి. రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే టేస్టీ టేస్టీ వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు.
అంతేకాకుండా ఈ వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో మనం ఉపయోగించే కూరగాయలు హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. పైగా లంచ్ బాక్స్‌కి ఇవి క్రేజీ కాంబినేషన్. నేరుగా దీనిని తినేయొచ్చు. లేదంటే రైతాతో, ఆవకాయతో కూడా ఇది మీకు మంచి రుచిని అందిస్తుంది. మరి ఇంకెందుకు ఈ రైనీ వెదర్లో హాయిగా వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తినేయండి.
Also Read : టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం.. లంచ్ బాక్స్ కోసం సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసేసుకోండి