(Source: ECI/ABP News/ABP Majha)
Coconut Rice Recipe : టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం.. లంచ్ బాక్స్ కోసం సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసేసుకోండి
Simple Lunch Recipes : లంచ్ కోసం ఏమి ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంట్లో టేస్టీగా చేసుకోగలిగే కొబ్బరి అన్నాన్ని ట్రై చేయండి. ఇది లంచ్‌కి పర్ఫెక్ట్.
Coconut Rice Recipe for Lunch Box : స్కూల్‌కి వెళ్లేవారికి ఫుడ్ ఏమి చేయాలా అని.. ఆఫీస్‌కు వెళ్లేప్పుడు లంచ్‌కి ఏమి ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కొబ్బరి అన్నం మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. సింపుల్‌గా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీ మీకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. కొబ్బరిలోని సుగుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరి ఇంకేమి ఆలస్యం. ఈ కొబ్బరి అన్నాన్ని మీరు తయారు చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - కప్పు
నీళ్లు - 2 కప్పులు
కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు
ఉప్పు - రుచికి తగినంత
పచ్చిమిర్చి - 2
ఎండు మిర్చి - 2
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - అర టేబుల్ స్పూన్
అల్లం తురుము - 1 టీస్పూన్
జీడిపప్పు - 15
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని బాగా కడగాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్‌ని ఉపయోగిస్తుంటే.. దానిని ఓ అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో తగినన్ని నీరు వేసి.. అన్నాన్ని ఉడికించుకోవాలి. మెత్తగా కాకుండా.. కాస్త పొడిపొడిలాడుతూ రైస్ ఉంటే.. రెసిపీ బాగా వస్తుంది. ఇలా వండిన అన్నాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకోవాలి. అల్లం తురిమాలి. కొబ్బరి ఫ్రెష్ది అయితే రుచి మరింత బాగుంటుంది. దానిని కూడా తురిమి సిద్ధం చేసుకోవాలి.
ముందుగా స్టౌవ్ వెలిగించి.. దానిపై కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేసుకుని వేడి చేయాలి. నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ నెయ్యితో రుచి కాస్త ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వాటిలో జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పులు గోల్డెన్ కలర్ వరకు వచ్చేలా మంచిగా వేయించుకోవాలి.
తాళింపులోని పప్పులు ఎంత బాగా ఫ్రై అయితే.. కొబ్బరి అన్నం రుచి అంత బాగుంటుంది. ఇలా సిద్ధం చేసుకున్న తాళింపులో అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత దానిలో ఇంగువ వేయాలి. ఇప్పుడు దానిలో కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. దానిని కాస్త వేపిన తర్వాత.. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొబ్బరిని బాగా మిక్స్ చేసి దానిలో వండిన అన్నం వేసి.. బాగా కలపాలి.
టేస్ట్ చెక్ చేసుకుని.. ఉప్పును అడ్జెస్ట్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి రైస్ రెడీ. దీనిని మీరు కర్రీతో తినొచ్చు. లేదంటే పెరుగు పచ్చడి చేసుకుని కూడా హాయిగా ఆస్వాదించవచ్చు. కొబ్బరిని మీ రుచికి తగినంత కూడా తీసుకుని సేమ్ పద్ధతిలో కొబ్బరి రైస్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే చివర్లో నిమ్మరసం కూడా కలిపి నేరుగా లాగించేయవచ్చు. ఇది కొబ్బరి రైస్ రుచిని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుంది.
Also Read : టేస్టీ టేస్టీ బర్ఫీ.. ఇంట్లోనే తేలికగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ ఇది