Mysore Bonda Recipe : టేస్టీ మైసూర్ బోండా రెసిపీ.. ఈ టిప్స్‌తో పిండి ముద్దలుగా రాదు, నూనె ఎక్కువ పీల్చదు
South Indian Breakfast : మైసూర్ బోండాను చాలామంది ఇష్టంగా తింటారు కానీ.. ఆయిల్ ఎక్కువ ఉంది.. లోపల సరిగ్గా ఉడకలేదనే కారణాలతో వాటి దూరంగా ఉంటారు. కానీ ఈ టిప్స్‌తో టేస్టీ బోండాలు తయారు చేయవచ్చు.
Bonda Recipe with Less Oil : రోజూ ఆయిల్ ఫుడ్ తినడం మంచిది కాదు. కానీ.. అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేసుకుని తింటే క్రేవింగ్స్ తగ్గుతాయి. అలాంటి టేస్టీ ఆయిల్ ఫుడ్‌లో మైసూర్ బోండా కూడా ఒకటి. అయితే నూనెను ఎక్కువ పీల్చకుండా.. పిండి పూర్తిగా ఉడికేలా ఇంట్లోనే సింపుల్‌గా మైసూర్ బోండాలను తయారు చేయవచ్చు. కొన్ని సింపుల్ టిప్స్‌తో ఈ రెసిపీని అతి తక్కువ సమయంలో ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పెరుగు - 1 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
వంటసోడా - అర టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
మైదా పిండి - 1 కప్పు
వేడి నీళ్లు - తగినన్నీ
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
అల్లం - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 3
నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత
తయారీ విధానం
ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో పెరుగు వేసి ఓ 5 నిమిషాలు కలపాలి. ఇలా చేయడం వల్ల పెరుగు ముద్దలుగా కాకుండా.. మెత్తగా క్రీమ్ మాదిరిగా వస్తుంది. ఇలా చేసుకుంటే పెరుగు పిండిలో బాగా కలుస్తుంది. ఇప్పుడు దానిలో రుచికి తగినంత సాల్ట్, వంటసోడా, ఓ టీస్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి పెరుగులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగులో కాస్త బబుల్స్ వస్తాయి. ప్లఫ్ఫీగా మారుతుంది. ఇప్పుడు దానిలో మైదా పిండిని వేయాలి.
మైదా పిండిని పెరుగులో కలిసేలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేడి నీళ్లు తీసుకుని.. దానిలో కొద్ది కొద్దిగా పోస్తూ.. పిండిని మిక్స్ చేయాలి. పిండిని కలిపేందుకు వేడినీటిని ఉపయోగిస్తే త్వరగా పులిసి.. మైసూర్ బోండాలు రుచిగా వస్తాయి. ఉండలు లేకుండా.. పిండిని మందంగా సాగేలా కలుపుకోవాలి. నీటిని కొద్ది కొద్దిగా వేయడం వల్ల ఎక్కువ నీరు పట్టదు. ఎక్కువ నీటిని ఉపయోగించకపోతే నూనె ఎక్కువ పీల్చుకోదు. కాబట్టి ఈ మిక్సింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉండాలి.
మైసూర్ బోండా తినేప్పుడు అతి పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే.. బోండా టేస్ట్‌గానే ఉంటుంది కానీ మధ్యలో పిండిగా ఉండిపోతుంది. అలా ఉండకూడదంటే పిండిని ఓ పది నిమిషాలు పిండిని పై నుంచి కిందకి వేస్తూ.. కలుపుతూ ఉండాలి. పిండి మధ్యలో గాలి చేరి.. అది పిండిని బాగా ఉడికేలా చేస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో జీలకర్ర, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము వేసి మరోసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని అరగంట నుంచి గంటవరకు పక్కన పెట్టేయాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయిని ఉంచి.. డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేయాలి. నూనె కాగిన తర్వాత మంటను కాస్త మీడియంలో ఉంచాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌ని తీసుకుని పిండిని కదపకుండా.. చేతికి కాస్త నీటిని అద్ది.. చివర నుంచి పిండిని తీస్తూ.. బోండాలుగా వేసుకోవాలి. ముందు కాస్త వేగిన తర్వాత.. మంటను కాస్త ఎక్కువ చేసి.. అన్నివైపులా బోండా వేగేలా చూసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మైసూర్ బోండాలు రెడీ. వీటిని బయటకు తీసి.. నచ్చిన చట్నీతో లాగించేయడమే.
Also Read : వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్.. సింపుల్‌గా లంచ్‌బాక్స్ కోసం ఇలా తయారుచేసుకోండి