Boondi Laddu Recipe : బూందీ లడ్డూలను ఇలా చుట్టేయండి.. ఈ టిప్స్ ఫాలో అయితే వారంపైగా నిల్వ ఉంటాయి
Authentic Boondi Laddu : ఈ మధ్యకాలంలో బూందీ లడ్డూలు బయట ఎక్కువగా దొరకట్లేదు. వీటి రుచిని ఆస్వాదించేందుకు షాప్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం.
![Boondi Laddu Recipe : బూందీ లడ్డూలను ఇలా చుట్టేయండి.. ఈ టిప్స్ ఫాలో అయితే వారంపైగా నిల్వ ఉంటాయి tasty and authentic Boondi Laddu recipe in telugu here is the making process and tips Boondi Laddu Recipe : బూందీ లడ్డూలను ఇలా చుట్టేయండి.. ఈ టిప్స్ ఫాలో అయితే వారంపైగా నిల్వ ఉంటాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/24/711bdb70be41737321b3f088ea24abd91721787934293874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Boondi Laddu Recipe in Telugu : లడ్డూ అంటే బూందీ లడ్డూనే. దాని తర్వాత ఎన్ని రకాలు వచ్చినా.. బూందీ లడ్డూ క్రేజ్ సపరేట్ అనే చెప్పవచ్చు. అయితే దీనిని బయట షాప్లలో కాకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. గతంలోని ఫ్లేవర్ రావాలంటే ఇంట్లోనే చేసుకోవాలి. ఎందుకంటే బయట వివిధ ఫ్లేవర్లతో లడ్డూకి ఉన్న అసలు ఫ్లేవర్ పోతుంది. మీరు లడ్డూ రియల్ ఫ్లేవర్ తినాలి అనుకుంటే బూందీ లడ్డూని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్వీట్ తినాలనుకున్నప్పుడు, పండుగల సమయంలో కూడా వీటిని తయారు చేయవచ్చు. దీనిని తయారు చేయడం కష్టం అనుకుంటున్నారేమో. చాలా సులువుగా, వివిధ టిప్స్ ఫాలో అవుతూ ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
శనగపిండి - 1 కిలో
నీరు - అవసరానికి తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
పాకం కోసం..
పంచదార - రెండు కప్పులు
నీరు - రెండు కప్పుల పంచదారకు ముప్పావు కప్పు
జీడిపప్పు - 20
ఎండుద్రాక్ష - 10
పటికబెల్లం - చిటికెడు
యాలకుల పొడి - 1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా శనగపిండిని జల్లెడ పట్టాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో పిండిని వేయాలి. దానిలో నీటిని వేయండి. పిండి దోశ పిండి కంటే పలుచగా ఉండాలి. అలా అని మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదు. పిండిని జల్లించడం వల్ల ఉండలు ఎక్కువగా రావు. అయినా సరే పిండిని రెండు, మూడు నిమిషాలు పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిని ఓ ఐదు నిమిషాలు పక్కన పెట్టి.. మరోసారి దానిని కలపాలి. దీనివల్ల బూందీ బాగా వస్తుంది.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై కడాయిని పెట్టండి. దానిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత.. బూందీ జల్లెడ తీసుకోవాలి. దానిలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. పిండిని సరిగ్గా వేసుకుంటే.. బూందీకి తోకలు రాకుండా ఉంటాయి. ఇలా వేసుకున్న బూందీని మంచిగా వేయించుకోవాలి. అలా అనీ గోల్డెన్ కలర్ వచ్చేవరకు కాకుండా.. రంగు మారే సమయంలో వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బూందీ కరకరలాడితే లడ్డూలకు బాగోవు. కాస్త మెత్తగా ఉంటేనే లడ్డూ మంచిగా వస్తాయి.
బూందీ సిద్ధం అయిన తర్వాత.. స్టౌవ్ వెలిగించి.. మరో పాన్ పెట్టుకోవాలి. దానిలో పంచదార వేయాలి. అనంతరం నీరు పోసి బాగా కలపాలి. దానిలో కాస్త పటిక బెల్లం వేసి.. పంచదార పూర్తిగా కరగనివ్వాలి. తీగపాకం వచ్చే వరకు పంచదారను స్టౌవ్ మీదనే ఉంచాలి. ఇప్పుడు దానిలో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అనంతరం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని వేసి కలపాలి. దానిని ఓ అరగంట పక్కన పెట్టేయండి. అప్పుడు పాకం.. బూందీకి బాగా పడుతుంది.
నూనెలో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగితే సరిపోతుంది. బూందీ.. పాకం కలిసిన తర్వాత దానిలో ఓ రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయండి. అనంతరం చేతులకు నెయ్యి రాసుకుని.. బూందీని లడ్డూలుగా చేసుకోవాలి. ఓ గంట పక్కన పెడితే.. అవి తినేందుకు సిద్ధంగా ఉండడంతో పాటు.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వారంపైగా వీటిని నిల్వ చేయవచ్చు.
Also Read : పిల్లలకు నచ్చే కప్ కేక్స్ను ఇలా చేసేయండి.. ఎముకలకు చాలా మంచిది, ఎదుగుదల బాగుంటుంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)