Telugu Recipes: కొబ్బరి వడలు - పిల్లలకు బెస్ట్ చిరుతిండి
పిల్లలకు ఆరోగ్యకరమైన చిరుతిండ్లు వండాలనుకుంటున్నారా అయితే కొబ్బరి వడలు ప్రయత్నించండి.
తెలుగువారి సంప్రదాయమైన వంటల్లో కొబ్బరి వడలు కూడా ఒకటి. బియ్యం, కొబ్బరితో మాత్రమే చేసే ఈ వడల తయారీ కూడా సులువే. పూరీల్లా పొంగే వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ పిల్లలు అడిగేలా ఉంటాయివి.
కావాల్సిన పదార్థాలు
కొబ్బరి కోరు – అర కప్పు
బియ్యం - ఒక కప్పు
బియ్యంప్పిండి - పావు కప్పు
జీలకర్ర - ఒక టీస్పూను
ఉప్పు – తగినంత
నూనె – సరిపడినంత
తయారీ ఇలా
1. బియ్యాన్ని నాలుగైదు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
2. తరువాత మిక్సీలో నానబెట్టిన బియ్యం, జీలకర్ర వేసి ఒకసారి రుబ్బాలి.
3. ఆ రుబ్బులోనే కొబ్బరి కోరు, ఉప్పు కూడా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
4. నీళ్లు అధికంగా వేయకూడదు. కాస్త మందంగానే రుబ్బుకోవాలి.
5. ఈ రుబ్బును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో బియ్యంప్పిండి వేసి కలుపుకోవాలి. అప్పుడు పిండి మరింత గట్టిగా తయారవుతుంది.
6. పిండి బూరెల సైజులో చేత్తో గుండ్రంగా చుట్టాలి.
7. ఒక అరిటాకు లేదా, పాలిధిన్ కవర్ పై చేత్తోనే వడల్లా ఒత్తుకోవాలి.
8. మరో పక్క కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
9. నూనె వేడెక్కాక చేత్తో ఒత్తుకున్న వడలను అందులో వేసి వేయించాలి.
10. అవి పూరీల్లా పొంగుతాయి. రుచి కూడా బావుంటుంది.
11. కొంతమంది వీటిలో పంచదార కలుపుకుంటారు.
కొబ్బరిలో మన శరీరానికి అవసరమై పోషకాలు ఎన్నో ఉన్నాయి. రోజుకో కొబ్బరి ముక్క తినడం అలవాటు చేసుకోవాలి. గర్భం ధరించాక కూడా దీన్ని తినడం మంచిదే. కొబ్బరి తినడం వల్ల కొలెస్ట్రాల్ శరీరంలో చేరదు. దీన్ని తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనే అపోహ ఉంది కానీ, అది నిజం కాదని చెబుతున్నారు వైద్యులు. కొబ్బరికి, గుండె జబ్బులకు సంబంధమే లేదు అని చెబుతున్నారు. కొబ్బరి తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి కొబ్బరి మంచి ఆప్షన్. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికారక వైరస్‌ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. విటమిన్ ఎ, బి, సితో పాటూ ఇనుము, కాల్షియం కూడా ఇందులో ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి కూడా ఇవి చాలా అవసరం. మతిమరుపు వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి కొబ్బరిలోని పోషకాలు. రోజుకో చిన్న ముక్క కొబ్బరి తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పచ్చి కొబ్బరి లేదా, కొబ్బరితో వండిన వంటకాలు తినడం వల్ల శరీరం నీరు కోల్పోకుండా ఉంటుంది. శరీరం తేమ వంతంగా ఉండడం చాలా అవసరం. డీహైడ్రేషన్ సమస్య వస్తే శరీరం పట్టుతప్పుతుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే కొబ్బరి ముక్క రోజూ తినాలి.
Also read: డయాబెటిస్ ఉంటే మందులు వాడాల్సిందేనా? వాడకుండా అదుపులో ఉంచలేమా?