Kaju Pulao Recipe : టేస్టీ కాజు పులావ్‌ను ఇంత సింపుల్‌గా చేసేయొచ్చా? బాస్మతి రైస్ అయితే ఇలా.. సోనా మసూరి అయితే అలా
Lunch box recipes : పిల్లల నుంచి పెద్దల వరకు.. లంచ్ కోసం ఈజీగా చేసుకోగలిగే కాజు పులావ్ రెసిపీ ఇక్కడుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే టేస్టీగా చేసేయొచ్చు.
Easy Indian rice recipes for lunch : మీకు మధ్యాహ్నం లంచ్ తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం లేనప్పుడు మీరు టేస్టీ టేస్టీ కాజు పులావ్‌ను లంచ్‌కోసం కుక్ చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ముఖ్యంగా కుక్కర్లో చేస్తాము కాబట్టి.. మీరు తక్కువ సమయంలో టేస్టీ ఫుడ్‌ని ఆస్వాదించవచ్చు. మరి ఈ టేస్టీ పులావ్‌ను తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? రెసిపీ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 1 కప్పు
లవంగాలు - 5
యాలకులు - 5
దాల్చిన చెక్క - అంగుళం
షాజీరా - 1 టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకులు - 2
ఉల్లిపాయ ముక్కలు - 1 పెద్దది
పచ్చిమిర్చి - 2
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 75 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1టేబుల్ స్పూన్
పుదీనా ఆకుల తురుము - 2 టీస్పూన్లు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడేంత
పసుపు - చిటికెడు
గులాబీ రేకులు - 1 టేబుల్ స్పూన్ (ఎండినవి)
తయారీ విధానం
ముందుగా బాస్మతి రైస్‌ను ఓ గంట నానబెట్టుకోవాలి. అనంతరం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను కావాల్సిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కుక్కర్ ఉంచండి. దానిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. అనంతరం దానిలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను దానిలో వేసి కలపాలి.
ఉల్లిపాయలు కాస్త బంగారు రంగు వచ్చేవరకు వేయించి.. దానిలో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగితే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. జీడిపప్పు నోటికి తగిలిన ప్రతిసారి మీరు దాని రుచిని ఆస్వాదిస్తారు. ఇప్పుడు దానిలో పుదీనా ఆకుల తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయే వరకు వేయించి.. దానిలో ఉప్పు, పసుపు వేసి మరికొంత వేయించాలి.
ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే.. దానికి ఒక కప్పు నీటిని తీసుకోవాలి. సోనా మసూరి రైస్ తీసుకుంటే మాత్రం వాటిని మరో గంట ఎక్కువ నానబెట్టుకోవాలి. నీటిని కూడా 1 కప్పునకు.. అరకప్పునకు ముప్పావు కప్పు చొప్పున రెండు కప్పులు వేయాలి. ఇలా సిద్ధం చేసుకుని.. బియ్యాన్ని, నీటిని కుక్కర్లో వేయాలి. ఇప్పుడు దానిలో మీ దగ్గర ఎండిన గులాబీ రేకులు ఉంటే వేయొచ్చు. ఇది పులావ్‌కు మంచి రుచిని ఇస్తుంది. గులాబీ రేకులు వేసిన తర్వాత.. కుక్కర్‌ను మూతపెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉంచితే సరిపోతుంది. సోనా మసూరి అయితే 2 విజిల్స్ రావాలి.
వెంటనే స్టౌవ్ ఆపి.. ప్రెజర్ పోయేంత వరకు కుక్కర్ మూతను అలాగే ఉంచాలి. మీ దగ్గర గులాబీ రేకులు లేక వేయకపోతే.. కుక్కర్ దించిన తర్వాత.. దానిలో రోజ్ వాటర్ ఒక స్పూన్ వేసి.. బాగా కలపాలి. కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేయాలి. లేదంటే రోజ్ వాటర్ కలిపే సమయంలో రైస్ మెత్తగా అయిపోతుంది. ఇలా కలిపిస్తే.. వేడి వేడి కాజు పులావ్ రెడీ. దీనిని మీరు పనీర్, చికెన్, మటన్‌కు మంచి కాంబినేషన్‌గా తీసుకోవచ్చు. లేదంటే రైతాతో తీసుకున్న మంచి రుచి ఉంటుంది. మీరు వేడిగా తింటే నేరుగా.. ఎలాంటి సైడ్ కర్రీ లేకుండా తినేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసేయండి.
Also Read : బూందీ లడ్డూలను ఇలా చుట్టేయండి.. ఈ టిప్స్ ఫాలో అయితే వారంపైగా నిల్వ ఉంటాయి