రొటీన్ ‘టీ’లు తాగి బోరు కొట్టిందా? ఈ ఛాయ్‌లు కూడా ట్రై చెయ్యండి
రోజూ తాగే ఈ ఛాయ్ ని ఎప్పుడూ ఒకే రకంగా చేస్తే ఏం బాగుంటుంది? మన మూడ్ ని బట్టి, రకరకాల పదార్థాలను కలిపి తయారుచేసుకుంటే నాలుకకు, మనసుకూ కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది.
'ఛాయ్' మన దేశంలో ఒక పానీయం మాత్రమే కాదు. అదొక కల్చర్.. అదొక ఎమోషన్. పొద్దున లేవగానే ఛాయ్ కడుపులో పడకపోతే అసలు తెల్లారినట్లు కాదు. రోజూ తాగే ఈ ఛాయ్‌ను ఎప్పుడూ ఒకే రకంగా చేస్తే ఏం బాగుంటుంది? మన మూడ్ ని బట్టి, రకరకాల పదార్థాలను కలిపి తయారుచేసుకుంటే నాలుకకు, మనసుకూ కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది. సాధారణంగా మనకు యాలకులు, అల్లం, మిరియాలు, బిర్యానీ ఆకు.. ఛాయ్ అని చెప్పి బిర్యానీకి పదార్థాలు చెప్తున్నామనుకుంటున్నారా? ఆ చివరి బిర్యానీ ఆకు తప్ప, మిగిలిన అన్ని వంట సామాన్లతో ఛాయ్ లు కొత్త కొత్తగా తయారు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, కొన్ని తరాల నుంచి ఉన్న మన ట్రెడిషనల్ టీల రకాలు.. అవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే, రోజూ ఛాయ్ టైం కోసం ఎదురుచూస్తారంటే నమ్మండి!
1. మసాలా ఛాయ్
చూడగానే రుచి నాలుక మీద తచ్చాడింది కదా..మరి నిజంగా తాగితే స్వర్గం అంచుల్లో అలా అలా తిరిగి రావొచ్చు. ఛాయ్ ప్రియులకు ఈ మాటలేమీ అతిశయోక్తి కాదు. మరి మసాలా ఛాయ్ తయారుచేయటం ఎలాగంటే..మరుగుతున్న నీటిలో టీ పొడి(అస్సాం లేదా డార్జిలింగ్ టీ ఆకులైతే మరీ రుచి) వేసి, అందులో ఒక అల్లం ముక్క, చిటికెడు యాలకుల పొడి, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి 5 నిమిషాలు మరగనిచ్చి వేడి పాలు పోసి ఇంకాసేపు ఉడకనివ్వాలి. కాస్త చక్కెర తగిలించి, వేడిగా తాగితే భలే బాగుంటుంది.
2. కాశ్మీరీ కహ్వా
మన వైపు పెద్దగా అలవాటు లేకపోవటం వల్ల ఈ పేరు వింటే అదేదో బ్రహ్మపదార్థం అనిపిస్తుంది. కానీ, ఎలా చేయాలో తెలుసుంటే ఇంత సింపులా అనుకుంటారు. మరుగుతున్న నీటిలో టీ పొడి( గ్రీన్ టీ ఆకులు అయితే ఈ 'టీ' కి న్యాయం చేసినవారవుతారు), రెండు రెబ్బలు కుంకుమపువ్వు వేయాలి (తెల్లారికల్లా నిగనిగలాడే అందం కూడా మీ సొంతమవుతుంది). బాగా మరగనిచ్చి, అపుడు పొడి చేసిన యాలకులు, దాల్చిన చెక్క, బాదం వేయాలి. ఉడికిన తర్వాత వేడి పాలు పోసి, కాస్త తేనె తో సర్వ్ చేసుకుంటే మైమరిచిపొయే కొత్త రుచి.
3. ఆయుర్వేద టీ
ఇదొక కషాయంలాంటి టీ. రుచికి ఢోకా ఉండదు. భయపడకండి. ఈ ఛాయ్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్. జ్వరాలు, జలుబులు ఇట్టే మాయమవుతాయి. ఎలా చేయాలంటే.. మరుగుతున్న నీటిలో జీలకర్ర, ధనియాలు, సోంపు, అల్లం, తులసి ఆకులు వేసి ఉడకనివ్వాలి. తీయటి రుచి కోసం కాస్త బెల్లం వేసుకొని వేడి వేడిగా తాగేయాలి.
4. పుదీనా టీ
నేచర్ లో దొరికే ఈ ఆకులు అలములే మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతాయి. పుదీనే కదా అని కర్వేపాకులా తీసేయకూడదు. పుదీనా టీ..అలర్జీలను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. మరి ఈ టీ ఎలా చేయాలంటే, మరుగుతున్న నీళ్లలో మరేం వేయకుండా ఒక పుదీనా ఆకులు మాత్రమే వేయాలి. కాసిన్ని వేడి పాలు పోసి ఉడకనిచ్చి, రుచికి కొంచెం చక్కెర వేసుకొని తాగేయటమే!
Read Also: శివశక్తిగా తమన్నా- ‘ఓదెల 2’ నుంచి స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్!