Mutton Pulao in Pressure Cooker : బోనాల స్పెషల్ మటన్ పులావ్.. టేస్టీగా, ఈజీగా చేసుకునేందుకు ఈ రెసిపీ ఫాలో అయిపోండి
Bonalu Recipes : ఆదివారం నాన్‌వెజ్ లేకుంటే.. చాలా మంది అది వీకెండే కాదు. పైగా బోనాల సమయంలో మటన్ ఉండాల్సిందే. అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే మటన్ పులావ్ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం.
Bonalu Special Mutton Pulao Recipe : నాన్‌వెజ్‌లో మటన్కుండే క్రేజ్ వేరు. చికెన్ కంటే మటన్‌ని కొందరు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా తెలంగాణలో మటన్ లేనిదే పండుగ ఉండదు. ప్రతి ఈవెంట్లో ముక్కగా మటన్ ఉండాల్సిందే. అయితే వర్షకాలంలో.. అదీ బోనాల సమయంలో.. వేడి వేడిగా టేస్టీ మటన్ పులావ్ తినాలి అనుకుంటే ఈ ఈజీ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. దీనిని ఎలా చేయాలి. కుక్కర్లో వండేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మటన్ - అరకిలో
బాస్మతీ బియ్యం - రెండు కప్పులు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్స్
నూనె - 4 టేబుల్ స్పూన్లు
యాలకులు - 2
లవంగాలు - 4
దాల్చిన చెక్క - 2 ఇంచులు
షాజీరా - అర టీస్పూన్
బిర్యానీ ఆకులు - 3
కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
పుదీనా ఆకులు - పావు కప్పు
కొత్తిమీర - పావు కప్పు
ఉల్లిపాయలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
టోమాటో - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
వేడి నీళ్లు - 3 కప్పులు
తయారీ విధానం
ముందుగా మటన్‌ను బాగా కడిగి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిలో కారం, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు, పుదీనా తురుము వేయాలి. ఇవి మటన్‌కి పట్టేలా బాగా కలిపి మారినేషన్ను చేయాలి. దీనిని ఓ రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి. లేదంటే ముందు రోజు రాత్రి దీనిని సిద్ధం చేసుకున్నా.. మటన్ పులావ్ చేసుకునేందుకు ఇది సిద్ధంగా ఉంటుంది. అలాగే పులావ్ చేసుకునే అరగంట ముందు బాస్మతి రైస్‌ను కడిగి పెట్టుకోవాలి. వంట ప్రారంభించే ముందు ఉల్లిపాయలను పొడుగ్గా, సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకోవాలి. అలాగే టోమాటో ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిలో నూనె వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ రంగు రాగానే దానిలో టోమాటో ముక్కలు వేసి ఉడికించాలి. అనంతరం మారినేట్ చేసుకున్న మటన్‌ని వేసి.. బాగా కలపాలి. దానిలో ముప్పావు కప్పు నీరు వేసి.. బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టి.. దానిని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
అనంతరం దానిలో నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుని.. దానిని ఉడికించిన మటన్‌లో బాగా కలపాలి. అనంతరం దానిలో నెయ్యి వేసి బాగా కలపాలి. పుదీనా ఆకులు, కొత్తిమీర తురుము వేసుకుని.. బాగా కలపాలి. దానిలో మూడు కప్పుల వేడి నీళ్లు వేసుకుని.. బాగా కలపాలి. మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ప్రెజర్ పోయేంతవరకు కుక్కర్ మూత తీయకూడదు. అనంతరం మూత తీస్తే టేస్టీ మటన్ పులావ్ రెడీ. దీనిని మీరు ఉల్లిపాయలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకోవచ్చు.
పైగా దీనిని నేరుగా తినేయొచ్చు. ఎలాంటి గ్రేవి అవసరం ఉండదు. టోమాటో ముక్కలు.. మంచి పులుపుతో పాటు రుచిని అందిస్తాయి. అలాగే రైతాతో దీనిని తీసుకున్నా టేస్ట్ అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. బోనాల సమయంలో చక్కగా మటన్ పులావ్ చేసుకుని.. హాయిగా ఇంటిల్లిపాది ఆస్వాదించేయవచ్చు. బ్యాచిలర్స్ కూడా దీనిని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.
Also Read : టేస్టీ టేస్టీ బర్ఫీ.. ఇంట్లోనే తేలికగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ ఇది